బొంకూరుకు దారేది..!

ABN , First Publish Date - 2021-06-21T05:01:52+05:30 IST

వర్షాకాలం వస్తే బొంకూరు గ్రామానికి వెళ్లాలంటే నరకయాతనే..

బొంకూరుకు దారేది..!
తాండూరు మండలం బిజ్వార్‌-బొంకూరు గ్రామాల మధ్య పారుతున్న కాగ్నా నది

  • గ్రామానికి ముందు కాగ్నా వాగు.. వెనుక మంబాపూర్‌ వాడుక 
  • వర్షాకాలంలో ప్రజలకు తప్పని ఇబ్బందులు


తాండూరు రూరల్‌: వర్షాకాలం వస్తే బొంకూరు గ్రామానికి వెళ్లాలంటే నరకయాతనే.. బొంకూరు గ్రామం నుంచి తాండూరు పట్టణానికి వెళ్లాలంటే మరో దారేలేదు... వర్షాకాలం వచ్చిందంటే గ్రామం ముందు కాగ్నా నది నిండుకుండలా ప్రవహిస్తుంటుంది.. గ్రామం వెనుక నుంచి తాండూరు పట్టణానికి వెళ్లాలంటే బీటీ రోడ్డులేక  నానా అవస్థలు పడాల్సిందే. అదేదారిలో రైల్వే అధికారులు నిజాం కాలంనాటి రైల్వే గేటును తొలగించి ఆ స్థలంలో రైల్వే అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి కింద ఐదు మీటర్ల వరకు వర్షం నీరు నిలిచింది. దీంతో తాండూరు పట్టణానికి వెళ్లే దారిలేక నానా అవస్థలు పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సర్పంచ్‌ ద్యావరి నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బొంకూరు వద్ద కాగ్నానదిపై బ్రిడ్జి నిర్మించాలని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి విన్నవించినా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం కాగ్నా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయాలి.. లేదా గ్రామం ఉత్తర దిక్కున మంబాపూర్‌ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపటి ్ట గ్రామ సమీపంలోని రైల్వే అండర్‌బ్రిడ్జి నుంచి వెళ్లేందుకు నీటిని తొలగించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. మండలంలోని మారుమూల గ్రామంలో బొంకూరు గ్రామం కూడా ఒకటని,  ప్రస్తుతం బిజ్వార్‌ గ్రామపంచాయతీలో కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అత్యవసర సమయంలో గర్భిణులు ఆస్పత్రికి వెళ్లాలంటే దారిలేక అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బ్రిడ్జి లేక వర్షాకాలంలో అవస్థలు

ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే  మా గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బొంకూరు-బిజ్వార్‌ గ్రామాల మధ్య ఉన్న కాగ్నా నది భారీ వర్షాలు కురిస్తే పొంగి ప్రవహిస్తుంటుంది. దీంతో అత్యవసరం ఉన్నా గ్రామం నుంచి వెళ్లే వీలు ఉండదు. ప్రస్తుతం చిన్నపాటి వర్షానికి కాగ్నా నది ప్రవహిస్తుంది. రైల్వే అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నాం. ప్రజాప్రతినిధులు సమస్యను పరిశీలించి నదిపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలి.

           - ద్యావరి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌, బిజ్వార్‌



Updated Date - 2021-06-21T05:01:52+05:30 IST