Death స్పాట్‌..!

ABN , First Publish Date - 2022-06-02T06:35:57+05:30 IST

కేవలం 500 మీటర్ల దూరం. ఆ కాస్తలోనే ఏకంగా 3 అత్యంత ప్రమాదాలు జరిగే ప్రాంతాలున్నాయి. అక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.

Death స్పాట్‌..!

  • కోడూరు తోపు, గార్మెంట్స్‌ 
  • పరిశ్రమ మధ్య నిత్యం ప్రమాదాలు
  • నియంత్రణ చర్యలు పట్టని అధికారులు
  • గస్తీ మరచిన హైవే ఎస్కార్ట్‌ సిబ్బంది


జస్ట్‌.. 500 మీటర్ల దూరం.. 3 అత్యంత ప్రమాదకర ప్రాంతాలు.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిశాయి. లెక్కలేనంత మంది గాయపడ్డారు. అయినా.. అధికారుల్లో చలనం లేదు. ప్రమాదాల నివారణకు చర్యలే లేవు. హైవే ఎస్కార్ట్‌ సిబ్బంది గస్తీ మరిచారు..


చిలమత్తూరు 

కేవలం 500 మీటర్ల దూరం. ఆ కాస్తలోనే ఏకంగా 3 అత్యంత ప్రమాదాలు జరిగే ప్రాంతాలున్నాయి. అక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం నిత్యకృత్యమయ్యాయి. మండలంలోని కోడూరు తోపు నుంచి గార్మెంట్స్‌ పరిశ్రమ వరకు 500 మీటర్ల దూరాన్ని డెత స్పాట్‌గా ప్రజలు భయపడుతున్నారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. అయినా.. అధికారుల్లో చలనం లేదు. ప్రజల ప్రాణాలే కదా.. పోతేపోనీలే అనుకున్నారో.. ఏమో..? ప్రమాదాల నివారణకు ఏమాత్రం చర్యలు చేపట్టట్లేదు. నిత్యం గస్తీ కాయాల్సిన హైవే ఎస్కార్ట్‌ సిబ్బంది ఆ ప్రాంతం వైపు రావట్లేదన్న విమర్శలువినిపిస్తున్నాయి.


ఆ 3 ప్రాంతాల్లో..

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత. కోడూరు తోపు నుంచి కొడికొండ చెక్‌పోస్టు మధ్య రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. 44వ జాతీయ రహదారిపై కోడూరు తోపులో పుట్టపర్తి కూడలి అత్యంత ప్రమాదకరంగా మారింది. దాంతోపాటు సమీపంలోని టెక్స్‌పోర్టు గార్మెంట్స్‌ పరిశ్రమ ముందున్న యూటర్న్‌ ప్రాంతం, మధ్యలోని చెరువు కాలువ వద్ద రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఎక్కువగా కోడూరు తోపు నుంచి కొడికొండ చెక్‌పోస్టు వరకు ఆగివున్న వాహనాలను ఢీకొడుతున్నారు. సిమెంటు లోడుతో బెంగళూరు వైపు వెళ్లే లారీలు పలు సాంకేతిక కారణాలతో నడి రోడ్డుపైనే ఆగిపోతున్నాయి. ఈ కారణంగా నిలబడిన వాటిని గమనించక వేగంగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. ప్రమాదాల బారిన పడుతున్నాయి.


గస్తీ మరిచారు..

జాతీయ రహదారుల విస్తరణ జరిగిన తరువాత వాహనాల వేగం పెరిగింది. దాంతో క్షణకాలంలో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల అధికారులు ప్రత్యేక వాహనాలతో ఎస్కార్ట్‌ సిబ్బందిని ఏర్పాటుచేశారు. ఈ ఎస్కార్ట్‌ సిబ్బంది రాత్రి, పగలు వారికి కేటాయించిన పరిధిలో గస్తీ తిరుగుతూ ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి, వాటిని నివారించాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే సబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను కాపాడాల్సి ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి పెనుకొండ వరకు ఉన్న ఎనహెచ ఎస్కార్ట్‌ సిబ్బంది ఇటీవల గస్తీ తిరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. గతనెల 24న కోడూరు చెరువు కాలువ వద్ద జరిగిన ప్రమాదంలో వారి నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదానికి ముందురోజు రాత్రి 11 గంటల సమయంలో లారీ సాంకేతికలోపంతో రోడ్డుపై ఆగిపోయినా.. సంబంధిత ఎస్కార్ట్‌ సిబ్బంది దానిని గుర్తించలేదు. దాంతో లారీ 24వ తేదీ తెల్లవారుజాము వరకు అక్కడే ఉంది. కనీసం ఆగివున్న లారీ చుట్టూ ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు కూడా ఏర్పాటుచేయలేదు. సకాలంలో ఎస్కార్ట్‌ సిబ్బంది స్పందించి, రోడ్డుపై ఆగిపోయిన లారీని గుర్తించి, నివారణ చర్యలు చేపట్టి ఉండుంటే  ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


