స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-24T04:59:42+05:30 IST

ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు

స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలి
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో ఆర్‌.నారాయణమూర్తి

  • సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి


షాద్‌నగర్‌: ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు మెరుగైన కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను కలవడానికి మంగళవారం షాద్‌నగర్‌కు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తూ పార్లమెంటులో వెంటనే బిల్లుపెట్టాలని, అదేవిధంగా విద్యుత్‌ సంస్కరణలు రద్దు చేయాలని కోరారు. రైతులు చేసిన పోరాట ఫలితంగానే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుందన్నారు. రద్దుచేస్తూ పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే రైతులకు నమ్మకం కలుగుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచారని కొనియాడారు. కొత్తచట్టాలకు వ్యతిరేకంగానే తాను ‘రైతన్న’ అనే సినిమాను రైతుల దుర్భర పరిస్థితులను అద్దంపట్టేలా తెరకెక్కించానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అం జయ్య యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతన్న సినిమాను చూడాల్సిందిగా, పట్టణంలోని పరమేశ్వర థియేటర్‌కు ఆహ్వానించారు. వ్యవసాయ రంగంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించే ఈ సినిమాను తీశానని చెప్పారు. 


కమ్యూనిస్టులు ఏకం కావాలి 

దేశంలో ఉన్న కమ్యూనిస్టులంతా ఏకం కావాలని ఆర్‌.నారాయణమూర్తి సూచించారు. కార్మిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పినబాక ప్రభాకర్‌ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచేది ఎర్రజెండా మాత్రమేనన్నారు. కమ్యూనిస్టులు గ్రూపులుగా ఏర్పడి ఐక్యత కోల్పోవడం సముచితం కాదన్నారు. తాను తీసిన ‘రైతన్న’ సినిమాలో రైతులు ఐక్యంగా ఎలా ఉండాలో చూపించానన్నారు. అదేవిధంగా కమ్యూనిస్టులు నడుచుకోవాలని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాజావరప్రసాద్‌, సీపీఎం నాయకులు రాజు పాల్గొన్నారు.  Updated Date - 2021-11-24T04:59:42+05:30 IST