లాక్‌డౌన్‌ ఆంక్షల ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-05-19T04:32:05+05:30 IST

లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, వికారాబాద్‌ జిల్లా దోమ మండల

లాక్‌డౌన్‌ ఆంక్షల ఉల్లంఘన
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గుంపులుగా జనం

  • పది గంటల తర్వాత చెక్కులు పంపిణీ చేసిన పరిగి ఎమ్మెల్యే  మహేష్‌రెడ్డి
  • భౌతికదూరం పాటించని జనం


దోమ: లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, వికారాబాద్‌ జిల్లా దోమ మండల కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. మంగళవారం దోమ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట 76 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉదయం 10 గంటల తర్వాత ఈ కార్యక్రమం కొనసాగింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని ప్రభుత్వ నిబంధనలున్నా వాటిని గాలికొదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు, పోలీస్‌, రెవెన్యూ అధికారులు కూడా పాల్గొనడం దూమారం రేపింది. పాజిటివ్‌ వచ్చిన రోగులకు వైద్య సౌకర్యాలు లేక అల్లాడుతుంటే.. వారిని పట్టించుకోకుండా వందలాది జనాలను ఒకేచోట సమావేశపరిచి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని విక్షప ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.


కరోనా పాజిటివ్‌ మహిళకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

 దోమ మండల పరిధిలోని బ్రాహ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు  కొన్ని రోజుల నుంచి జలుబు, జ్వరం వస్తుంది. కరోనా టెస్ట్‌ కోసం మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టోకెన్‌ తీసుకుంది. అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పంపిణీ చేసే చెక్కుల పంపినీ కార్యక్రమానికి హాజరైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ మహిళ చెక్కును అందుకుంది. తర్వాత ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఇలాంటి వారు ఆ కార్యక్రమానికి ఎందరో వచ్చి ఉంటారని గుసగుసలాడుకున్నారు. 



Updated Date - 2021-05-19T04:32:05+05:30 IST