పదికి తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2022-11-16T00:40:18+05:30 IST

కొందరు ప్రజా ప్రతినిధులు ఏ స్థాయికి పతనమయ్యారో చెప్పే సంఘటన ఇది. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యత ఉండేలా, సకాలంలో పూర్తయ్యేలా చేయాల్సినవారు.. స్వలాభం కోసం ఏకంగా పనులనే వద్దనే స్థాయికి వెళ్లారు. అడిగినంత కమీషన ఇచ్చి తీరాల్సిందేనని కుండ బద్ధలు కొడుతున్నట్లు తెలిసింది. అనంతపురం నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న పంచాయితీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కమీషన విషయంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధం బహిరంగ వేదికపైకి చేరేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు.

పదికి తగ్గేదేలే..!

ఆ మాత్రం ఇవ్వలేకుంటే పనులే చేయొద్దు

కాంట్రాక్టర్లకు కొందరు కార్పొరేటర్ల అల్టిమేటం

నగర పాలికలో పనుల పండుగ.. కమీషన జాతర

పంచాయితీ పెద్దలుగా ‘టాప్‌ త్రీ’ ప్రజా ప్రతినిధులు

అనంతపురం క్రైం, నవంబరు 15: కొందరు ప్రజా ప్రతినిధులు ఏ స్థాయికి పతనమయ్యారో చెప్పే సంఘటన ఇది. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల్లో నాణ్యత ఉండేలా, సకాలంలో పూర్తయ్యేలా చేయాల్సినవారు.. స్వలాభం కోసం ఏకంగా పనులనే వద్దనే స్థాయికి వెళ్లారు. అడిగినంత కమీషన ఇచ్చి తీరాల్సిందేనని కుండ బద్ధలు కొడుతున్నట్లు తెలిసింది. అనంతపురం నగరపాలక సంస్థలో కొందరు కార్పొరేటర్లు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న పంచాయితీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కమీషన విషయంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధం బహిరంగ వేదికపైకి చేరేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. తమ డివిజనలో ఎలాంటి పనిచేసినా తమకు 10 శాతం కమీషన ఇవ్వాలని అధికశాతం కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. అంత కుదరదని, 5 శాతమే ఇవ్వగలమని వారు అంటున్నారు. అంత తక్కువైతే అవసరం లేదని.. 10 శాతం ఇవ్వకపోతే పనులు చేయకపోయినా పర్వాలేదని కొందరు కార్పొరేటర్లు తెగేసి చెప్పారని సమాచారం. ఈ పంచాయితీని తేల్చే బాధ్యతను నగరపాలికలోని టాప్‌ త్రీ ప్రజాప్రతినిధులు తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం.

పనులు చేయకపోయినా పర్వాలేదట..

నగర పాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టు పనులను దక్కించుకున్నవారు కార్పొరేటర్లకు రెండు నుంచి మూడు శాతం మాత్రమే కమీషన ఇచ్చేవారని తెలుస్తోంది. ఇది ఏమాత్రం చాలదని, ఆ కాస్త సొమ్మును తాము తీసుకోవడం ఏమిటని కొందరు కార్పొరేటర్లు అంటున్నట్లు సమాచారం. తమ రేంజ్‌కు తగ్గట్టుగా కమీషన అడిగేందుకు కొందరు ఇటీవల సమావేశమయ్యారు. ఈ విషయమై కొన్నిరోజుల క్రితం ‘టాప్‌ త్రీ’ని కలిసి చర్చించినట్లు సమాచారం. తాజాగా రెండురోజుల క్రితం మరోసారి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ డివిజన్ల పరిధిలో పనిచేసే కాంట్రాక్టర్లు ఏ పనిచేసినా 10 శాతం కమీషన ఇచ్చేలా చూడాలని పట్టుబట్టారని సమాచారం. దీంతో వారు కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడారు. కానీ 10 శాతం ఇచ్చే పరిస్థితి లేదని, ఖర్చులు పెరిగిపోయాయని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కార్పొరేటర్లకు ‘టాప్‌ త్రీ’ నాయకులు తెలియజేశారు. ఐదుశాతంతో సర్దుకోవాలని సూచించారు. కానీ వారు ఏమాత్రం తగ్గేదే లేదని అన్నారట. ఐదు శాతం కమీషన అయితే అవసరం లేదని, 10 శాతం కావాల్సిందేనని అన్నారట. ఆ మాత్రం ఇవ్వలేకపోతే పనులు చేపట్టకపోయినా పర్వాలేదని నిర్మొహమాటంగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. పైగా, తమకు పైనుంచి సపోర్ట్‌ ఉందని కూడా టాప్‌ త్రీ వద్ద చెప్పినట్లు సమాచారం. దీంతో మరోమారు వారు కాంట్రాక్టర్లతో మాట్లాడారని, ‘చూద్దాం.. పనులు పిలుస్తున్నారు కదా.. ఎవరెవరికి వస్తాయో.?’ అని కాంట్రాక్టర్లు వాయిదా వేశారని తెలిసింది.

రూ.8 కోట్ల పనులు..

నగర పాలిక పరిధిలో ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల పేరిట రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతోపాటు సాధారణ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.8 కోట్లతో పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కల్వర్టుల నిర్మాణం తదితర పనులను చేపట్టేందుకు త్వరలో టెండర్లను పిలుస్తున్నారు. ఈ సొమ్ములో వాటా కోసం కొందరు కార్పొరేటర్లు 10 శాతం బేరం పెట్టారు. ఆ మాత్రం కమీషన ఇస్తేనే తమ డివిజనలో పనులు చేయాలని, లేదంటే అవసరమే లేదని అంటున్నారట. అంటే.. తమ జేబులు నింపకపోతే.. అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటారన్నమాట..!

Updated Date - 2022-11-16T00:40:22+05:30 IST