ప్రజా సంక్షేమానికి నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2021-12-30T05:38:07+05:30 IST

ప్రజా సంక్షేమానికి నిరంతర పోరాటం

ప్రజా సంక్షేమానికి నిరంతర పోరాటం
వికారాబాద్‌ : పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) నాయకులు

వికారాబాద్‌ : ప్రజాసంక్షేమం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న జెండా ఎర్రజెండా అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.జ్యోతి అన్నారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌లో సీపీఐ(ఎం) రెండో మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. కొవిడ్‌-19 విపత్కర సమయంలో ప్రజలను కాపాడే దేశాల్లో ముందంజలో ఎర్రజెండా అధికారంలో ఉన్న సోషలిస్ట్‌ దేశాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రస్తుతం ప్రజల చూపు ఎర్ర జెండాలపై ఉందని, భవిష్యత్తు కాలం ఎర్ర జెండాలదేనని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో అగ్ర రాజ్యంగా పేరుగాంచిన అమెరికా కొవిడ్‌ సమయంలో పేదరికాన్ని గాలికొదిలేసిందన్నారు. ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి పెట్టుబడిదారులకు ఊడిగం చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అసైన్డ్‌, అటవీభూములకు పట్టాలిచ్చి సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆమె సూచించారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లాకు సాగునీరందించాలని, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కళాశాలను నెలకొల్పాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రజలకు మోసపూరిత హామీలిస్తూ.. మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అంతకుముందు పట్టణంలో ఎంఆర్‌పీ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ భవన్‌వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జంగారెడ్డి, జగదీష్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్‌, మహిపాల్‌, వెంకటయ్య, శ్రీనివాస్‌, బుగ్గప్ప, శ్రీనివాస్‌, చెంద్రయ్య, సుదర్శన్‌, సుభాష్‌, అమరేష్‌, రవి, మాణిక్‌, శ్రీను, రాగిణి, రామన్న, హబీబ్‌, రవి, రాము, అమీర్‌, కార్యకర్తలు, నాయకులు, కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. 

  • సీపీఎం మహా సభలకు తరలివెళ్లిన నాయకులు

తాండూరు : వికారాబాద్‌ పట్టణంలో నిర్వహించిన సీపీఎం మహాసభలకు తాండూరు పట్టణం నుంచి ఆ పార్టీ నాయకులు,  కార్యకర్తలకు బుధవారం తరలివెళ్లారు. తాండూరు నియోజకవర్గం నుంచి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నాయకులు మహేష్‌, సతీష్‌, రాము, సంజీవు, విద్యార్థి సంఘాల నాయకులు తరలివెళ్లారు.

Updated Date - 2021-12-30T05:38:07+05:30 IST