టీడీపీ వర్గీయులపై దండయాత్ర

ABN , First Publish Date - 2022-09-25T05:46:01+05:30 IST

కారణం ఏమిటో తెలియదు. టీడీపీ అంటే ఆయనకు పూనకం వస్తుంది. అధికార పార్టీవారు కాకితో కబురు పెట్టినా.. ఆగమేఘాల మీద స్పందిస్తారు. ఏ చిన్న సంఘటన జరిగినా విరుచుకుపడుతున్నారు.

టీడీపీ వర్గీయులపై దండయాత్ర
డీఎస్పీ తీరుకు అద్దం పట్టే ఫొటో ఇది. యల్లనూరు మండలం గడ్డంవారిపల్లి వద్ద హత్యకు గురైన వ్యక్తి తలను బూటు కాలుతో తడుముతూ అమానవీయంగా వ్యవహరిస్తూ.. (ఫైల్‌)

ఇతడే వారి సైన్యం

అధికార పార్టీ వారు చెబితే అత్యుత్సాహం

కౌన్సెలింగ్‌.. కేసులు.. రౌడీ షీట్లతో ఉక్కుపాదం

విస్తుగొలిపేలా తాడిపత్రి డీఎస్పీ చైతన్య తీరు


   కారణం ఏమిటో తెలియదు. టీడీపీ అంటే ఆయనకు పూనకం వస్తుంది. అధికార పార్టీవారు కాకితో కబురు పెట్టినా.. ఆగమేఘాల మీద స్పందిస్తారు. ఏ చిన్న సంఘటన జరిగినా విరుచుకుపడుతున్నారు. అప్పటికప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారు. కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రౌడీ షీట్‌లను ఓపెనచేయిస్తున్నారు. పాత కేసులను తిరగదోడి మరీ వేధిస్తున్నారు. ఉన్న కేసులో అదనంగా పేర్లు చేరుస్తున్నారు. అదనపు సెక్షనలు చేరుస్తున్నారు. దళితుల పట్ల కూడా కనికరం చూపడం లేదు. వైసీపీవారు ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు. టీడీపీవారు ఆత్మరక్షణకు తిరగబడినా, ఆఖరుకు తన్నులు తిని న్యాయం అడిగినా కేసులు పెట్టిస్తారు. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. తను గ్రూప్‌ వన ఆఫీసర్‌. చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిందిపోయి.. ఏకపక్షంగా టీడీపీ వర్గీయులను టార్గెట్‌ చేస్తున్నారు. ఆయనే.. తాడిపత్రి డీఎస్పీ చైతన్య. సబ్‌ డివిజన పరిధిలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పోలీసు శాఖ అధికారులనే విస్మయపరుస్తోంది.

- తాడిపత్రి


ఎవ్వరూ ఇలా చేయలేదు..

తాడిపత్రి సర్కిల్‌ ధర్మవరం సబ్‌ డివిజనలో ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం తాడిపత్రి పోలీ్‌ససబ్‌ డివిజనను 2001లో ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో ఈ 20 ఏళ్లలో ఎంతో మంది డీఎస్పీలు పనిచేశారు. వారెవ్వరిపైనా రానన్ని ఆరోపణలు, విమర్శలు డీఎస్పీ చైతన్యపై వస్తున్నాయి. తాడిపత్రి డీఎస్పీగా 2020 నవంబరులో చైతన్య బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్‌ వన ద్వారా డీఎస్పీ అయ్యారు. శిక్షణ అనంతరం తాడిపత్రికి రెండో పోస్టింగ్‌గా వచ్చారు. సాధారణంగా ప్రమోషనపై వచ్చినోళ్లు, రిటైర్‌మెంట్‌కు దగ్గరున్నోళ్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. ఏళ్ల తరబడి విధుల్లో అనుభవం వారిని అలా తయారు  చేస్తుంది. మరో 30 ఏళ్లకు పైగా సర్వీస్‌ ఉండి.. గ్రూప్‌ వన ద్వారా వచ్చిన చైతన్య.. అధికార పార్టీకి  ఏకపక్షంగా మద్దతుగా నిలవడం, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కోవడం చూసి ఆ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అధికారి.. ఇలా రాజకీయ పార్టీ ముద్ర వేయించుకోవడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 


అప్పట్లోనే..

