నేలరాలిన ఆశలు

ABN , First Publish Date - 2022-09-19T05:59:58+05:30 IST

బహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు హనుమంతప్ప. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు

నేలరాలిన ఆశలు
మీన్లపల్లి వద్ద నీటమునిగిన పత్తి

నేలరాలిన ఆశలు

పత్తిపై వర్షాలు.. వరదల ప్రభావం

రికార్డు ధరలను చూసి.. భారీగా సాగు

సాధారణ విస్తీర్ణం 45,002 హెక్టార్లు

ఈ ఏడాది సాగు 68,786 హెక్టార్లు

కదిలిస్తే.. కంటతడి పెడుతున్న రైతు


బహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన ఈ రైతు పేరు హనుమంతప్ప. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 11 ఎకరాలలో పత్తి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.40 వేల దాకా పెట్టుబడి పెట్టాడు. పత్తికి మంచి ధర ఉండటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కొడుకు పెళ్లి కోసం అప్పు చేశాడు. ఇల్లు కూడా కట్టుకున్నాడు. పత్తి పంట వస్తే ఇల్లు, పెళ్లికి చేసిన అప్పులు తీర్చి, మిగిలింది మనవళ్ల చదువులకు వాడుకుందామని అనుకున్నాడు. కానీ పంటంతా వరదల్లో కొట్టుకు పోయింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ వరద ప్రభావం తన కుటుంబం మీద తీవ్రంగా పడుతోందని వాపోయాడు. పిల్లల చదువు ప్రశ్నార్థకంగా మారిందని, ఆశలన్నీ ఆవిరైపోయాయని కంటతడి పెట్టుకున్నాడు. ఒక్క హనుమంతప్పే కాదు.. జిల్లాలో వేలాది మంది రైతుల పరిస్థితి ఇదే..!


రాయదుర్గం: పత్తికి రికార్డు ధరలు లభిస్తున్నాయి. క్వింటానికి రూ.10 వేలకు పైగా లభిస్తోంది. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తి పండితే తమ కష్టాలు తీరుతాయని కరువు జిల్లా రైతులు భావించారు. అదే ఆశతో భారీగా పంట వేశారు. జిల్లాలో సాధారణంగా 45,002 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు అవుతుంది. కానీ ఈ ఏడాది 68,786 హెక్టార్ల విస్తీర్ణంలో (153 శాతం) సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి.  కానీ రైతుల ఆశలపై వరదలు నీరు చల్లాయి. పొలాల్లో నీరు చేరి.. మొక్కలన్నీ నల్లబడ్డాయి. వేదవతి, పెన్నా పరివాహక ప్రాంతంలో పత్తి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. జిల్లాలో స్టాలిన, టార్గెట్‌, ఆశ, నందిని తదితర రకాల పత్తిని సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆశలకు తగ్గట్టుగానే 80 రోజులకు పైబడిన పంటకు పూత, కాయలు బాగా వచ్చాయి. సరిగ్గా కాయలు పగిలే సమయంలో వర్షాలు కురవడంతో రాలిపోయాయి. కొన్ని చోట్ల పంట మొత్తం నీట మునిగి కుళ్లిపోయింది. అప్పులు  చేసి సాగు చేసిన పంట ఇలా దెబ్బతినడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. సెప్టెంబరు నెలలో సాధారణ వర్షపాతం 110.9 సెంటీమీటర్లు కాగా, తొలి 15 రోజుల్లో ఏకంగా 94.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వానలు, ఉధృతమైన వరదలు పంటను ఎత్తుకుపోయాయి. 


పట్టించుకోని అధికారులు

కణేకల్లు, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్‌, బ్రహ్మసముద్రం, ఉరవకొండ, పామిడి, పెద్దవడుగూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, విడపనకల్లు తదితర ప్రాంతాల్లో పత్తి పంటను ఎక్కువగా సాగు చేశారు. ఈ రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ ఈ-క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియలో నిమగ్నమై ఉంది. పత్తి పంట నష్టం గురించి ఇప్పటికీ వివరాలు సేకరించడం లేదని బాధిత రైతులు మండిపడుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు పెట్టి తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నామని వాపోతున్నారు. చాలా మంది రైతులు ఎకరాకు రూ.20 వేల ప్రకారం కౌలు చెల్లించి పత్తి సాగు చేశారు. ఇప్పటికే చాలాచోట్ల కౌలు సొమ్మును చెల్లించారు. వీరికి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే పరిహారం అందుతుంది. కానీ చాలామందికి గుర్తింపు కార్డులే లేవు. వారి పరిస్థితి దయనీయంగా మారింది.


బతుకు భారం..

రెండు ఎకరాలలో రూ.70 వేలు పెట్టుబడి పెట్టి పత్తి పంటను సాగు చేశాను. మూడు నెలల పాటు కాపాడుకున్న పంట ఒక్కసారిగా వరదల్లో కొట్టుకుపోయింది. గతంలో మిరప దిగుబడి రాక నష్టపోయాను. ఇప్పుడు పత్తి పంట పోయింది. బతుకు భారంగా మారింది. 

- చంద్రన్న, రైతు, బండూరు 


వలసపోతాం..

మూడు ఎకరాలలో రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేశాను. వర్షాలతో పంటంతా సర్వనాశనమైంది. పంట చేతికొస్తే కొడుకు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చవచ్చని అనుకున్నాను. కానీ వర్షాలు నిలువునా ముంచాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. కుటుంబ పోషణ కోసం పట్టణ ప్రాంతాలకు వలస పోవాలని అనుకుంటున్నాం. 

- బచ్చలప్ప, రైతు, కళ్లుదేవనహళ్లిదిక్కుతోచడం లేదు..


కాయలు నేలరాలాయి..

ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.2 లక్షలు దాకా పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేశాను. పంటంతా వరదల్లో కొట్టుకు పోయింది. పొలాన్ని బురద కప్పే సింది. పంట ఆనవాళ్లు లేవు. పొలం మీదే ఆధారపడి నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాము. కుటుంబ పోషణకు ఏం చేయాలో తెలియడం లేదు. భవిష్యత్తును తలచుకుంటేనే భయమేస్తోంది. 

 - రామాంజనేయులు, రైతు, మీన్లపల్లి 


నేలరాలాయి..

ఆరు ఎకరాలలో పత్తి సాగు చేశాను. పంట కోత దశకు దగ్గరలో ఉంది. వర్షాలు అధికంగా కురవడంతో కాయలన్నీ రాలిపోయాయి. మొక్కలన్నీ నల్లగా మారిపోయాయి. పంటను తొలగించడం తప్ప మార్గం లేదు. పెట్టుబడి ఖర్చు నెత్తిన పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు తీర్చేందుకు వేరే పని వెతుక్కోవాలి. మళ్లీ పంట పెడదామంటే చేతిలో డబ్బులు లేవు. ప్రభుత్వం ఆదుకోవాలి. 

 - తిమ్మారెడ్డి, రైతు, మల్లాపురం 

Read more