అట్టహాసంగా పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలు
ABN , First Publish Date - 2022-09-23T05:41:59+05:30 IST
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు.
వెంకటాపురంలో అర్ధరాత్రి కేక్ కటింగ్
పరిటాల ఘాట్ వద్ద తండ్రికి నివాళులు
అరవిందనగర్ నివాసానికి అభిమానుల తాకిడి
అనంతపురం అర్బన, సెప్టెంబరు 22: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం అరవింద నగర్‌లోని ఆయన నివాసానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో పరిటాల శ్రీరామ్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. తన తల్లి, మాజీ మంత్రి పరిటాల సునీత ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరిటాల శ్రీరామ్‌ను గజమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు, పండ్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలతోపాటు ఉమ్మడి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలు, చిత్తూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలు జిల్లాలు, బెంగుళూరు, పావగడ నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చి పరిటాల శ్రీరామ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, తనపై ఇంతటి అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పసుపు జెండాను ఎగుర వేసి, చంద్రబాబునాయుడును తిగిరి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు, నారా లోకేష్ శుభాకాంక్షలు
పరిటాల శ్రీరామ్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు శుభాకాంక్షలు తెలిపారు.
వెంకటాపురంలో సందడి
రామగిరి, సెప్టెంబరు 22: పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను వెంకటాపురంలోని వారి స్వగృహంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఘనంగా నిర్వహించారు. అభిమానులు వెంకటాపురానికి తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పరిటాల శ్రీరామ్ నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు, పరిటాల అభిమానులతో వెంకటాపురంలో సందడి వాతావరణం నెలకొంది.
