ఎంపిక ఎప్పుడు?
ABN , First Publish Date - 2021-12-16T04:46:41+05:30 IST
ఎంపిక ఎప్పుడు?

- డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం
- ఇప్పటికే నిర్మితమైన ఇళ్లు.. కేటాయింపే తరువాయి!
- మేడ్చల్ జిల్లాలో 9,346 ఇళ్లు పూర్తి
- గ్రేటర్ పరిధిలో 8,796 నిర్మాణాలు
- ఇప్పటికే కేటాయించిన వాటిల్లో అసౌకర్యాలు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లు భారీగానే నిర్మించారు. అయితే లబ్ధిదారుల ఎంపిక సంకటంగా మారి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైతోంది. మేడ్చల్ రూరల్ జిల్లాలో ఇప్పటి వరకు 80 ఇళ్లు కేటాయించారు. వాటికి రోడ్లు, డ్రేనేజీ, నీటి వసతి, కరెంటు వంటి సదుపాయాలు సరిగా లేక అసౌకర్యం మధ్య నివసిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వం భారీ సంఖ్యలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించింది. పెద్దపెద్ద కాంప్లెక్స్‌ల పరిమాణాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని అర్హులకు కేటాయించి గృహప్రవేశాలు చేయించడమే తరువాయిగా పరిస్థితి ఉంది. వాటిల్లో నీరు, డ్రైనేజీ, రోడ్లు, రవాణా వంటి సదుపాయాలు పూర్తిచేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో 8,796, గ్రామీణ ప్రాంతంలో 550 ఇళ్లు కట్టారు. ఇళ్ల కేటాయింపు ప్రహసనంగా మారి తీవ్ర జాప్యం అవుతోంది. ఇదే అదననుగా కొందరు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి రూ.వేలల్లో దండుకుంటున్నారు.
నిర్మాణాలు పూర్తయి ఏడాది దాటింది..
మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలు పూర్తి కావచ్చి ఏడాది దాటింది. కరోనాతో అధికారులు, ప్రజా ప్రతినిధులు పేదలకు డబుల్ బెడ్ రూంలను అందించడానికి ముందుకు రావడం లేదు. మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మునిసిపాలిటీలున్నాయి. ఐదు మండలాలు 61 గ్రామ పంచాయతీలున్నాయి. కీసర మండలంలో మాత్రం రెండు గ్రామాల్లో 40 చొప్పున గృహాలను అందించారు. యాద్‌గార్‌పల్లి, చీర్యాలలో ఇచ్చిన డబుల్ బెడ్‌రూంల ప్రాంతాల్లో విద్యుత్తు, రోడ్లు, మంచినీటి వసతి లేక లబ్ధ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు.
కార్పొరేషన్ల పరిధిలో..
బాచ్‌పల్లిలో 1,080, నిజాంపేటలో 1,440, గాగిల్లాపూర్‌లో 650, గండిమైసమ్మ ప్రాంతంలో 640, బోరబండలో 620, కౌసర్‌నగర్‌లో 756, చిత్తారమ్మ ప్రాంతంలో 801, సైతాలపూర్ పరిధిలో 144 , బి.పోచమ్మప్రాంతంలో 1,621, బహుదూర్‌పల్లిలో 900, గాజుల రామారంలో 144 డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించారు. రాంపల్లిలో 6,200, దమ్మాయిగూడలో 4,300, శామీర్‌పేటలో వెయ్యికిపైగా నిర్మాణాలు చేపట్టారు.
కష్టాల కడలిలో ...
కీసర మండలంలో యాదగిరిపల్లిలో 40, చీర్యాలపరిధిలో పేదలకు ఇచ్చిన ఇళ్లలో విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, రోడ్లు పూర్తి కాలేదు. మంత్రి మల్లారెడ్డి వాటిని పంపిణీ చేశారు. లబ్ధిదారులే కరెంట్, నీటి కనెక్షన్లకు డబ్బులు చెల్లించి తీసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. బురద రోడ్లతో ఇబ్బంది పడుతున్నారు.
మేడ్చల్ రూరల్‌లో 550 డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలు
మేడ్చల్ మండలంలోని రూరల్, మునిసిపాలిటీల్లో రోడ్లు భవనాల శాఖ 550 డబుల్ బెడ్‌రూమ్‌లను నిర్మాణం చేపట్టింది. అన్ని పూర్తి అయ్యాయి. కృష్ణాపూర్‌లో 80, తర్కపల్లిలో 40, ఘట్‌కేసర్‌లో 40, బోడప్పుల్‌లో 74, జంగిచర్లలో 40, ఫీర్జాదిగూడలో 74, , యాద్‌గారిపల్లిలో 40, చీర్యాలలో 40, కీసరలో 48, సోమవారంలో 30, పర్వతపూర్ 40, మరో 34 మొత్తంగా 550 గృహాలను నిర్మానం చేట్టారు. ఈ గృహాల కోసం 1800 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు విచారణ అలస్యమవుతుంది. వీటితోపాటు సీటి పేదలకు డబుల్ బెడ్ రూంలను అందించడానికి దమ్మాయిగూడ మునిసిపాలిటీ పరిధిలో 4600, నాగారం మునిసిపాలిటీలో రాంపల్లి సమీపంలో 5000 డబుల్ శామీర్‌పేటలో మరో 3,400 ఇళ్లు నిర్మించారు. ఈ నిర్మాణాలు పూర్తయినా కేటాయించలేదు.
దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టాం: ఏనుగు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్, మేడ్చల్
మేడ్చల్ రూరల్ పరిధిలో 550 ఇళ్లు నిర్మించాం. వీటికి 1,800 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే కొన్నింటి విచారణ పూర్తిచేశాం. మిగతా వాటి పరిశీలనకు తహసీల్దార్లను ఆదేశించాం. విచారణ పూర్తి కాగానే లాటరీ విధానంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తాం.