అనుమానం పెనుభూతమై..

ABN , First Publish Date - 2021-05-03T04:38:44+05:30 IST

అనుమానం పెనుభూతమై..

అనుమానం పెనుభూతమై..
మృతురాలు లక్ష్మి

  • భార్యను అతికిరాతకంగా నరికి చంపిన భర్త
  • నోట్లో గుడ్డలుకుక్కి.. కాళ్లు కట్టేసి.. కత్తితో నరికి హతమార్చిన వైనం 
  • బంట్వారం మండలం మద్వాపూర్‌లో ఘటన
  • పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు


బంట్వారం: భార్యపై అనుమానంతో ఓవ్యక్తి కత్తితో అతి కిరాతకంగా నరికి హత్య చేసిన ఘటన  బంట్వారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మద్వాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్వాపూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు, లక్ష్మి(40)లకు గత 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరు రోజువారి కూలి కోసం తాండూరులో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఆంజనేయులు భార్య తన వద్ద కాకుండా తల్లి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి ఒప్పించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. అయితే మళ్లీ ఆమె తన తల్లి ఇంటికి వెళ్లడంతో అనుమానం రావడంతో శనివారం స్వంత గ్రామమైన మద్వాపూర్‌కు వెళ్లి అక్కడే ఉందామని నమ్మించి ఇంటికి తీసుకువచ్చాడు. అదే రాత్రి 12గంటల సమయంలో తన భార్య లక్ష్మి(40) నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టివేసి కత్తితో మెడ, చేతులపై పొడిచి హత్యచేశాడు. ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి నుంచి ఆంజనేయులు నేరుగా ఉదయం 4 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన భార్యను తానే హత్య చేసునట్లు ఒప్పుకుని లొంగిపోయాడు. తన భార్యపై అనుమానంతో ఈ హత్య చేసినట్లు ఆయన వివరించాడు. దీంతో వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధారూరు సీఐ తిరుపతిరాజు, బంట్వారం ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

Updated Date - 2021-05-03T04:38:44+05:30 IST