పెళ్లి కానుక కొందరికే

ABN , First Publish Date - 2022-09-30T05:43:23+05:30 IST

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయానికి సంబంధించి వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక పథకాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు అమలు చేయనుంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల అనంతరం వైఎ్‌సఆర్‌ కల్యాణమస్తు షాదీ తోఫా పేరిట వచ్చేనెల నుంచి అమల్లోకి తీసుకురానుంది.

పెళ్లి కానుక కొందరికే

పదోతరగతి చదివితేనే వర్తింపు

కరెంటు ఎక్కువ వాడినా అనర్హులే

పథకం లబ్ధికి నిబంధనల సంకెళ్లు 

మూడేళ్ల అనంతరం పేరు మార్చి అమలు


ధర్మవరం, సెప్టెంబరు 29: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయానికి సంబంధించి వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక పథకాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు అమలు చేయనుంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల అనంతరం వైఎ్‌సఆర్‌ కల్యాణమస్తు షాదీ తోఫా పేరిట వచ్చేనెల నుంచి అమల్లోకి తీసుకురానుంది. అయితే నిబంధనలను మాత్రం కఠినతరం చేసింది. వధూవరులిద్దరూ పదోతరగతి చదివితేనే పథకం వర్తింపచేస్తామని స్పష్టం చేసింది. టీడీపీ హయాంలో చంద్రన్న పెళ్లికానుక పథకం ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మి కుల వధువులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేశారు. 


పేరు మార్చి...

 రాష్ట్రంలో 2019లో వైసీపీ అఽధికారంలోకి వచ్చాక చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని నిలిపివేశారు. మూడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం  వైఎ్‌సఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది. అక్టోబరు 1వతేదీ నుంచి ఈ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయనున్నట్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, లబ్ధిదారులకు రూ.లక్ష ఇదే వర్గంలో కులాంతర వివాహాలకు రూ.1.2లక్షలు అంద జేయనుంది. బీసీలకు రూ.50వేలు, వీరిలో కులాంతర వివాహాలకు రూ.75వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.5లక్షలు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రూ.40వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. 


నిబంధనలు ఇలా..

కల్యాణమస్తు కింద ఆర్థిక సా యం పొందాలంటే వధువు, వరుడు ఇద్దరూ పదోతరగతి చదివి ఉండాలి. పేద వర్గాల్లో పదోతరగతి వరకు చదవని వారు చాలా మంది ఉన్నారు. వధువు, వరుడు ఇద్దరూ చదివి ఉండాలనే నిబంధనతో చాలా మందికి ఈ పథకం వర్తించే అవకాశం లేదు. 

 ఇంటికి కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు కంటే అధికంగా వాడినా అనర్హులవుతారు. 

 కుటుంబ సభ్యుల పేరిట నాలుగు చక్రాల వాహనాలు, నెలకు గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలుకంటే అధిక ఆదాయం ఉండరాదు. 

 మూడెకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్టభూమి, పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే లబ్ధి చేకూరే పరిస్థితి లేదు. 


ఇలా అనేక కొర్రీల కారణంగా దరఖాస్తుదారుల్లో ఎంతమంది అర్హత కలిగి ఉంటారనేది ప్రశ్నార్థకమే. గతం కంటే గణనీయంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. గతంలో పెళ్లికానుక పథకాన్ని కొంతకాలం సాంఘిక సంక్షేమశాఖ, చివర్లో డీఆర్‌డీఏ ద్వారా అమలు చేశారు. ఈ సారి మాత్రం సచివాలయాల ద్వారా  ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  పథకం అమలుపై  ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా ఈ పథకం నిలిపివేయడంతో సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్‌డీఏ వద్ద వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిస్థితిపై  ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో వైపు తాజా నిబంధనలు పరిశీలిస్తే అందరికీ సాయం అందే అవకాశాలు కనిపించడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more