ధర్మవరంలో నియంత..!

ABN , First Publish Date - 2022-12-07T00:06:16+05:30 IST

నియంతృత్వ పోకడలు పరాకాష్టకు చేరాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆయన ఆదేశాలు తూచ తప్పకుండా అమలు చేస్తే అధికారులు అక్కడ కొనసాగుతారు, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనన్న ప్రచారం ఉంది.

ధర్మవరంలో నియంత..!
ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం

చెప్పినట్లు చేస్తే ఉండండి..

లేకుంటే వెళ్లిపోండని అధికారులకు హుకుం

ఒకేరోజు ఇద్దరు అధికారులు ఔట్‌

దీర్ఘకాలిక సెలవులోకి

మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌

ఇదివరకే వీఆర్‌కు డీఎస్పీ

ఇక్కడికి రావాలంటే హడలెత్తుతున్న అధికారులు

ఉన్నవారూ.. వెళ్లిపోయే యోచనలో..?

ధర్మవరం/ ధర్మవరం రూరల్‌

ధర్మవరంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి నియంతృత్వ పోకడలు పరాకాష్టకు చేరాయన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆయన ఆదేశాలు తూచ తప్పకుండా అమలు చేస్తే అధికారులు అక్కడ కొనసాగుతారు, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనన్న ప్రచారం ఉంది. ‘చెప్పినట్లు పనిచేస్తే ఇక్కడ ఉండండి. లేదంటే వెళ్లిపోండి. న్యాయం, చట్టం అంటే కుదరదు’ అంటూ ఆ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేస్తున్నట్లు పట్టణంలో చర్చ సాగుతోంది. దీంతో ఆయన చెప్పిన మేరకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలంటే అధికారులు జంకుతున్నారు. ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటామోనని భయపడుతున్నారు. దానికంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే నయమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మవరంలో ఒకేరోజు ఇద్దరు కీలక అధికారులు సెలవులోకి వెళ్లారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయారు. ఇటీవలే డీఎస్పీ రమాకాంత దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఆ తర్వాత వీఆర్‌కు వెళ్లారు. తాజాగా మరో ఇద్దరు కీలక అధికారులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. డీఎస్పీ వీఆర్‌కు వెళ్లడం వెనుక ఆ ప్రజాప్రతినిధితో సంబంధాలు బెడిసికొట్టడమే కారణమన్న వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో తహసీల్దార్‌ దీర్ఘకాలిక సెలవు పెట్టినట్టు చెబుతున్నా.. వాస్తవానికి ఆ ప్రజాప్రతినిధి వెళ్లిపోమని హుకుం జారీ చేయడమే కారణమన్న వాదనలను కొట్టిపారేయలేం. తాను ప్రజాప్రతినిధి చెప్పిందే చేస్తానని ప్రకటించుకునే కమిషనర్‌ కూడా సెలవులోకి వెళ్లడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆ ప్రజాప్రతినిధే ఏరికోరి అధికారులను తెచ్చుకుని, ఆపై మాట వినలేదంటూ సాగనంపుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ధర్మవరానికి రావాలంటేనే అధికారులు జంకుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా బదిలీపై వెళ్లడమే మంచిదన్న భావనలో ఉన్నారు.

స్థల వివాదాలే కారణమా?

ధర్మవరం పట్టణ పరిధిలో కోట్లాది రూపాయల విలువచేసే ఓ స్థల వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ స్థలం విషయంలో ఆ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని, తన వర్గీయుడికి చెందే విధంగా చేయాలని తహసీల్దార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోర్టులో ఉన్న వివాదాస్పద స్థలాన్ని తాను చేయలేనని తహసీల్దార్‌ చెప్పినట్లు తెలుస్తోంది. చేయలేకపోతే సెలవుపై వెళ్లిపోవాలని ఆ ప్రజాప్రతినిధి ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం మండలవ్యాప్తంగా అసైన్డ భూములను అక్రమంగా తన వర్గీయులకే కట్టబెట్టాలని ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తానేమీ చేయలేననీ, సాగులో ఉన్నవారికి మాత్రమే ఇస్తానని ఆయా గ్రామస్థాయి నాయకుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో వందల్లో ఉన్న దరఖాస్తులను పదుల సంఖ్యకు కుదించినట్లు తెలుస్తోంది. మండలంలోని రేగాటిపల్లి, చిగిచెర్ల గ్రామాల్లోని సొసైటీ భూములను పంపిణీ చేయాలని ఆ ప్రజాప్రతినిధి పట్టుబట్టినట్లు సమాచారం. సొసైటీ భూములను బాధితులకు కాకుండా వేరే వారికిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రకటించారు. దీంతో కోర్టు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని ఆ అధికారి ఆందోళన చెందినట్లు సమాచారం. ధర్మవరం చుట్టుపక్కన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. తన వర్గీయుల పనులు ఎలా ఉన్నా.. ఎప్పటికప్పుడు చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌ పెట్టకూడదని అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం.

