వరదల నివారణకు వాటర్ సైన్స్
ABN , First Publish Date - 2021-10-02T04:54:17+05:30 IST
వరదల నివారణకు వాటర్ సైన్స్
- బిట్స్ పిలానీ సరికొత్త ప్రతిపాదనలు
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): వరదలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాటర్‌సైన్స్ ద్వారా దారి మళ్లించవచ్చని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాం పస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ ప్రొఫెసర్ కె.శ్రీనివాసరాజు, రీసెర్చ్ స్కాలర్ రాం పల్లి మాధురి అంటున్నారు. ఆ ఇద్దరు హైదరాబాద్‌లో వరదనీటిని అరికట్టడం ఎలా అనే అంశంపై ఒక నివేదికను తయారు చేస్తున్నారు. నివేదిక గురించి ఆంధ్రజ్యోతికి చెప్పిన వివరాలు వారి మాటల్లోనే...
గంటల్లోనే భారీ వర్షం
వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేడు గంటల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికితోడు వర్షపునీరు వెళ్లకుండా సీసీ, బీటీరోడ్లు, అర్బన్‌లొకాలిటీలు అడ్డుగా మారాయి. వర్షపునీరు భూమిలో ఇంకే అవకాశం లేదు. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లే దారిలేదు. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసినప్పుడు నీరు బయటకు వెళ్లలేని స్థితిలో నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.
ఏడేళ్లుగా పరిశోధనలు
2014 నుంచి పరిశోధనలు చేస్తున్నాం. ప్రాజెక్టు నివేదికల తయారీ పూర్తయింది. పలువురు స్కాలర్లు రీసెర్చ్‌లను కొనసాగిస్తున్నారు. ఒకరు అధికవర్షాలపై, మరొకరు వర్షాలతో రోడ్లపై నీటి నిల్వను నివారించే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.
పది రకాల పరిశోధనలు
వరద నీటిని అరికట్టేందుకు పది రకాల ప్రణాళికలను రూపొందించాం. వాటిలో ప్రధానమైంది అపార్ట్‌మెంట్లపై నుంచి వచ్చే వర్షం నీటిని ఇంకుడు గుంతలతో భూమిలోకి పంపడం ఒకటి. ప్రస్తుతం మున్సిపాలిటీలు అనుమతులు ఇస్తున్న ఇంకుడు గుంతల లాంటివి కాకుండా చాలా పెద్దగా భూమి లోపలికి వర్షపు నీరు చేరేలా కొత్తరకం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నాం. పాతకాలంలో గృహ యజమానులు వర్షపునీరు పడుతున్న చోట పెద్ద డ్రమ్ములను పెట్టి నీటిని నిల్వ చేసేవారు. మహానగర నివాస ప్రాంతాల్లో కూడా అలాంటి ఏర్పాట్లు చేయడం, రోడ్ల పై వర్షం కురిసినపుడు నీరు నేరుగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలోకి కాకుండా, రోడ్డుకు ఇరువైపులా వెళ్లే విధం గా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. వర్షం నీరు చెరువులోకి వెళ్లే విధంగా చేయడం, గ్రాస్డ్ స్వేల్స్, సాండ్ ఫిల్టర్స్ సర్‌ఫేస్, బయోరిటెన్షన్, ఫిల్టర్స్ స్ట్రిప్స్, వెట్ పాండ్స్, కన్‌స్ట్రక్టడ్ వెట్ ల్యాండ్స్, ఇన్‌ఫిలే్ట్రషన్ బేసన్, ఇన్‌ఫిలే్ట్రషన్ ట్రెంచ్, రెయిన్ బ్యారల్స్‌తో వరద ముంపును అరికట్టడానికి ప్రణాళికలు తయారు చేశాం. ప్రాజెక్టులో సూచించిన కొత్త పద్ధతుల అమలుకు భారీగా ఖర్చు అవుతుంది. నగరంలోని ఒక్కో ప్రాంతానికి సుమారు రూ.200 కోట్ల మేర ఖర్చవుతుంది.