సెకండ్‌ డోస్‌ వందశాతం పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-12-08T05:13:24+05:30 IST

జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం జరిగేలా

సెకండ్‌ డోస్‌ వందశాతం పూర్తిచేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ సిద్ధం
  • తక్కువ వ్యాక్సినేషన్‌ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలి
  • వలస వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవచూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఒమైక్రాన్‌ వేరియంట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొవిడ్‌ మొదటి, రెండో దశలో ఉత్తమంగా పనిచేసిన వైద్య, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పోలీ్‌సశాఖ సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటిడోస్‌ జిల్లాలో 106శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. రెండో డోస్‌ కూడా వందశాతం పూర్తయ్యేలా చూడాలని సూచించారు.


ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం

ఒమైక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ సిద్ధంగా ఉందన్నారు. కొవిడ్‌ ప్రమాణాలు పాటించేలా చూడాలని తెలిపారు. తక్కువ వ్యాక్సినేషన్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి పూర్తి స్థాయిలో టీకాలు వేసేలా చూడాలని తెలిపారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌పై భయం వద్దు. జాగ్రత్తలు పాటించి జయిద్దామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. 


బడుల్లో పరిశుభ్రత బాధ్యత పంచాయతీ కార్మికులదే..

ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బందిదేనన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి టీచర్లు, సిబ్బంది రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకునేలా చర్యలు చేపట్టాలని డీఈవోకు సూచించారు. పిల్లల్లో కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటేనే యాంటీబయాటిక్‌ వాడాలని, గ్రామాల్లో ఆర్‌ఎంపీ డాక్టర్లు చిన్నపిల్లలకు యాంటీబయాటిక్‌ వేయకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, పాఠశాలల్లో తల్లిదండ్రులతో మీటింగ్స్‌ ఏర్పాటు చేయించి అవగాహన కల్పించాలని సూచించారు. 


వలస వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి

రంగారెడ్డి జిల్లాకు ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వలస వస్తుంటారని, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి 100 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలన్నారు. పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో పనిచేసే వారిని, మురికివాడల్లో నివసించే వారిని గుర్తించి స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా టీకాలు వేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులందరూ ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేయించాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సమావేశంలో మూసీ రివర్‌ బోర్డు చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి, జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌, వివిధ శాఖ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-08T05:13:24+05:30 IST