కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-10-21T04:08:01+05:30 IST
కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

తాండూరు : యాలాల మండలం తిమ్మాయిపల్లి గేటు వద్ద పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బురుగుపల్లి పాపయ్య(34) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా మృతుడు గ్రామాన్ని విడిచి అదే మండలంలోని దౌలాపూర్ గ్రామంలో బంధువుల వద్ద ఉంటున్నాడు. ఇటీవల తిమ్మాయిపల్లిలో సమీపబంధువు మృతిచెందగా గ్రామానికి వచ్చాడు. బుధవారం ఉదయం తిమ్మాయిపల్లి-దౌలాపూర్ గ్రామాల మార్గంలో గల తిమ్మాయిపల్లి గేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కత్తితో గొంతుపై పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే పాపయ్య దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కూడా పోలీసులకు లొంగిపోయి తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. మృతుడు, నిందితుడు ఇద్దరూ స్నేహితులని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, యాలాల ఎస్‌ఐ సురే్‌షతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు.