గుట్టలుగా గుట్కా..!

ABN , First Publish Date - 2022-10-08T04:57:26+05:30 IST

సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి జిల్లాలోకి గుట్కా అక్రమ మార్గాల్లో గుట్టలుగా వచ్చి పడుతోంది. గుట్కా రవాణా జోరుగా సాగుతోంది.

గుట్టలుగా గుట్కా..!

చాపకింద నీరులా సాగుతున్న అక్రమ వ్యాపారం 

కర్ణాటక నుంచి జిల్లాలోకి భారీగా సరఫరా 

సిబ్బంది సహకారం పుష్కలం?

హిందూపురం

సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి జిల్లాలోకి గుట్కా అక్రమ మార్గాల్లో గుట్టలుగా వచ్చి పడుతోంది. గుట్కా రవాణా జోరుగా సాగుతోంది. గుట్కాపై నిషేధం ఉన్నా కొంతమంది అక్రమార్కులు.. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండతో యథేచ్ఛగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుట్కా నియంత్రణకు సెబ్‌ను ఏర్పాటు చేసినా.. సరిహద్దుల్లో ఔట్‌పోస్టులు ఏర్పాటు చేసినా.. ఎస్పీఓలను నియమించినా.. రవాణా ఆగట్లేదన్న వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆఖరుకు ప్రభుత్వం.. ఎస్‌పీఓలకు ఇంటికి పంపింది. సరిహద్దులో ఏర్పాటుచేసిన ఔట్‌పోస్టు షెడ్లు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయే తప్ప.. అక్రమ దందాలు ఆగలేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే అక్రమ రవాణాకు విడతలవారీగా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కర్ణాటక నుంచి గుట్కా పెద్దఎత్తున జిల్లాలోకి వచ్చి పడుతోంది.


చాపకింద నీరులా..

గుట్కా వ్యాపారం జిల్లావ్యాప్తంగా చాపకింద నీరులా సాగుతోంది. కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలోకి దిగి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్న గుట్కా మాఫియా ఈ వ్యాపారాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని మరింత జోరుగా సాగిస్తూ.. ప్రతినెలా లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకులు కూడా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


కర్ణాటక నుంచి భారీగా సరఫరా

కర్నాటక నుంచి జిల్లాలోకి భారీ ఎత్తున గుట్కా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అడపా దడపా దాడులు చేసినపుడు భారీ ఎత్తున పట్టుబడుతుండడమే ఇందుకు నిదర్శనం. మడకశిర మొదలుకుని కదిరి ప్రాంతం వరకు ఉన్న కర్ణాటక సరిహద్దులో దందా విచ్చలవిడిగా సాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, రూరల్‌ మండలంలోని సరిహద్దుల్లో కర్ణాటక నుంచి ప్రతినిత్యం జిల్లాలోకి వాహనాల్లో రవాణా అవుతున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. చిలమత్తూరు మండలం జాతీయ రహదారిపై ఉండటంతో ఇక్కడ నిత్యం గుట్కా దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలిగా గుట్కా రవాణా, విక్రయాలపై దాడులు చేయడం పోలీసులు మానేసినట్లు తెలుస్తోంది. గతంలో భారీ ఎత్తునే పట్టుబడింది. ఇటీవల దాడులు చేసిన దాఖలాలు లేవు. లేపాక్షి మండలం నుంచి కూడా జిల్లాలోకి గుట్కా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం మండలంలోని సరిహద్దులో పారిశ్రామిక వాడ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందినవారు వేలాదిమంది కార్మికులు ఉన్నారు. ఇక్కడికి నిత్యం ద్విచక్రవాహనంలో గుట్కా సరఫరా చేస్తున్నట్లు సమాచారం.


సిబ్బంది సహకారం పుష్కలం?

గుట్కా వ్యాపారానికి కిందిస్థాయి సిబ్బందితోపాటు కొంతమంది అధికారులు సహకరిస్తున్నట్లు ఆ శాఖలో కోడై కూస్తోంది. హిందూపురం ప్రాంతంలో కొన్ని పానబీడాషాపుల్లో వెయ్యిదాకా రోజూ అమ్ముడుపోయేవి. ప్రస్తుతం 100 నుంచి 200కి పడిపోయినట్లు పానషాపు యజమానులు చెబుతున్నారు. దీనికి కారణం గుట్కా దందా పెరిగిపోవడమేనని బహిరంగంగా పేర్కొంటున్నారు. గుట్కా లేకపోతే పానబీడావ్యాపారం పెరిగేదన్నారు. దీనిని బట్టి గుట్కా వ్యాపారం ఇటీవల పెరిగిందని ఇందుకు పోలీసు శాఖలోని కొందరు సిబ్బంది సహకారం వారికి పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. హిందూపురంలో గతం నుంచి గుట్కా వ్యాపారం నిర్వహించడమేకాక కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే పోలీసులు దాడులు చేయడానికి జంకుతున్నారని అధికార పార్టీలోనే చర్చించుకుంటున్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు గుట్కా వ్యాపారంలో వెనుకుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


నామమాత్రపు చర్యలు

రాష్ట్రంలో గుట్కాపై నిషేధం అమలులో ఉంది. వాటిని తయారుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు అంటుంటారు. పట్టుబడినపుడు మాత్రం నామమాత్రంగా కేసుల నమోదు, చర్యలతో సరిపెడుతుంటారు. దీంతో అక్రమ వ్యాపారం సజావుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన గుట్కాను ఇక్కడ రెట్టింపు ధరలకు విక్రయిస్తుండడంతో అక్రమార్కులపై కాసుల వర్షం కురుస్తోంది. దీంతో వ్యాపారాన్ని వదులుకోవడానికి వారు ఏమాత్రం ఇష్టపడటం లేదు.

Updated Date - 2022-10-08T04:57:26+05:30 IST