ముష్కరుల అంతర్యుద్ధాలతో ప్రపంచం కకావికలం

ABN , First Publish Date - 2021-08-21T04:40:36+05:30 IST

ముష్కరుల అంతర్యుద్ధాలతో ప్రపంచం కకావికలం

ముష్కరుల అంతర్యుద్ధాలతో ప్రపంచం కకావికలం
వీహెచ్‌పీ రాష్ట్రస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న స్వామి సుబ్రతో చైతన్యానంద

  • వివేకానంద స్వామి ఆశ్రమ పీఠాధిపతి స్వామి సుబ్రతో చైతన్యానంద
  • ఘట్‌కేసర్‌లో విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

( ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి ): కరోనా మహమ్మారి ప్రళయంతోపాటు ముష్కరుల అంతర్యుద్ధాలతో ప్రపంచం కకావికలమయ్యిందని, శాంతి కోసం అందరూ హిందూత్వం వైపు చూస్తున్నారని వివేకానంద స్వామి అశ్రమ పీఠాధిపతి స్వామి సుబ్రతో చైతన్యానంద అన్నారు. శుక్రవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడలో రాష్ర్టీయ విద్యానికేతన్‌లో విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ కార్యవర్గ సమావేశం జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి శుక్రవారం పలువురు విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌కు చెందిన సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భరతమాత, శ్రీరాముడి చిత్రపటాలకు పూజలు నిర్వహించి సమావేశం ప్రారంభించారు. అనంతరం సుబ్రతో చైతన్యానంద మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పడానికి భారత్‌ గురుతర బాధ్యతతో ముందుకు సాగాలని అన్నారు. దేశంలో చాలా చోట్ల హిందూత్వంపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలకులు హిందుత్వాన్ని విభజించి, కుల వ్యవస్థలను పెంపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అభిప్రాయపడ్డారు. మతమార్పిడిని అరికట్టడానికి వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, కార్యదర్శి సత్యంలు సరైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ రాష్ట్ర సహ కార్యదర్శి జి. శ్రీధర్‌ పర్యవేక్షించారు. సమావేశాల్లో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు యాదిరెడ్డి, జగదీశ్వర్‌, రాజేశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వర రాజు, వరలక్ష్మీ, సునీతా రాంమోహన్‌రెడ్డి, భాస్కర్‌, బాలస్వామి, శశిధర్‌, శ్రీనివాస రాజులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T04:40:36+05:30 IST