గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకి పచ్చజెండా
ABN , First Publish Date - 2022-12-16T23:53:53+05:30 IST
కోడూరు-మేదరమెట్ల మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి (గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే) నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. బెంగళూరు-విజయవాడ మధ్య ఈ రహదారి నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలైంది.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం
జిల్లాలో 75 కిలోమీటర్లు..
716.38 హెక్టార్ల భూసేకరణ
20 నుంచి రెవెన్యూ గ్రామసభలు
రైతులకిచ్చే పరిహారంపై బెంగ
పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి
కోడూరు-మేదరమెట్ల మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి (గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే) నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. బెంగళూరు-విజయవాడ మధ్య ఈ రహదారి నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలైంది. రహదారి నిర్మాణంలో అవసరమైన భూసేకరణ ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎనహెచఏఐ) అధికారులు ప్రకటన ఇచ్చారు. సర్వే పనులు కొలిక్కిరావడంతో టెండర్ల ప్రక్రియ మొదలైంది. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నదే లక్ష్యం. జిల్లాలో 75 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు. గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఖర్చు చేయనుంది. పనులు పూర్తయితే బెంగుళూరు నుంచి విజయవాడకు ప్రయాణ సమయం తగ్గనుంది. వాహనాల వేగం కూడా పెరగనుంది. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చెన్నై-కోల్‌కతా 16వ నెంబరు జాతీయ రహదారితో జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు వద్ద 44వ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తారు. 342.5 కిలోమీటర్ల మేర 70 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో రహదారిని నిర్మించనున్నారు. 15 నుంచి 20 కిలోమీటర్ల వ్యవధిలో ఇక ప్రవేశ కూడలి ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో 75 కిలోమీటర్ల ఎక్స్‌ప్రె్‌స వే
గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే రహదారి నిర్మాణానికి భూసేకరణపై జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జూనలోనే ప్రకటన వెలువరించింది. కడప జిల్లా నుంచి జిల్లాలోకి రహదారి తలుపుల మండలం లక్కసముద్రం, ఓదులపల్లె గ్రామాల పరిధిలో ప్రవేశిస్తుంది. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద 44 జాతీయ రహదారి వరకు 75 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం మూడు దశల్లో చేపట్టనున్నారు. ఈ ఎక్స్ప్రె్సవేకి 716.38 హెక్టార్ల మేర భూసేకరణ చేపట్టారు. ఇందులో ప్రైవేటు, అసైన్డ, పోరంబోకు, గ్రామకంఠం, చుక్కల, ప్రభుత్వ, తదితర భూములున్నాయి. ఇప్పటికే భూసేకరణకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం రైతులతో సమావేశాలు నిర్వహించారు. హద్దుల రాళ్లు ఏర్పాటు చేశారు. భూసమస్యల పరిష్కారం, గ్రామ సభలతో ప్రజాభిప్రాయ సేకరణ, పరిహారం, తుది భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంది. ఇందు కోసం ఈనెల 20 నుంచి రెవెన్యూ గ్రామసభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిహారంపై బెంగ
గీనఫీల్డ్ ఎక్స్ప్రె్సవేకి జిల్లాలో తలుపుల మండలం ఓదులపల్లె, లక్కసముద్రం, కదిరి మండలం పట్నం, ముదిగుబ్బ మండలం దేవరగుడిపల్లె, మలకవేముల సానేవారిపల్లె మీదుగా నల్లమాడ, రెడ్డిపల్లి, వంకరకుంట, పుట్టపర్తి మండలం అమగొండపాలెం, సతరాలపల్లె, గోరంట్ల మండలం గౌనివారిపల్లి, జక్కసముద్రం, మారేడుపల్లి, బాయనకుంటపల్లె, వానావోలు, పులేరు, బూదిలి, చిలమత్తూరు మండలం శెట్టిపల్లి, చాగలేరు. కోడూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో భూములు కోల్పోనున్నారు. ఆ భూములకు పరిహారంపై రైతుల్లో టెన్షన నెలకొంది. ఆయా ప్రాంతాల్లో భూముల రిజస్ర్టేషన విలువ, క్రయవిక్రయాల ఆధారంగా నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మారుమూల పల్లెల్లో కూడా రిజిస్ర్టేషన విలువ కంటే బహిరంగ మార్కెట్లో పదింతలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఎక్స్‌ప్రెస్ వే భూముల పరిస్థితి కూడా అంతే. రిజిస్ర్టేషన విలువ, బహిరంగ మార్కెట్లో ధరల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. రిజిస్ర్టేషన విలువ ప్రకారం పరిహారం ఇస్తే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. పట్టణాల సమీపంలోని భూములు ఎకరా రూ.కోటికిపైగానే పలుకుతున్నాయి. తలుపుల, మలకవేముల, పట్నం, నల్లమాడ, వంకరకుంట, రెడ్డిపల్లి, ఆమగొండపాలెంతోపాటు గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో భూముల విలువలు భారీగా పెరిగాయి. ఇందులో చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుతో ఎకరం రూ.50లక్షలుపైగానే పలుకుతోంది. జిల్లాలో గ్రీనఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణంలో కోల్పోయే భూములకు అంత ఇవ్వకపోవచ్చు అన్న ఆందోళన నెలకొంది.