బీటీ రోడ్ల నిర్మాణమెప్పుడు?
ABN , First Publish Date - 2021-11-22T05:29:11+05:30 IST
బీటీ రోడ్ల నిర్మాణమెప్పుడు?

- శంకుస్థాపన చేసి ఏడాదిన్నర!
- మట్టిరోడ్లతో ఇబ్బంది పడుతున్న తండా వాసులు
బషీరాబాద్: మా తండాలకు బీటీ రోడ్డు ఎప్పుడు వేస్తారు? అంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులకు మంత్రి సబితారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేశారు. ఇంకా పనులకు అతీగతి లేదని తండావాసులు వాపోతున్నారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి జడ్పీ రోడ్డు నుంచి హంక్యానాయక్, బాబునాయక్ తండాలకు ఎస్‌టీఎ్‌సడీఎఫ్ కింద బీటీ రోడ్డుకు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. తండాలకు బీటీ రోడ్ల పనులు నేటికీ ప్రారంభం కాలేదు. తండాలకు దారితీసే మట్టి రోడ్లను ముళ్ల పొదలు కప్పేస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారిందని తండావాసులు ఆవేదన చెందుతున్నారు. సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని సర్పంచ్‌లు సూర్య, దేవ్‌సింగ్ వాపోతున్నారు. ప్రతీ మండల సమావేశంలో సమస్యను లేవనెత్తుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.