వీర హనుమాన
ABN , First Publish Date - 2022-05-26T05:57:06+05:30 IST
జిల్లావ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.

జిల్లావ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు..
పురంలో వేలాది మందితో శోభాయాత్ర..
బైక్ ర్యాలీ
హిందూపురం టౌన, మే 25: జిల్లావ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. అంజనీపుత్రుడికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. హిందూపురంలో అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించారు. సూగూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. యువకులు భారీఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రత్యేకంగా చేయించిన 15 అడుగుల హనుమంతుడి విగ్రహం, సీతారాముల మూలవిరాట్‌ను ప్రత్యేక రథంలో ఉంచి, శోభాయాత్రగా తీసుకెళ్లారు. చిన్నమార్కెట్, పేటవీధి, అంబేడ్కర్ సర్కిల్, తెలుగుతల్లి సర్కిల్ మీదుగా చౌడేశ్వరి కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు యాత్ర సాగింది. భక్తులు తలపాగా, కండువాలు ధరించి, ఆంజనేయుడిని స్మరిస్తూ యాత్రలో పాల్గొన్నారు. డీజేతో సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగించారు. భక్తిపారవశ్యంతో శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా హిందూ సురక్ష ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. అంతకు ముందు హనుమాన చాలీసా పఠించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఏఎస్పీ రామకృష్ణ, పెనుకొండ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు, 200మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో హిందూసురక్ష, విశ్వహిందూపరిషత నాయకులు వైటీపీ శ్రీనివాసులు, చారుకీర్తి, కురుబ చలపతి, వెంకటరమణప్ప, రాయల్ గోపాల్, టీకే బాబు, బీజేపీ నాయకులు పార్థసారథి, రమే్‌షరెడ్డి, అంజలి, బజరంగ్‌దళ్ నవీన పాల్గొన్నారు.