అధికార దర్పం

ABN , First Publish Date - 2022-09-28T05:37:52+05:30 IST

పట్టణ మున్సిపల్‌ మీట్‌లో వైసీపీ కౌన్సిలర్లు అధికార దర్పం ప్రదర్శించారు. అధికార పార్టీ కౌన్సిలర్లకు తెలియకుండా హిందూపురంలో ఏ వార్డు సచివాలయంలోనూ ఏ పనీ చేయరాదంటూ మున్సిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డి హకుం జారీ చేశారు.

అధికార దర్పం

మాకు తెలియకుండా సచివాలయాల్లో ఏ పనీ చేయరాదు..

హిందూపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన హుకుం

నా ఇంటికే కొలతలు వేస్తారా?: వైసీపీ కౌన్సిలర్‌ ఆగ్రహం

అవాక్కయిన అధికారులు

మున్సిపల్‌ మీట్‌లో హంగామా

హిందూపురం, సెప్టెంబరు 27


పట్టణ మున్సిపల్‌ మీట్‌లో వైసీపీ కౌన్సిలర్లు అధికార దర్పం ప్రదర్శించారు. అధికార పార్టీ కౌన్సిలర్లకు తెలియకుండా హిందూపురంలో ఏ వార్డు సచివాలయంలోనూ ఏ పనీ చేయరాదంటూ మున్సిపల్‌ వైస్‌ చైర్మన బలరామిరెడ్డి హకుం జారీ చేశారు. ఆయన మాటలతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని ఓ అంశంపై వైస్‌ చైర్మన బలరామిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో అధికార పార్టీ కౌన్సిలర్లకు తెలియకుండా సచివాలయాల్లో ఏ పనీ చేయకూడదన్నారు. భవన నిర్మాణ అనుమతులు కూడా ఇవ్వరాదన్నారు. దీనిపై వార్డు అడ్మిన్లను చాంబర్‌కు పిలిపించుకుని, గట్టిగా చెప్పాలంటూ చైర్‌పర్సన, మునిసిపల్‌ కమిషనర్‌ను కోరారు. మరో కౌన్సిలర్‌ నాగమణి మాట్లాడుతూ.. తన వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ఒక భవనం నిర్మిస్తున్నారని టౌనప్లానింగ్‌ అధికారులకు సమాచారం ఇస్తే. వారు ఏకంగా తన ఇంటికే వచ్చి కొలతలు వేశారని మండిపడింది. అసలు అధికార పార్టీ కౌన్సిలర్‌ ఇంటికి కొలతలు వేసే అధికారం వారికెక్కడిదని ప్రశ్నించారు. ఆమె మాటలతో అక్కడున్నవారు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఎంజీఎం మైదానంలో దుకాణాల తొలగింపు విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం సాగింది. అజెండాలోని 58 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన జబీవుల్లా, అధికారులు పాల్గొన్నారు.Read more