అత్యంత ప్రమాదకరం

44వ జాతీయ రహదారిపై కొడికొండ చెక్‌పోస్టు నుంచి వస్తూ పుట్టపర్తి వైపు మలుపు తిరిగే కోడూరు కూడలి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఈ కూడలిలో తరచూ ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు పుట్టపర్తి వైపు మలుపు తిరిగే వాహనాలను అంచనా వేయలేక ఢీకొంటున్నాయి. గతంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటుచేసినా.. అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. సిమెంటు లారీలు అత్యంత వేగంతో దూసుకొస్తుంటాయి. ఏమాత్రం పొరబాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక్కడ వాహనాల వేగం తగ్గించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తరువాత ఎందుకోగానీ వాటిని పూర్తిగా తొలగించి, వాహనాల వేగానికి బ్రేకులు తీసేశారు. రోజూ వందల సంఖ్యలో కార్మికులు గార్మెంట్స్‌ పరిశ్రమకు ఆటోల్లోనే వెళ్తుంటారు. వారిలో చాలామంది ఈ కూడలిలో మలుపు తిరిగి పుట్టపర్తి వైపు వెళ్తారు. దాంతో ఉదయం, సాయంత్రం ఈ కూడలి చాలా రద్దీగా ఉంటోంది. ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.


గుర్తించలేకపోతున్నారు..

కోడూరు చెరువు కాలువ నుంచి బెంగళూరు వైపు వెళ్లే 200 మీటర్ల రోడ్డు ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువగా సిమెంటు లారీలను రోడ్డు పక్కనే ఆపి ఉంచడం, ఒక్కోసారి సాంకేతిక కారణాలతో అవి ఆగి పోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించకపోవడంతో రాత్రి సమయంలో వాహన డ్రైవర్లు ముందున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నారు. దాంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు ఈ ప్రదేశాన్ని ప్రమాదకరమైనదిగా గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయడం, రోడ్డుపై ఆగిపోయిన వాహనాలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించడం, వాటి గురించి తెలుసుకునే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కొన్నేళ్లుగా ఈ ప్రదేశంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.


కోడూరు తోపు కూడలిలో జరిగిన కొన్ని ప్రమాదాలు

2-8-2020: కోడూరు తోపు సమీపంలోని టెక్స్‌పోర్టు గార్మెంట్స్‌ పరిశ్రమ యూటర్న్‌ వద్ద ఐషర్‌ వాహనం, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.

10-08-2020: టెక్స్‌పోర్టు గార్మెంట్స్‌ పరిశ్రమ యూటర్న్‌ వద్ద కారు అదుపు తప్పి డివైండర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

12-08-2020: కోడూరు తోపు కూడలిలో అనంతపురం వైపు నుంచి వచ్చిన లారీ గోరంట్ల వైపు నుంచి వచ్చి మలుపులో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్దింది. దీంతో ఒకరు మృతిచెందారు.

20-08-2020: కోడూరు తోపు కూడలిలో బెంగళూరు నుంచి వస్తున్న లారీ పుట్టపర్తి వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

19-06-2021: ఐషర్‌ వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

15-11-2021: టెక్స్‌పోర్టు గార్మెంట్స్‌ కూడలి సమీపంలో బస్సు బోల్తా పడి 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

24-02-2022: కోడూరు తోపు కూడలిలో కారును లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు.

24-05-2022: కోడూరు తోపు సమీపంలోని కోడూరు చెరువు కాలువ వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఇందులో ఒకరు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

30-05-2022: కోడూరు తోపు పమీపంలోని పెద్దన్నపల్లి క్రాస్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు.


ప్రత్యేక చర్యలు తీసుకుంటాం..

కొడికొండ చెక్‌పోస్టు నుంచి కోడూరు తోపు వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కోడూరు కూడలిలో స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటుచేసే విషయంపై అధికారులతో మాట్లాడతాం. రోడ్డుపై ఆగిపోయిన వాహనాలను వెంటనే గుర్తించి, రోడ్డు మీద లేకుండా చర్యలు తీసుకుంటాం. ఎనహెచ ఎస్కార్ట్‌ సిబ్బంది గస్తీని పెంచి, తక్షణం ప్రమాదాలపై నిఘా ఉండేలా చూస్తాం.

- రమ్య, డీఎస్పీ, పెనుకొండ

Updated Date - 2022-06-02T06:35:57+05:30 IST