భ్రూణ హత్యలు!

ABN , First Publish Date - 2022-10-14T05:18:39+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లాల్లో లింగనిష్పత్తి తేడా ఆందోళన కలిగిస్తోంది.

భ్రూణ హత్యలు!

 - ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

 - జిల్లాలో  లింగ నిష్పత్తి 1000 : 897 

-  గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు 

 - భ్రూణహత్యల నివారణ చట్టానికి తూట్లు

 -  ఇలాగైతే ఆడపిల్లల మనుగడ ప్రశ్నార్థకమే

  పుట్టపర్తి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లాల్లో లింగనిష్పత్తి తేడా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన కొన్ని నెలలుగా జిల్లా వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే మగశిశువుల కంటే ఆడ శిశువులే తక్కువగా జన్మిస్తున్నారు. అబ్బాయే పుట్టాలన్న పట్టుతో కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. బిడ్డ కడుపులో ఉండగానే ఆడ, మగ అని నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకుంటున్నారు. మగ బిడ్డ అయితే సంతోషంగా కొనసాగించడం.. ఆడ శిశువు అయితే వద్దనుకుని అబార్షన్లు చేయించుకోవడం ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. లింగనిర్ధారణ నిషేధం అమలులో ఉన్నా కొంతమంది వైద్యులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. లింగనిర్ధారణ కోసం డబ్బును తీసుకుని భ్రూణ హత్యలకు కారణమవుతున్నారు. 

 ఈ ఏడాది మొదటి 9 నెలల్లో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జన్మించిన జననాల సంఖ్యలో మగశిశువుల కంటే ఆడశిశువులే తక్కువగా జన్మిస్తున్నారు. కొన్నేళ్ల కిందట వరకు ఆడ, మగ జననాల మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండేది కాదు. ప్రస్తుతం లింగ నిష్పత్తిలో గణనీయమార్పులు వచ్చాయి. ప్రభుత్వం లింగనిర్ధారణ పరీక్షలను పూర్తిగా నిషేధించింది. అయినా కొన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో నేటికీ రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితంగానే మగశిశువుల కంటే ఆడశిశువుల జననాల సంఖ్య పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు దాకా జననాల నమోదును పరిశీలిస్తే జిల్లాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 879 మంది అమ్మాయిలే ఉన్నట్లు తేలింది. ఇటీవల ఆడశిశువుల జననాల తగ్గుదలకు లింగ నిర్ధారణే ప్రధాన కారణంగా ఉన్నట్లు వైద్యనిపుణులు భావిస్తున్నారు. 


గుట్టుగా స్కానింగ్‌!


  ఓ వైపు గర్భస్థలింగ నిర్ధారణ నిషేధ చట్టం కఠనంగా అమల్లో ఉన్నా మరోవైపు కొన్ని స్కానింగ్‌ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ చేస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులతో పాటు నగర ప్రాంతాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని పెద్ద బోర్డులు పెట్టినా కొందరు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు.  ప్రధానంగా ప్రైవేట్‌లో గైనకాలజిస్ట్‌, రేడియాలజి్‌స్టలు ప్రత్యేక కోడ్‌ పద్ధతిలో పుట్టేది ఎవరనేది చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మాయి భారం అనుకునేవారు అబార్షన చేయించుకుంటున్నారు. ఈవ్యవహారంలో రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగానే డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల ఆడశిశువుల జనన రేటు తగ్గుతున్న నేపథ్యంలో లింగనిష్పత్తి భారీగా తగ్గుతోంది. లింగానిర్ధారణ చేపట్టకపోతే ప్రతి నెల మగశిశుల కంటే ఆడశిశువుల సంఖ్య తగ్గుదల మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ కొన్ని వర్గాల్లో వధువులు దొరకని పరిస్థితి నెలకొంది. దీనిని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఆడపిల్లల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. 


చట్టం ఏం చెబుతోంది? 


గర్భస్థ పిండ పరీక్షల ప్రక్రియ(నియంత్రణ, దురుపయోగ నివారణ)-1994 చట్టం ప్రకారం లింగ నిర్ధారణకు పాల్పడటం చట్టరీత్యా నేరం. లింగ నిర్ధారణకు పాల్పడితే మూడేళ్ల పాటు జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధిస్తారు. అదేవిధంగా వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యుడిని కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్‌ చేస్తారు. లేదంటే పూర్తిగా వైద్య సర్టిఫికెట్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. లింగ నిర్ధారణ జరిగిందని తెలిసీ అబార్షన నిర్వహించిన గైనకాలజిస్ట్‌ కూడా మూడేళ్ల జైలుశిక్షకు గురవుతారు. స్కా నింగ్‌, డయాగ్నస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు.


జిల్లాలో భారీ వ్యత్యాసం


శ్రీసత్యసాయి జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే లింగ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 16,670 మంది జన్మించారు. ఇందులో మగశిశువులు 8,733 మంది ఆడశిశువులు 7,936 మంది జన్మించారు. ఆ లెక్కన చూస్తే ఆడశిశువుల కంటే 798 మంది మగశిశువులు అధికంగా జన్మించినట్లు తేడా కనిపించింది. ఇందులోనూ ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాలను పరిశీలిస్తే... ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే మగశిశువులు అధికంగా జన్మించారు. ఏది ఏమైనా లింగ నిష్పత్తిని పరిశీలిస్తే ఆందోళన కలగక మానదు. 


లింగనిర్ధారణ పరీక్షలు నేరం 

- డాక్టర్‌ నీరజ, గైనకాలజిస్ట్‌, హిందూపురం

ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మిలా భావించాలి. బరువు అనుకోకూడదు. ఇటీవల ఆడ, మగ జననాల్లో లింగనిష్పత్తి వ్యత్యాసానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వరకట్న నిషేధ చట్టాన్ని కఠనంగా అమలు పరుస్తూనే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మహిళల పట్ల గౌరం పెరుగుతుంది. అదేవిధంగా స్ర్తీ,పురుషులు సమానత్వం అని నినాదాన్ని బలపరచాలి. లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. పరీక్షలు చేసిన వారితోపాటు చేయించుకున్న వారిపై చర్యలు కఠినంగా తీసుకోవాలి. స్ర్తీ పురుషులు మధ్య వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత  అందరిపై ఉంది. అప్పుడే లింగనిష్పత్తి మధ్య తేడా ఉండదు. సమాజంలో కూడా స్త్రీ, పురుష బేధం ఉండకూడదు.




Updated Date - 2022-10-14T05:18:39+05:30 IST