అనుచరగణం దందా

ABN , First Publish Date - 2022-03-05T05:38:40+05:30 IST

కదిరి పేరు చెబితే ఇక్కడ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి. పొట్ట చేతబట్టుకుని దూర ప్రాంతాలకు, అరబ్‌ దేశాలకు వలస వెళ్లేవారి కన్నీటి గాథలు మదిలో మెదులుతాయి.

అనుచరగణం దందా
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌

మట్కా, గుట్కా, లాటరీ, ఇసుక

యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు

నెలవారీ  మామూళ్లతో గప్‌చుప్‌..?

జూదాల ఊబిలోకి కదిరి పేదలు


కదిరి పేరు చెబితే ఇక్కడ ప్రజల కష్టాలు గుర్తొస్తాయి. పొట్ట చేతబట్టుకుని దూర ప్రాంతాలకు, అరబ్‌ దేశాలకు వలస వెళ్లేవారి కన్నీటి గాథలు మదిలో మెదులుతాయి. ఇలాంటి ప్రాంతం అభివృద్ధికి నాయకులు పాటుపడాలి. స్థానికంగా ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. పేదరికం ఉన్నచోట అసాంఘిక కార్యక్రమాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చి, వాటి జోలికి వెళ్లకుండా చూడాలి. కానీ స్థానికంగా ఓ ముఖ్య నాయకుడు, కొందరు పోలీసులు అసాంఘిక చర్యలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలను జూదాల ఊబిలోకి దించేవారికి పరోక్షంగా సహకరిస్తు న్నారన్న అపప్రధను మూటగట్టుకుంటున్నారు. కదిరి డివిజన పరిధిలో, మరీ ముఖ్యంగా పట్టణంలో చాపకింద నీరులా విస్తరించిన లాటరీ, మట్కా, గుట్కా, ఇసుక అక్రమ వ్యాపారాల వెనుక ఓ ముఖ్య నాయకుడు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులే అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇందుకు గానూ కొందరు పోలీసులు, వ్యక్తులకు నెలవారీ మామూళ్లు ముడుతున్నాయని సమాచారం. - కదిరి


లాటరీ లూఠీ

కదిరి పట్టణంలో చాపకింద నీరులా లాటరీ మహమ్మారి విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా గుట్టుగా వ్యవహారం సాగుతోంది. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని లాటరీ టిక్కెట్లను అమ్ముతున్నారు. ప్రధానంగా మురికి వాడలను టార్గెట్‌ చేసుకున్నారు. పేద, మధ్య తరగతి వారికి డబ్బు ఆశ చూపి లాటరీ టిక్కెట్లను అంటగడుతున్నారు. తమిళనాడులోని వేలూరు నుంచి ఖలీమ్‌ అనే వ్యక్తి ఈ టిక్కెట్ల జిరాక్స్‌ తెప్పించి, తన ఏజెంట్ల చేత అమ్మిస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని చౌక్‌, నిజాంవలి కాలనీ, గాంధీనగర్‌, రైల్వే స్టేషన, ఏఆర్‌ఎస్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, కుటాగుళ్లలో వీటిని అమ్ముతున్నారు. తమ వద్ద రెగ్యులర్‌గా కొనే వారికే టిక్కెట్లను అమ్ముతున్నారు. వీటి ధర రూ.50 నుంచి రూ.200 వరకు ఉంది. ప్రైజ్‌ మనీ కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. లాటరీ నిర్వాహకుల నుంచి ఏజెంట్లకు 20 శాతం కమీషన అందుతోందని, స్థానికంగా టిక్కెట్లు అమ్మేవారు పంచుకుంటున్నారని సమాచారం. లాటరీ తగిలిన వారికి అమ్మినవారే నేరుగా డబ్బు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కొందరు పోలీసుల సహకారంతో ఈ దందా విస్తరించినట్లు సమాచారం. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా పోలీసు అధికారులకు లాటరీ నిర్వాహకులు మామూళ్లు ముట్టజెప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నెలకు రూ.2 లక్షల వరకు స్టేషనకు చేరుతున్నట్లు సమాచారం. పోలీసుల ఒత్తిడి లేనందుకే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని పట్టణ ప్రజలు అంటున్నారు.


