నిరుపయోగంగా సీటీస్కాన్‌

ABN , First Publish Date - 2021-05-31T05:09:26+05:30 IST

కరోనా విపత్కర సమయంలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో

నిరుపయోగంగా సీటీస్కాన్‌
తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఉపయోగంలో లేని సీటీస్కాన్‌

  • తాండూరు జిల్లా ఆస్పత్రిలో రెండేళ్లుగా పనిచేయని మిషన్‌
  • కొవిడ్‌ సమయంలో హెచ్‌ఆర్‌ స్కాన్‌ కోసం ప్రజలు ఇబ్బందులు  
  • మంత్రి ఆదేశించినా కొత్త స్కానర్‌ కొనుగోలు చేయని అధికారులు


తాండూరు: కరోనా విపత్కర సమయంలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీస్కాన్‌ పనిచేయకుండా మూలనపడి ఉండడం రోగులకు తీవ్ర ఇబ్బంది మారింది. హెచ్‌ఆర్‌సీటీ స్కానింగ్‌ చేయించుకోవాలంటే ప్రైవేట్‌లో రూ.4వేలు వ్యయం చేయవలసి వస్తుంది. ఇది రోగికి తీవ్ర భారంగా మారింది. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.కోటి వ్యయంతో 2008లో సీటీస్కాన్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతినెలా 800 నుంచి 1000 మంది వరకు సీటీస్కానింగ్‌ చేసేవారు. 10ఏళ్ల సర్వీసు వారంటీ ఉన్న ఈ సీటీస్కాన్‌ను 13ఏళ్ల వరకు సాఫీగా పనిచేసింది. అనంతరం తరచూ రిపేర్‌ వస్తుండ టంతో తమిళనాడు, చెన్నై తొషీబా కంపెనీతో మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం 2019 నుంచి సీటీస్కాన్‌ పూర్తిగా మూలనపడింది. ప్రస్తుతం ఈ సీటీస్కాన్‌ పనిచేయదని, కొత్తది కొనుగోలు చేసుకోవాల్సిం దేనని వైద్యవిధాన పరిషత్‌కు నిపుణులు తేల్చిచెప్పారు. గతంలో ఉపయోగంలో ఉన్నప్పుడు పేదలకు రూ.800కు సీటీస్కాన్‌ చేసేవారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కేర్‌ ఆసుపత్రితో ఒప్పందం చేసుకొని ఒక్కో స్కానింగ్‌పై రూ.325 చెల్లించి అక్కడి నుంచి రిపోర్టు తెప్పించుకుని రోగికి ఇచ్చేవారు. 

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళలో ప్రజలకు లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌తోపాటు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలంటే సీటీ స్కాన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఈ సమయంలో రోగులకు అందుబాటులో లేకుండా పోవడం ఇబ్బందిగా మారింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్యెల్యేతో కలిసి కొవిడ్‌పై సమీక్షిస్తున్న సమయంలో సీటీస్కాన్‌ నిరుపయోగంగా ఉందని తెలుసుకొని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న విషయం జిల్లా ఆసుపత్రి చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌ను ప్రశ్నించారు. తక్షణమే జిల్లా నిధులు వెచ్చించి, ఎంత ఖర్చయినా వెనుకంజ వేయకుండా జిల్లా ఆసుపత్రిలో సీటీస్కాన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశించి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా సీటీస్కాన్‌ ఏర్పాటు కాలేదు.


బోయింగ్‌ కంపెనీ పరిశీలన

తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కొత్త సీటీస్కాన్‌ ఏర్పాటు చేసే విషయమై బోయింగ్‌ కంపెనీతో వైద్యశాఖ ఉన్న తాధికారులు చర్చించారు. ఎస్టిమేట్లు, వారంటీ విషయాలను పరిశీలిస్తున్నారు. సీటీస్కాన్‌ ఏర్పాటు కు ఆస్పత్రిలో అనువైన గదిని సమకూర్చుతున్నాం.

- డాక్టర్‌ మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి



Updated Date - 2021-05-31T05:09:26+05:30 IST