ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’

ABN , First Publish Date - 2021-02-07T04:59:31+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’

ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’
రాంపూర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

లబ్ధిదారులకు సొంతూళ్లలోనే పింఛన్‌ ఇవ్వాలి 

మీతో నేను కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌

బంట్వారం (కోట్‌పల్లి) : గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికే ‘మీతో నేను..’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. కోట్‌పల్లి మండలం కంకణాలపల్లి, మల్‌శెట్టిపల్లితండా గ్రామాల్లో  శనివారం ఆయన పర్యటించారు. వికారాబాద్‌ నుంచి కోట్‌పల్లి వెళ్లే బస్సును కంకణాలపల్లి వరకు నడపాలని గ్రామస్థులు కోరగా వెంటనే డిపో మేనేజర్‌తో మాట్లాడి గ్రామానికి బస్సు నడపాలని ఆదేశించారు. గ్రామంలో  రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టు భర్తీ చేయాలని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి టీచర్‌ను నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా గత రెండేళ్లుగా రేషన్‌డీలర్‌ పోస్టు ఖాళీ ఉండటంతో జిన్నారం గ్రామం నుంచి రేషన్‌ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు విన్నవించగా వీలైనంత తొందరగా డీలర్‌ను నియమించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మల్‌శెట్టిపల్లితండాలో వేలాడుతున్న విద్యుత్‌తీగలను అప్పటికప్పుడు విద్యుత్‌ అధికారులతో మాట్లాడి సరిచేయించారు. పింఛన్‌కోసం రాంపూర్‌ గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని లబ్ధిదారులు తెలపడంతో ఇకనుంచి గ్రామానికే వచ్చి పింఛన్‌ ఇవ్వాలని పోస్ట్‌మన్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.  అనంతరం రాంపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచులు అనిత, చంద్రకళ, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌,  రైతుబంధు అధ్యక్షుడు సత్యం, వైస్‌ఎంపీపీ ఉమాదేవి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటే్‌షయాదవ్‌, డైరెక్టర్‌ మధుసూధన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

దోర్నాల్‌లో పర్యటన 

ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్‌ గ్రామాన్ని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ శనివారం సందర్శించారు. గ్రామంలో కోళ్లు మృత్యువాతపడటంపై గ్రామస్థులతో మట్లాడారు. బతికి ఉన్న కోళ్లకు వ్యాధి సోకకుండా మందులు ఇవ్వాలని ఆయన పశువైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, సర్పంచ్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు. 

మంత్రులను కలిసిన ఎమ్మెల్యే

వికారాబాద్‌: రాష్ట్ర మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, నిరంజన్‌రెడ్డిని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిని కలిసి మాట్లాడారు. ఆయన వెంట మార్కెట్‌  చైర్మన్లు దుర్గంచెర్వు మల్లేషం, విజయ్‌కుమార్‌, రాములు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-07T04:59:31+05:30 IST