బస్టాండులో జరిమానాల మోత

ABN , First Publish Date - 2022-12-10T00:19:20+05:30 IST

అనంత ఆర్టీసీ బస్టాండులో జరిమానాల మోత మోగుతోంది. అనివార్య కారణాలతో బస్టాండు ఆవరణలోకి వ్యక్తిగత వాహనంతో వస్తే ప్రయాణికుల చేతి చమురు వదలాల్సిందే. ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైనలతో బెదరగొడుతున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణ గుండా రోజూ దాదాపు 70 వేల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.

బస్టాండులో జరిమానాల మోత
ద్విచక్ర వాహనదారుడికి జరిమానా విధిస్తున్న ఆర్టీసీ పోలీసులు

- ఆవరణలో బండి కనిపిస్తే జరిమానా కట్టాల్సిందే

- టార్గెట్‌ల కోసమే ఫైన

- ట్రాఫిక్‌ అంతరాయాన్ని పట్టించుకోని వైనం

- ప్రజల ఫిర్యాదులను పెడచెవిన పెట్టిన అధికారులు

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 9: అనంత ఆర్టీసీ బస్టాండులో జరిమానాల మోత మోగుతోంది. అనివార్య కారణాలతో బస్టాండు ఆవరణలోకి వ్యక్తిగత వాహనంతో వస్తే ప్రయాణికుల చేతి చమురు వదలాల్సిందే. ఆర్టీసీ భద్రతా విభాగం సిబ్బంది ఫైనలతో బెదరగొడుతున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణ గుండా రోజూ దాదాపు 70 వేల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాండులో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా నియమించబడ్డ ఆర్టీసీ పోలీసుల ఆగడాలతో ప్రయాణికుల జేబులు గుల్లవుతున్నాయి. నడవడానికి చేతకానివారు, వృద్ధులు, గర్భవతులు వంటివారిని వారి బంధువులు బైకుల్లో ఎక్కించుకుని వచ్చి బస్టాండులోని ప్లాట్‌ఫాంలవద్ద దింపి వెళ్తుంటారు. బస్టాండ్‌లో దిగిన వారిని ఎక్కించుకుని తీసుకెళ్తుంటారు. అంతవరకూ ఎక్కడుంటారోకానీ చేతకానివారిని తమ వారు వాహనాల్లో ఎక్కించుకు ని బస్టాండు ఆవరణగుండా బయటకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ పోలీసులు ప్రత్యక్షమవుతారు. ఆ వాహనంలో వారి సమస్యలు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా బస్టాండు ఆవరణలోకి వాహనంతో వచ్చినందుకు జరిమానా కట్టాల్సిందేనంటూ ఆదేశిస్తారు. లేదు మేము కట్టలేము అని వాహనదారులు అంటే మాత్రం దుర్భాషలాడుతూ, మీపై కేసు నమోదు చేశాం. మీ ఇంటికి రూ.1400లు జరిమానా వస్తుంది అని చెబుతారు. మరికొందరి నుంచైతే వాహన తాళాలు లాగేసుకుని అక్క డ్నుంచి వెళ్లిపోతారు. ఇక ఆ వాహనదారుడికి చుక్కలు చూపుతారు. రెట్టింపు జరిమానా చెల్లిస్తే తప్ప తాళాలు వెనక్కు ఇవ్వరు. వీరి ఆగడాలు భరించలేక పలువురు ప్రయాణికులు ఆర్టీసి అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలూ కూడా ఉన్నాయి. అయినా అధికారులె వరూ స్పందించకపోవడంతో వీరి ఆగడాలు హెచ్చుమీరిపోతున్నాయి. రోజుకు కనీసం 100 మందికి తక్కువ కాకుండా జరిమానాలు విధిస్తు న్నారు. వివిధ పనుల నిమిత్తం బయటి ఆటోలు, లగేజీ వాహనాలను ప్లాట్‌ఫాంలవద్ద ఆపుతుండడంతో ఆయా ప్లాట్‌ఫాంలవద్దకు చేరుకునే వీలు లేక పలు బస్సులు దూరంగాను ఉండి ప్రయాణికులను ఎక్కిం చుకోవడం లేదా దించడం చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రాఫిక్‌ అంతరాయాలను నివారించడంలో ట్రాఫిక్‌ పోలీసులు చొరవ చూపడం లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

టార్గెట్‌ల కోసం జరిమానాలు

సంస్థను లాభాలబాటలో పయనింపజేయాలనే ఉద్దేశంతో బస్టాండ్లలో షాప్‌ రూములు కట్టి బాడుగకు ఇవ్వడంతోపాటు, సైకిల్‌ స్టాండ్లు లీజుకు ఇవ్వడం, ఖాళీ ప్రదేశాలను సైతం అద్దెకు ఇస్తున్నారు. అయితే గత కొంతకాలంగా బస్టాండు ఆవరణలోకి ప్రవేశించే ఇతర వాహనాలకు జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టారు. తాజాగా ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆశిసిస్తూ టార్గెట్‌లు నిర్ణయించి మరి ప్రజలనుంచి జరిమానాల రూపంలో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ రూ.8వేలు వసూలు చేయాలని ఆర్టీసీ కానిస్టేబుళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోజూ ఆర్టీసీ పోలీసులు ఒక్కో వాహనానికి రూ.100లు చొప్పున వసూ లు చేస్తూ, రోజుకు కనీసం 100 వాహనాలకు తగ్గకుండా జరిమానాలు విధించి ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నారు.

Updated Date - 2022-12-10T00:19:21+05:30 IST