ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
ABN , First Publish Date - 2021-11-06T04:38:23+05:30 IST
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

పూడూర్: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని చన్‌గోముల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చన్‌గోముల్‌కు చెందిన వెంకటయ్య(30) మాధవి భార్యాభర్తలు. మాధవి గత 6 నెలలుగా అదే గ్రామానికి చెందిన శేఖర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో భర్త వెంకటయ్య తరచూ తమకు అడ్డువస్తున్నాడని భావించిన మాధవి ప్రియుడితో కలిసి వెంకటయ్యను హతమార్చాలని పథకం వేసింది. గురువారం వెంకటయ్యను పొలానికి తీసుకెళ్లి మద్యం తాగించారు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న భర్త వెంకటయ్యను తలపై బండరాయితో కొట్టి హత్యచేశారు. శుక్రవారం అదే గ్రామానికి చెందిన జాకీర్ తన పొలానికి వెళ్లగా వెంకటయ్య మృతి చెంది పడి ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో పరిగి సీఐ లక్ష్మీరెడ్డి, చన్‌గోముల్ ఎస్సై శ్రీశైలం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటయ్య మృతిపై పోలీసులు విచారణ చేపట్టగా భార్య మాధవి ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ సంఘటనపై పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు.