పరీక్షలు కొందరికే..

ABN , First Publish Date - 2021-05-03T04:43:49+05:30 IST

కరోనా దూకుడును ప్రదర్శిస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో రోజుకు వందల్లో దీని బారిన పడుతున్నారు. కరోనా లక్షణాలతో టెస్టుల కోసం ఆసుపత్రులకు వెళితే కిట్లు లేనందున టెస్టులు చేయడం లేదన్న బోర్డులు కనిపిస్తున్నాయి.

పరీక్షలు కొందరికే..

  • కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గింపు
  • ఏప్రిల్‌ 15న 3123 మందికి పరీక్షలు
  • జిల్లాలో ఇదే అత్యధికం
  • ఆదివారం అత్యల్పంగా 807 మందికే
  • పరీక్ష కేంద్రాలకు పెరుగుతున్న బాధితుల తాకిడి
  • వేధిస్తున్న కిట్ల కొరత 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) రెండవ దశ కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్న సమయంలో జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించారు. కొవిడ్‌ లక్షణాలతో పరీక్షల కోసం కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షల సంఖ్య తగ్గించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో కిట్ల కొరత కారణంగా అత్యవసరమైతే తప్ప పరీక్షలు నిర్వహించని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పది రోజులుగా కొవిడ్‌ పరీక్ష కిట్ల కొరత నెలకొంది. కిట్లు సరిపడా లేకపోవడంతో అనుమానిత లక్షణాలున్న వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయలేకపోతున్నారు. జిల్లాలో రోజూ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కూడా పరీక్షలు చేయడం లేదు. నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. 


  • గత నెలలో రెండు వేలకు పైగానే టెస్టులు

గత నెలలో పాజిటివ్‌ కేసులు పెరగడంతో రోజుకు 2వేల నుంచి 3వేలకు పైగానే పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవడంతో ఉన్నతాధికారులు పరీక్షల సంఖ్య సగానికి కుదించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లాలో రోజుకు 1,700 మందికి తగ్గకుండా పరీక్షలు చేయాల్సి ఉండగా, ఆదివారం జిల్లా వ్యాప్తంగా 807 మందికి మాత్రమే పరీక్షలు చేశారు. తగ్గిన పరీక్షలు ఇదివరకు జిల్లాలో రోజూ 2వేల నుంచి 3 వేలకు పైగానే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. గతనెలలో జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో పరీక్షల సంఖ్య కూడా పెంచుతూ వచ్చారు. పది రోజుల కిందటి వరకు జిల్లా ఆసుపత్రిలో 250, ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీల్లో 200, పీహెచ్‌సీల్లో 100 వరకు పరీక్షలు చేసేవారు. అయితే ఒకవైపు పాజిటివ్‌ కేసులు పెరగడం, మరోవైపు సరిపడా కొవిడ్‌ కిట్లు సరఫరా కాకపోవడంతో అనుమానిత లక్షణాలు ఉంటేనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు డిమాండ్‌ మేరకు కిట్ల సరఫరా లేకపోవడంతో జిల్లాలో పరీక్షల సంఖ్య బాగా తగ్గించారు. జిల్లా ఆసుపత్రిలో 200, ఏరియా, సీహెచ్‌సీల్లో 100, పీహెచ్‌సీల్లో 50కి మించకుండా నిర్ధారణ పరీక్షలు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. తొలిసారిగా కరోనా వచ్చిన వారు 14 రోజుల హోం ఐసోలేషన్‌ ముగిసిన తరువాత మళ్లీ పరీక్షలు చేయించుకునేందుకు వస్తే అలాంటి వారికి పరీక్షలు చేయకుండా నిరాకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.. 


  • రోజూ ఎదురుచూపులే..


జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, ఒక పీపీయూ యూనిట్‌, ఒక ఏరియా ఆసుపత్రి, మూడు సీహెచ్‌సీలు, 22 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొవిడ్‌ ఉధృతి సమయంలో రోజుకు 3,200 వరకు పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యం ఉన్నా కిట్ల కొరత కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదు. మూడు రోజులకు ఒకసారి జిల్లాకు 10వేల కిట్లు రావాల్సి ఉండగా కొన్ని రోజులుగా కిట్ల సరఫరాలో జాప్యం జరుగుతోంది. జిల్లాకు వచ్చిన కిట్లను అన్ని పరీక్షా కేంద్రాలకు సర్దుబాటు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సరిపడా కిట్లు లేక కొవిడ్‌ అనుమానిత లక్షణాలున్న వారు కొందరు పరీక్షలు చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఏప్రిల్‌ 15న జిల్లాలో 3,123 పరీక్షలు నిర్వహించగా అదేనెల 23న 2,065 పరీక్షలు చేశారు. 24న 1,227, 25న 1,362, 26న 2,222, 27న 1,849, 28న 1,312, 29న 1,400, 30న 1,520, మే 1న 1,445, 2న 807 పరీక్షలు నిర్వహించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం సగానికి సగం పరీక్షలు తగ్గించారు. గ్రామీణ ప్రాంతాల్లో కిట్లు వచ్చిన తరువాతనే పరీక్షలు ప్రారంభిస్తుండడంతో బాధితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 


Updated Date - 2021-05-03T04:43:49+05:30 IST