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో లేని సమయంలో..  2021లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌పై దాడి చేశారు. హైదరాబాదుకు వెళుతూ.. విషయం తెలుసుకున్న జేసీపీఆర్‌.. వెనుదిరిగి తాడిపత్రికి వచ్చారు. ఆ వెంటనే వైసీపీ మద్దతుదారులు జేసీ ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేయలేదు. అధికార పార్టీవారు తమపై దాడి చేశారని ఎస్సీలు ఇచ్చిన ఫిర్యాదుపైనా స్పందించలేదు. దీంతో జేసీపీఆర్‌ నల్లదుస్తులు ధరించి తన నివాసంలోనే నిరసన తెలిపారు. అయినా డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు స్పందించలేదు. పైగా కొవిడ్‌ నిబంధనలను ఆసరాగా చేసుకొని జేసీ వర్గీయులపై కేసులు నమోదు చేశారు. టీడీపీ వర్గీయులను అత్యధికమందిని వివిధ కేసులపేరుతో జైలుకు పంపారు. వైసీపీ మద్దతుదారుల్లో అతికొద్దిమందిని, కంటితుడుపుగా పంపించారన్న విమర్శలు వచ్చాయి. 


ప్రతిష్టకు మరక

2021 సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం, యల్లనూరు మండలం తిమ్మంపల్లి సమీపంలో కోడిపందేలను నిర్వహిస్తున్నారని డీఎస్పీ చైతన్యకు, ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సంఘటనా స్థలానికి డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు వెళ్లారు. ఎమ్మెల్యేకి సంబంధం లేదని, అనామకులు కోడిపందేలు ఆడారని తేల్చారు. కొందరిపై కేసు నమోదు చేశారు. కోడి పందేలు చూసేందుకు, ఆడేందుకు సరిహద్దులోని పులివెందుల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జూదరులు వచ్చారని, రూ.లక్షల్లో పందేలు కట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కోడిపందెం రాయుళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన డీఎస్పీ.. తోటలో ఎమ్మెల్యేతో సమావేశం కావడం అప్పట్లో దుమారం రేగింది.


దాడి చేసినా దిక్కులేదు

తాడిపత్రి పట్టణ సమీపంలోని అండర్‌ డ్రైనేజీ ఎస్టీపీ-1 వద్ద పగిలిపోయిన పైపులైనను స్వచ్ఛందంగా మరమ్మతు చేసేందుకు టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌ మల్లికార్జునరెడ్డి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, విజయ్‌కుమార్‌ తదితరులు వెళ్లారు. వీరిపై ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధనరెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. న్యూస్‌ కవర్‌ చేయడానికి వెళ్లిన ఓ విలేకరినీ చితకబాదారు. ఆ సమయంలో రూరల్‌ సీఐ, ఎస్‌ఐ, స్పెషల్‌ పార్టీ సిబ్బంది అక్కడే ఉన్నా.. దాడిని అడ్డుకోలేదు. ఆ తరువాత సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ చైతన్య సైతం బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తనయుడు దాడిచేశాడని కౌన్సిలర్‌ మల్లికార్జున డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. పైగా కౌన్సెలింగ్‌ పేరుతో స్టేషనకు పిలిపించి అసభ్య పదజాలంతో దూషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాడిలో గాయపడిన కాంట్రాక్టర్‌ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేసినా.. వైసీపీ మద్దతుదారులపై కేసు నమోదు కాలేదు. డీఎస్పీ అలసత్వంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో బాధితులు న్యాయం కోసం తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. విడ్డూరం ఏమిటంటే.. ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని 36వ వార్డు మహిళా కౌన్సిలర్‌ జింకా లక్ష్మిదేవిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అప్పట్లో టీడీపీ మద్దతుదారులు పట్టణంలోని సీబీ రోడ్డుపై బైఠాయించారు. 