ఒక్కరోజు వచ్చి..

ప్రజాప్రతినిధి హెచ్చరికల నేపథ్యంలో తహసీల్దార్‌ తన కుటుంబ సభ్యుల శుభకార్యానికని గత వారంలో 4 రోజులు సెలవు పెట్టి, వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే వెళ్లారని చర్చ సాగింది. సెలవు ముగిశాక ఆయన విధులకు హాజరవడంపై పట్టణంలో తీవ్ర చర్చ సాగింది. ఇక ఆయన రారన్న వాదనలూ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈనెల 5న విధులకు హాజరయ్యారు. తాను దీర్ఘకాలిక సెలవులో వెళ్లలేదనీ, అవన్నీ వదంతులేనని వివరణ ఇచ్చుకున్నారు. దీంతో చర్చ సద్దుమనిగింది. మరుసటిరోజే మంగళవారమే ఆయన విధులకు హాజరుకాలేదు. కారణమేంటా అని ఆరాతీస్తే.. అనారోగ్య కారణాలతో నెలరోజులపాటు సెలవు పెట్టినట్లు తహసీల్దార్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక ఆయన రారన్న వాదనలు ఆ శాఖ నుంచే వినిపిస్తున్నాయి. దీంతో ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు, దీర్ఘకాలిక సెలవు చర్చలు వాస్తవమేనని పట్టణవాసులు పేర్కొంటున్నారు. నీలకంఠారెడ్డి రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూడా. అలాంటి అధికారే పనిచేయలేని పరిస్థితులు ధర్మవరంలో నెలకొన్నాయంటే.. ఇతరులు ఎలా పనిచేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన సెలవులో వెళ్లిపోవడంతో డిప్యూటీ తహసీల్దార్‌ ఈశ్వరయ్య ఇనచార్జిగా కొనసాగనున్నారు. ఓ మహిళా అధికారిని ఇక్కడికి ఎఫ్‌ఏసీగా నియమించే అవకాశం ఉందన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతోంది.

ముగ్గురు మారారు..

ధర్మవరం ఎంపీడీఓలు ఏడాది తిరక్కనే ముగ్గు రు మారిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈఓఆర్డీగా ఉన్న ఓ అధికారి.. ఎంపీడీఓ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో విభేదాలు తలెత్తడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ అధికారిని ప్రజాప్రతినిధి ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన వెళ్లారు. తర్వాత మరో ఇద్దరు అధికారులు మారారు. దీంతో ఇక్కడికి వచ్చేందుకు అధికారులెవరూ సాహసించట్లేదు. ఈఓఆర్డీకే ఎంపీడీఓ బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి నెలకొంది. బత్తలపల్లిలో ఈఓఆర్డీగా విధులు నిర్వహించే అధికారి తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలకు కూడా ఇనచార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ అధికారులపై ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

వెళ్లిపోవడమే బెటర్‌..!

ధర్మవరంలో ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ స్థాయి అధికారే వీఆర్‌కు వెళ్లడం, తహసీల్దార్‌ సెలవులో వెళ్లిపోవడంతో మిగతా శాఖల అధికారుల్లో గుబులు పట్టుకుంది. ఇక్కడ పనిచేయడం కంటే వెళ్లిపోవడమే నయమని చాలామంది అధికారులు, ఉద్యోగులు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. తాము కూడా ఏదో ఒకరోజు ఆ ప్రజాప్రతినిధి ఆగ్రహానికి గురికాక తప్పదనీ, ఆలోపే వెళ్లిపోవడం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రజలకు ఇబ్బందులు

అధికారులు పదేపదే సెలవులో, బదిలీపై వెళ్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఏదో ఒక పనిమీద కార్యాలయాలకు వచ్చే ప్రజలు.. అధికారి లేరని తెలియడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కొన్ని పనులను చేసేందుకు ఇనచార్జి అధికారులు జంకుతున్నారు. రెగ్యులర్‌ అధికారి లేరనీ, ఆయన వచ్చాక రావాలంటూ ప్రజలను వెనక్కి పంపుతున్నారు. దీంతో రెగ్యులర్‌ అధికారి వచ్చేదెన్నడు, తమ పనిచేసేదెన్నడని ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2022-12-07T00:06:18+05:30 IST