జనమిక్కడ... నిధులక్కడ!

ABN , First Publish Date - 2021-10-30T04:21:38+05:30 IST

కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో అధికారుల తప్పిదంతో ఆ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడింది. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వాలు ఇస్తున్న అభివృద్ధి నిధులు అందడం లేదు. పక్క పంచాయతీ ఖాతాలో జమ అవుతున్నాయి.

జనమిక్కడ... నిధులక్కడ!
కొర్విచెడ్‌గని గ్రామం

  •   అధికారుల తప్పిదం.. పంచాయతీ అభివృద్ధికి శాపం
  •   జనాభా లెక్కల నమోదులో పొరపాట్లు
  •   1,160 మంది జనాభాకు 480 మాత్రమే నమోదు 
  •   వేరే పంచాయతీ రికార్డులో 680 మంది జనాభా జమ
  •   30 నెలల్లో రూ.26,68,512 నిధులు కోల్పోయిన కొర్విచెడ్‌ గని పంచాయతీ
  •   గ్రామ పంచాయతీలో కుంటుపడిన అభివృద్ధి

కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో అధికారుల తప్పిదంతో ఆ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడింది. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వాలు ఇస్తున్న అభివృద్ధి నిధులు అందడం లేదు. పక్క పంచాయతీ ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన కొర్విచెడ్‌గని పంచాయతీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు, నేతలకు విన్నవించినా పట్టించుకోవడం లేదు 

బషీరాబాద్‌:  గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో అధికారుల తప్పిదంతో ఏకంగా ఆ పంచాయతీ లక్షలాది రూపాయల నిధులు కోల్పోవలసి వచ్చింది.  వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో ఒకప్పుడు కొర్విచెడ్‌ ఉమ్మడి పంచాయతీగా ఉండగా కొత్తగా అనుబంధ గ్రామం కొర్విచెడ్‌గని పంచాయతీగా ఏర్పడింది. 2011 జనాభాలెక్కల నమోదు సమయంలో అధికారులతప్పిదంతో ఇక్కడి బీసీ జనాభాను ఉమ్మడి పంచాయతీలో కలిపారు. దీంతో కొర్విచెడ్‌గని కొత్త పంచాయతీగా ఏర్పడినప్పటికీ ఇక్కడి నిధులు ఆ గ్రామ పంచాతీ ఖాతాలో జమ కావడంతో ఏకంగా లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. ఫలితంగా జనాభాకు అనుగుణంగా నిధులు రాక, గ్రామాభివృద్ది పూర్తిగా కుంటుపడింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సర్పంచ్‌ రాథోడ్‌ సునీత, ఎంపీటీసీ వడ్డేశ్రీను, స్థానిక ప్రజలు   పలుమార్లు  ఆందోళనలు చేశారు. పంచాయతీకి  రావాల్సిన  నిధులపై ప్రజాప్రతినిధులు, సంబధిత   అధికారులకు మొర పెట్టుకున్నాఫలితం లేకుండాపోయింది. నెలనెల పంచాయతీకి రావాల్సిన తలసరి గ్రాంటు పూర్తిస్థాయిలో రాక, ప్రజలెదుర్కొంటున్న సమస్యలు తీర్చలేక సర్పంచ్‌ నానా అవస్థలు పడుతున్నారు. 

కొత్త పంచాయతీల  ఏర్పాటులో...

2017లో కొత్త పంచాయతీల ఏర్పాటులో భాగం గా పూర్వ పంచాయతీ కొర్విచెడ్‌ నుంచి కొర్విచెడ్‌గని వేరైంది. ఆసమయంలో కొత్త పంచాయతీలోని వడ్డేర, ఇతరాత్ర కులాలను ఉమ్మడి పంచాయతీలో నమోదు చూపించారు. దీంతో ఇక్కడి బీసీలు సుమారు 680 మందిని ఉమ్మడి పంచాయతీలోనే ఉంచడంతో కొత్త పంచాయతీకి నెలనెల  రావాల్సిన ప్రభుత్వ నిధులు రావడం లేదు. 

నష్టపోయిన కొర్విచెడ్‌గని..

నూతన పంచాయతీల ఏర్పాటు తరువాత       కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినెలా పంచాయతీలకు నిధులను జమ చేస్తున్నాయి. 2011 జనాభా  లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి సరాసరి రూ. 132 చొప్పున నిధులను కేటాయిస్తున్నారు.ఈ మేరకు కొర్విచెడ్‌ గని పంచాయతీలో 480 మందికి గాను ప్రతి నెల రూ. 63,360 మాత్రమే జమ అవుతున్నాయి. వాస్తవంగా 1160 మందికి ప్రతి నెల సుమారు రూ. 1,53,120 మొత్తంగా జమ కావాల్సి ఉంది. కానీ అధికారుల తప్పిదంతో 680 మంది జనాభాను ఉమ్మడి పంచాయతీలో చూపడంతో నిధులన్నీ అక్కడే జమ అవుతుండటంతో ప్రతినెల రూ.89,760 నష్టం జరిగింది. దీంతో పంచాయతీ గడిచిన 30 నెలల్లో సుమారు రూ. 26,68,512 లక్షలకు పైగా నష్టపోయింది. ఆ మేరకు కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి అభివృద్ధికి భారీగా దెబ్బపడుతూ వస్తుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే కొత్త పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి గుర్తించిసమావేశం పెట్టి జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని అధికారులను కోరుతూ తీర్మాణం చేశారు. జనాభాప్రకారం ఎంత మంది పూర్వ పంచాయతీలో ఉన్నారు. ఇక్కడి పంచాయతీలోని బీసీలు అక్కడెంతమంది ఉన్నారో లెక్కలేసి చూపారు. మా నిధులు మాకు జమ అయ్యేలా చూడాలని అప్పటి జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కోరిన ఫలితం లేకుండాపోయింది. 


మా నిధులు వెనక్కి రప్పించాలి:  రాథోడ్‌ సునీత, సర్పంచ్‌ కొర్విచెడ్‌గని 

కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాత  కొర్విచెడ్‌గని పంచాయతీలో కేవలం 480 జనాభా    మాత్రమే నమోదైంది. అంతవరకే నిధులు కేటాయిస్తున్నారు.      జనాభాతో పాటు ఓటర్లుగా   కూడా అక్కడే నమోదు కావడంతో మూడు వార్డులకుఎన్నికలు జరుగలేదు. ఇప్పటికీ ఉపసర్పంచ్‌ను ఎన్నుకోలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ తప్పిదాన్ని సరిదిద్ది పక్కపంచాయతీకి వెళ్తున్న నిధులను వెనక్కి రప్పించాలి.

భారీగా  నష్టపోతున్నాం: రాజు, పంచాయతీ కార్యదర్శి, కొర్విచెడ్‌గని 

2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నారు. వాస్తవంగా పంచాయతీలో 1160 మంది జనాభా ఉండగా కేవలం 480 మంది మాత్రమే నమోదై ఉన్నారు. దీంతో పంచాయతీకి ప్రతి నెలా రూ. లక్షల్లో నష్టం జరుగుతోంది.ఈ విషయం స్థానిక, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.   


Updated Date - 2021-10-30T04:21:38+05:30 IST