అక్షయపాత్ర.. ఆ ఘటన

తాడిపత్రి నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరించే టీడీపీ వర్గీయులపై ఉక్కుపాదం మోపేందుకు వైసీపీ మద్దతుదారులు ప్రబోధానంద ఆశ్రమంపై జరిగిన దాడి ఘటనను వాడుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సాయంతో తమపై కేసులు నమోదు చేయించి, నెలల తరబడి జైళ్లల్లో మగ్గిపోయేలా చేస్తున్నారని టీడీపీ మద్దతుదారులు అంటున్నారు. డీఎస్పీ ఒత్తిడి వల్లే ఈ అరెస్టులు జరుగుతున్నాయని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాలని, అరెస్టులను ఆపేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయినా, దొడ్డిదారిలో కేసులు నమోదు అవుతున్నాయని, మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టీడీపీ వర్గీయులు వాపోతున్నారు. 


పట్టుకోసం పావుగా..?

తాడిపత్రి నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు డీఎస్పీని స్థానిక ఎమ్మెల్యే పావుగా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. డీఎస్పీ తీరు కారణంగా సబ్‌ డివిజనలో వైసీపీ మద్దతుదారులు ఏం చేసినా కేసులు ఉండవనే ప్రచారం ఉంది. టీడీపీ వర్గీయులు చిన్నపాటి గొడవకు దిగినా అప్పటికప్పుడు కేసులు కట్టాలని కిందిస్థాయి పోలీసు అధికారులకు డీఎస్పీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి డీఎస్పీ పూర్తి మద్దతు ఇస్తున్నారని భావించి, కొందరు కిందిస్థాయి అధికారులు కూడా ఆయనను అనుసరిస్తున్నారని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. 


చెలరేగిపోతారు..

- తాడిపత్రి పట్టణ సమీపంలోని ఆర్డీటీ కాలనీలో టీడీపీకి చెందిన సోమశేఖర్‌నాయుడు అక్రమంగా ఇంటిని నిర్మించాడన్న నెపంతో వైసీపీ మద్దతుదారుల సమక్షంలో, పోలీసు బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేశారు. దీనిపై సోమశేఖర్‌ నాయుడు తన భార్యతో కలిసి డీఎస్పీ చైతన్యకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకోవాల్సిన డీఎస్పీ, సోమశేఖర్‌నాయుడును ఆయన భార్య ఎదుటే దుర్భాషలాడారు. ఆ తరువాత అతనిపై కేసులు నమోదు చేయించారు. రౌడీషీట్‌ తెరిపించారు. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.

- పుట్లూరులో పాతకక్షల కారణంగా టీడీపీ వర్గీయుడు రామాంజనేయులు (ఎస్సీ), వైసీపీకి చెందిన వివేక్‌ ఘర్షణపడ్డారు. వివేక్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రామాంజనేయులు ఫిర్యాదు చేశాడు. కానీ సాధారణ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

- డీఎస్పీ వైఖరిని నిరసిస్తూ చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు పుట్లూరు పోలీ్‌సస్టేషన ఎదుట ధర్నా చేశారు. తాడిపత్రి పట్టణంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పుట్లూరు మండలంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉన్నాడని, ప్రకాష్‌ నాయుడుపై వైసీపీ మద్దతుదారుల సూచనల మేరకు రౌడీషీట్‌ ఓపెన చేశారన్న ప్రచారం ఉంది. 

- తాడిపత్రి మండలం కోమలిలో పాతకక్షల కారణంగా టీడీపీ వర్గానికి చెందిన నాగేంద్ర (ఎస్సీ), వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ వర్గీయులు తనను అసభ్య పదజాలంతో దూషించి, దాడిచేశారని నాగేంద్ర ఫిర్యాదు చేసినా ఇంతవరకు వారిపై కేసు నమోదు చేయలేదు. 

- తాడిపత్రి భగతసింగ్‌ నగర్‌కు చెందిన దంపతులు కొన్నిరోజుల క్రితం విడిపోయారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు రెండు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. సామరస్యంగా విడిపోయేలా ఒప్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ పోలీసు అధికారి, ఆమెను, ఆమె తండ్రిని తరచూ స్టేషనకు పిలిపించుకుంటున్నారు. పంచాయితీ చేసిన టీడీపీ నాయకుడిపై ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. Read more