అధికార పార్టీపై తిరుగుబాటు
ABN , First Publish Date - 2022-12-31T00:31:32+05:30 IST
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనాగ్రహం పెల్లుబుకింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వ నిరంకుశపాలనపై పోరు సాగించాయి
విపక్షాలు, ప్రజాసంఘాల పోరు
జోష్ నింపిన చంద్రబాబు పర్యటన
కౌలు రైతులకు జనసేనాని అండ
ఉద్యమాలు కొనసాగించిన కామ్రేడ్లు
వైసీపీపై బీజేపీ, కాంగ్రెస్ విసుర్లు
(ఆంధ్రజ్యోతి, అనంతపురం) వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జనాగ్రహం పెల్లుబుకింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వ నిరంకుశపాలనపై పోరు సాగించాయి. ఏడాది మొత్తం ఉద్యమాలు, ఆందోళనలతో గడిచింది. 2022లో అధికార పార్టీ విపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువత, కార్మిక, కర్షక వర్గాలు.. చివరికి కులసంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరే కించాయి. అన్నివర్గాలను వంచన చేసిన ప్రభుత్వం అని ఆయా వర్గాలు విమర్శించాయి. రాజకీయం గా అధికార వైసీపీకి గడ్డుపరిస్థితి ఎదురైంది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయట పడ్డాయి.
జనంలోకి టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జనంలో గడిపింది. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలను జనంలోకి తీసుకెళ్లింది. ఆ పార్టీ మైలేజీ పెరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మే 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఊహించని స్థాయిలో జన స్పందన లభించింది. ఇది టీడీపీ శ్రేణుల్లో జోష్‌ను పెంచింది. ఆ తరువాత 14 నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిర్వహించారు. ధరల పెరుగుదలపై ఆందోళనలు చేశారు. నియోజకవర్గ ఇనచార్జిలు, అనుబంధ విభాగాల నాయకులు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
గర్జించిన తెలుగు మహిళ
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దాడులను ఎండగట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. తెలుగు మహిళలు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొన్నారు.
ఇదేం ఖర్మ
వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ ఏడాది చివరలో తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి’ పేరిట కార్యక్రమాలు చేపట్టింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని నమోదు చేసుకుంటూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇస్తున్నారు.
జనసేనాని పర్యటన
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పరామర్శించి, ఆర్థిక సాయం చేసేందుకు జనసేన అధినేత పవన కల్యాణ్ ఏప్రిల్ 12న జిల్లాలో పర్యటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో... ఆయన బరిలో దిగారు. ఉమ్మడి జిల్లా 35 కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు.
సీపీఐ ఉద్యమ బాట
కమ్యూనిస్టులు ఎప్పటిలాగే ప్రజా సమస్యలపై ఉద్యమాలు నడిపారు. అనేక సమస్యలపై గళం వినిపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, జాకీ తరలింపు, చలో అమరావతి కార్యక్రమాలను సీపీఐ నిర్వహించింది. చలో గొందిరెడ్డిపల్లి, చలో అమరావతి కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేశారు.
బీజేపీ మధ్యేమార్గం
బీజేపీ జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లోపాలపై విమర్శలు చేశారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని వివరించారు. రాజకీయంగా మధ్యేమార్గాన్ని అనుసరించారు.
సీపీఎం పోరుబాట
ఈ ఏడాది ఆరంభం నుంచే సీపీఎం ప్రభుత్వంపై పోరుబాటకు శ్రీకారం చుట్టింది. రైతు రక్షణ పేరుతో పాదయాత్ర చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది రైతుల నుంచి సంతకాలు సేకరించింది. ‘వ్యవసాయ సంక్షోభం-రైతాంగ ఉద్యమాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పురేంద్రప్రసాద్ సభకు హాజరయ్యారు.
పీసీసీ అధ్యక్షుడి మార్పు
కాంగ్రెస్, బీజేపీ సైతం ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గళం వినిపించారు. నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జిల్లాకు చెందిన శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తరువాత తన నియోజకవర్గం శింగనమలలో యాత్ర చేపట్టారు.