తెలియకుండానే రైతుఖాతాలో రుణం
ABN , First Publish Date - 2021-10-30T04:53:52+05:30 IST
తెలియకుండానే రైతుఖాతాలో రుణం
- తడిసిమోపెడైన అసలు, వడ్డీ..
- మేనేజర్‌కు మొరపెట్టుకున్న రైతు
ధారూరు: తన అప్పుఖాతాలో తనకు తెలియకుండా జమ చేసిన డబ్బును వాడుకోకున్నా వడ్డీవేశారని, తనకు సంబంధంలేని రుణం అసలు, వడ్డీ డబ్బులను రుణఖాతాలో నుంచి మినహాయించాలని మండలంలోని కొండాపూర్‌కలాన్ గ్రామానికి చెందిన రైతు కాళికారెడ్డి శుక్రవారం నాగసమందర్ ఎస్‌బీఐ మేనేజర్ తిలక్‌కు విన్నవించారు. రైతు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నాగసమందర్ ఎస్‌బీఐ బ్యాంకులో రైతు కాళికారెడ్డికి రూ.68,932లు పాత పంట రుణం ఉంది. జూలై 21, 2017న రైతు ఖాతాలో రూ.58వేలు రుణం తీసుకున్నట్లు ఖాతాలో జమచేశారు. సెల్‌ఫోన్‌లో సందేశం చూసుకున్న రైతు కాళికారెడ్డి వెంటనే బ్యాంకు వచ్చి తనకు తెలియకుండా జమ అయిన డబ్బులపై ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకువారు అక్టోబర్ 3, 2018నాడు రూ.58వేలలో నుంచి రూ.42,300 మాత్రమే ఖాతాలో నుంచి తొలగించారు. మిగతా రూ.15,700లను అలాగే ఉంచారు. ఈ విషయమై బాధిత రైతు బ్యాంకు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించకుండా రుణాన్ని 2018లో రెన్యూవల్ చేశారు. దీంతో రైతు అప్పుకాస్తా మూడేళ్లలో రూ.1,11,528లకు పెరగింది. ఆందోళనకు గురైన రైతు బ్యాంకు మేనేజర్ తిలక్‌ను కలిసి సమస్యను వివరించారు. తనకు తెలియకుండా జమచేసిన రుణం, వడ్డీ డబ్బులను మినహాయించి న్యాయం చేయాలని మేనేజర్‌ను కోరారు. కాగా ఖాతాబ్యాలెన్సు షీట్‌ను పరిశీలించి తప్పు ఎక్కడ జరిగిందో గుర్తిస్తామన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేనేజర్ రైతుకు హామీ ఇచ్చారు.