‘అనంత’కు 81.. శ్రీసత్యసాయి జిల్లాకు 66 మంది
ABN , First Publish Date - 2022-04-05T05:14:11+05:30 IST
జిల్లాల విభజన నేపథ్యంలో వైద్యశాఖ ఉద్యోగుల కేటాయింపుపై ఓ క్లారిటీ వచ్చేసింది. సిబ్బందిని పీహెచసీల ఆధారంగా చేపట్టారు.
అనంతపురం టౌన ఏప్రిల్4: జిల్లాల విభజన నేపథ్యంలో వైద్యశాఖ ఉద్యోగుల కేటాయింపుపై ఓ క్లారిటీ వచ్చేసింది. సిబ్బందిని పీహెచసీల ఆధారంగా చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వైద్యశాఖలో 147 మంజూరు పోస్టులు ఉన్నాయి. ఇందులో అనంత జిల్లాకు 81 మందిని... శ్రీసత్యసాయి జిల్లాకు 66 మందిని కేటాయిస్తూ రాష్ట్రశాఖ జిల్లా వైద్యశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కేడర్ల వారీగా విభజించిన ఉద్యోగులను కొత్త జిల్లాకు కేటాయిస్తామని డీఎంహెచఓ డాక్టర్ కామేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. అయితే డీఐఓ పోస్టును అనంతపురం జిల్లాలోనే ఉంచారు. వివిధ రకాల టీకాల పంపిణీలో డీఐఓ విభాగం కీలకంగా ఉండటం, పుట్టపర్తిలో టీకాల నిల్వకు వసతులు, పరికరాలు లేకపోవడంతో డీఐఓ అధికారి అనంతపురంలోనే ఉంటారు. ఇక్కడి నుంచే రెండు జిల్లాలకు టీకాలు సరఫరా అవుతాయి.
పోస్టింగుల కోసం పైరవీలు
వైద్యశాఖ ఉద్యోగుల విభజన, జిల్లాల కేటాయింపులో పెద్ద ఎత్తున పైరవీలు సాగుతున్నాయి. వైద్యశాఖలో ఏఏ హోదాలకు చెందిన వారికి బదిలీలు ఉంటాయో తెలిపారు కానీ, ఆయా స్థానాల్లో ఉద్యోగుల పేర్లను మాత్రం వెల్లడించారు. ఈ క్రమంలో చాలామంది శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అనంతపురంలో నివాసాలు ఉండటంతో ఇక్కడే ఉండేందుకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో డీఎంహెచఓపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉద్యోగుల విభజన అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచే లిస్ట్ వచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.