నకిలీ పత్రాలు, సంతకాల ఫోర్జరీతో బ్యాంకు రుణాలు కాజేసిన ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-28T05:02:02+05:30 IST

నకిలీ పత్రాలు, సంతకాల ఫోర్జరీతో బ్యాంకు రుణాలు కాజేసిన ఇద్దరి అరెస్టు

నకిలీ పత్రాలు, సంతకాల ఫోర్జరీతో బ్యాంకు రుణాలు కాజేసిన ఇద్దరి అరెస్టు
ఆమనగల్లు డీసీసీబీ బ్యాంకు

  • నిందితుల్లో మహబూబ్‌నగర్‌ డీసీసీబీ డీజీఎం, మరో ఇద్దరు 
  • రుణాలిప్పిస్తామని రైతుల నుంచి పత్రాల స్వీకరణ 
  • పరారీలో మరో వ్యక్తి 

ఆమనగల్లు: సహకార బ్యాంకు ద్వారా రుణాలిప్పిస్తామని రైతుల నుంచి భూ పత్రాల జిరాక్స్‌లను తీసుకుని వాటి ఆధారంగా నకిలీ భూ పత్రాలను తయారచేయడమే కాకుండా రెవెన్యూ అధికారుల, రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకు ద్వారా రుణాలు కాజేసిన వ్యక్తులు కటకటాల పాలయ్యారు. ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో మహబూబ్‌నగర్‌ డీసీసీబీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దమయంతి,  రైతులు, బ్యాంకు అధికారులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన బంగారిగళ్ల శ్రీను ఉన్నారు. అప్పటి ఆమనగల్లు డీసీసీబీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు పరారీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జాల ఉపేందర్‌, ఎస్‌ఐ ధర్మేశ్‌ కేసు వివరాలను వెల్లడించారు. చంద్రధనకు చెందిన రైతులు మాలే జంగయ్య, బంగారి మల్లమ్మ, మాల జంగమ్మ, గుద్దేటి మల్లయ్య, బాగరి గల్ల నర్సింహలతో పాటు మరి కొంతమంది రైతులకు ఆమనగల్లు డీసీసీబీ ద్వారా రుణాలు ఇప్పిస్తానని బంగారిగళ్ల శ్రీను వారి భూముల పత్రాలను తీసుకున్నాడు. వాటి ఆధారంగా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఎకరా, రెండెకరాలు ఉన్నవారికి 6, 7 ఎకరాలు భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించాడు. 2012లో ఒక్కొ రైతు పేరిట సుమారు రూ.2.50 లక్షల వరకు బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించాడు. డబ్బులు డ్రా చేసిన ముగ్గురు వ్యక్తులు, మరికొంత మంది అధికారులతో కలిసి ఒక్కొ రైతుకు రూ.8వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పారు. క్రాప్‌లోన్‌గా బావించిన రైతులు బ్యాంకు అధికారులు, మధ్యవర్తి మాటలు నమ్మి సంతకాలు, వేలిముద్రలు వేశారు. ఆ తర్వాత అప్పటి మేనేజర్‌గా ఉన్న దమయంతి, ఫీల్డ్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు క్షేత్రస్థాయిలో ఎటువంటి విచారణ లేకుండా తప్పుడు నివేదికలు పొందపరిచి రుణాలు మంజూరు చేశారు. కాగా వారు బ్యాంకులో పనిచేసినంత కాలం రైతులకు రుణాల మంజూరు, రికవరి విషయాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరిలో చంద్రధనకు చెందిన మాల జంగయ్య వద్దకు ప్రస్తుత బ్యాంకు అధికారులు రికవరీకి వెళ్లి రూ.5.25 లక్షల వడ్డీతో కలిపి రుణం చెల్లించాలని చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనకు కేవలం ఎకరా 9 గుంటల భూమే ఉందని, తాను బ్యాంక్‌ నుంచి ఎలాంటి డెయిరీ లోన్‌ తీసుకోలేదని తెలిపాడు. రుణం మంజూరు పత్రాలపై ఉన్న ఫొటోలోని వ్యక్తి బల్‌రామ్‌ అని అతను 2015లో చనిపోయాడని బ్యాంకు అధికారులతో వాపోయాడు. జరిగిన మోసాన్ని గుర్తించిన మాల జంగయ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమనగల్లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ ధర్మేశ్‌ దర్యాప్తు చేపట్టారు. ఫోర్జరీ సంతకాలతో రికార్డులు సృష్టించిన దమయంతి, కిషన్‌రావు, శ్రీనులతో పాటు మరికొంత మంది అధికారులు రుణాలు కాజేసినట్లు గుర్తించారు. కాగా, శుక్రవారం దమయంతి, శ్రీనులను అరెస్ట్‌ చేసి కల్వకుర్తి కోర్డులో హాజరు పర్చారు. కిషన్‌రావు పరారీలో ఉన్నట్లు  సీఐ, ఎస్‌ఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-28T05:02:02+05:30 IST