రైతాంగాన్ని విస్మరిస్తే పతనం తప్పదు

ABN , First Publish Date - 2022-08-09T05:26:44+05:30 IST

రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వాలకు పతనం తప్పదని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

రైతాంగాన్ని విస్మరిస్తే పతనం తప్పదు
రోడ్డుపై టమోటాలు పోసీ నాయకుల నిరసన

  ప్రభుత్వానికి రైతుసంఘాల హెచ్చరిక

టమోటా రైతులకు మద్దతుగా ధర్నా

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 8: రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వాలకు పతనం తప్పదని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. టమోటాకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతు సంఘం, పండ్లతోటల రైతుసంఘాల ఆధ్వర్యంలో సోమవారం క్లాక్‌ టవర్‌ వద్ద రోడ్డుపై టమోటాలు పోసి నిరసన తెలిపారు. జిల్లాలో 15 వేల హెక్టార్లలో టమోటా సాగు చేశారని, మార్కెట్లలో 15 కేజీల బాక్స్‌ రూ.30 కూడా పలకడం లేదని అన్నారు. రైతులకు దిక్కుతోచక దిగుబడులను రోడ్డుపక్కన పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు మూడు రోజుల్లో రెండున్నర లక్షల బాక్సుల టమోటాను రైతులు రోడ్డుపై పారబోశారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించకపోగా, రైతులపక్షాన నిరసన తెలుపుతున్నవారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. రైతులు రూ.లక్షలు అప్పులు చేసి పంటలు పండిస్తుంటే, గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రతి పంటను కొనుగోలు చేస్తామని సీఎం జగన ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. టమోటాను ప్రభుత్వమే కొనుగోలుచేసి టమోటా సాస్‌, చిప్స్‌ తయారీకి వినియోగించాలని కోరారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి, టూటౌన స్టేషనకు తరలించారు. ఆందోళనలో ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పండ్లతోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతుసంఘం నాయకులు నాగేంద్రకుమార్‌, క్రిష్ణమూర్తి, రంగయ్య, ముత్యాలు, నల్లప్ప, శ్రీనివాసులు, వెంకటనారాయణ, సంగప్ప, శివనాగమ్మ, బి.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-09T05:26:44+05:30 IST