ఆనలైనలో మట్కా

కదిరి ప్రాంతంలో ఆనలైన మట్కా సాగుతోంది. పట్టణానికి చెందిన ఖలీల్‌ అనే వ్యక్తి కొన్ని రోజులుగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఈ వ్యక్తి పలుమార్లు పోలీసు లకు  పట్టుబడినట్లు సమాచారం. మట్కా నిర్వాహకులు ఉదయం వచ్చే ఓపెన నెంబర్‌ను ఆనలైన ద్వారా బీటర్లకు పంపుతున్నారు. వారు మట్కా ఆడేవారికి పంపి స్మార్ట్‌ ఫోనల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ విధానంలో డబ్బు వసూలు చేస్తున్నారు. మధ్యాహ్నం వచ్చే క్లోజ్‌కు, బ్రాకెట్‌పై (రెండు నెంబర్లు కలిపి) పందెం కాసేవారికి  కూడా ఇదే విధానం పాటిస్తున్నారు.  ఫలి తం వచ్చిన వెంటనే ఫోన ద్వారా మెసేజ్‌లు పంపుతున్నట్లు తెలిసింది. మట్కా నెంబర్‌ తగిలినవారికి కూడా డిజిటల్‌ పేమెంట్‌ చేస్తున్నారని తెలిసింది. ముంబై కేంద్రంగా ఈ మట్కాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఊబిలో దిగి పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. మట్కా మాయలో పడి వేలాది రూపాయలు నష్టపోతున్నారు.  మట్కా నిర్వాహకులు కూడా పోలీ్‌సస్టేషనకు మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెలకు రూ.1.50 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ప్రతిరోజు మట్కా ద్వారా రూ.5 లక్షల వరకు వసూలు అవుతున్నట్లు సమాచారం.


గుట్కా గుప్పు

కదిరి పట్టణంలో ఎక్కడ చూసినా గుట్కా గుప్పుమంటోంది. చిన్న చిన్న దుకాణాలు, కొన్ని పెద్ద దుకాణాలకు కూడా గుట్కా ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయి. సందుల్లో ఉండే కొన్ని దుకాణాల్లో అమ్మకాలు జోరుగాసాగుతున్నాయి. గుట్కాకు అలవాటుపడ్డవారు నేరుగా దుకాణాలకు వెళ్లి కొంటున్నారు. రకరకాల పేర్లతో వీటిని అమ్ముతున్నారు. కదిరి సబ్‌ డివిజన అంతటా గుట్కా వ్యాపారం కొనసాగుతున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి ప్యాకెట్లను తెచ్చి అమ్ముతున్నట్లు తెలిసింది. పట్టణానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి దీని వెనుక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పోలీసులకు తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారని వినియోగదారులే చెబుతున్నారు. 


అక్రమ ఇసుకకు అడ్డే లేదు

ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వివిధ మార్గాల నుంచి పట్టణంలోకి చేరుతోంది. అనంతపురం రోడ్డు నుంచి వచ్చే ఇసుక వాహనాలను ట్రాన్సకో కార్యాలయం వద్ద నిలుపుతున్నారు. రేవు నుంచి ఇసుకను కొనుగోలుచేసిన వారు కూడా అక్కడే ఉంటారు. కొందరు ట్రాక్టర్ల యజమానులు పాత రసీదుల తో ఇసుకను అమ్ముతున్నారు. స్థానికంగా ఉన్న వంకల నుంచి తెచ్చిన ఇసుకు ధర ట్రాక్టర్‌కు రూ.5 వేలకు పైగా పలుకుతోంది. పట్టపగలే ఇసుక అక్రమ రవాణా జరు గుతున్నా సెబ్‌ పోలీసులుగాని, స్థానిక పోలీసులు గాని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. వీరికి ఇసుక వ్యాపారుల నుంచి నెలవారి మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.


కఠిన చర్యలు తీసుకుంటున్నాం..

లాటరీ, మట్కా, ఇసుక అక్ర మ రవాణా కట్టడికి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. మట్కా, లాటరీ నిర్వహించిన వారిపై గతంలో రౌడీషీట్‌ తెరిచాము. లాటరీ, మట్కా, గు ట్కా, ఇసుక అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. పోలీసు శాఖలో మామూళ్ల సంప్రదాయం లేదు. అలా జరుగుతున్నట్లు మా విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవు. 

- భవ్య కిషోర్‌, కదిరి డీఎస్పీRead more