కరోనాతో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-18T06:03:13+05:30 IST

కరోనాతో ఆరుగురి మృతి

కరోనాతో ఆరుగురి మృతి

  • వికారాబాద్‌ జిల్లాలో నలుగురు..
  • రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో  ఒక్కొక్కరి చొప్పున..
  • జిల్లాలో 385 కరోనా కేసులు


దోమ/కులకచర్ల/దౌల్తాబాద్‌/ఘట్‌కేసర్‌: జిల్లాలో కరోనా బారినపడి చికిత్సపొందుతూ సోమవారం ఆరుగురు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, మేడ్చల్‌ జిల్లాలో మరొకరు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు(35), బుద్లాపూర్‌ గోన్యనాయక్‌ తండాకు చెందిన ఓ వ్యక్తి(45), కులకచర్ల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు(60) తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దౌల్తాబాద్‌ మండలంలోని గోకఫస్లాబాద్‌కు చెందిన ఓ పూజారి(46)కి పదిరోజు క్రితం కరోనా సోకగా హోంక్వారంటైన్‌  ఉండి చికిత్స పొందుతున్నాడు. కాగా సోమవారం శ్వాససంబంధిత సమస్య ఎక్కువ కావడంతో మృతిచెందాడు.  మేడ్చల్‌ జిల్లాలోని పోచారంకు చెందిన ఓ యువకుడు(27) పదిరోజుల క్రితం కరోనాసోకి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి చేర్చారు. అక్కడ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

షాద్‌నగర్‌లో సర్పంచ్‌ మృతి 

షాద్‌నగర్‌ రూరల్‌: ఫరూఖ్‌నగర్‌ మండలం చౌడమ్మగుట్టతండా సర్పంచ్‌(35) కరోనాబారిన పడగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి పట్ల  షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాంబల్‌ నాయక్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మండల సర్పంచ్‌లు ఆయన చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పూల మాలలు వేసి  నివాళులర్పించారు. గతంలో కిషన్‌నగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చౌడమ్మగుట్టతాండ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడగా కిశోర్‌ నాయక్‌ మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. 

మహేశ్వరంలో పెరుగుతున్న మృతులు 

మహేశ్వరం: మహేశ్వరం మండలంతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉప్పుగడ్డతండా సర్పంచ్‌(62), మహిళా బ్యాంకులో  అకౌంటెంట్‌గా పనిచేసే కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, సర్ధార్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. అమీర్‌పేట గ్రామంలో ఇప్పటికే  20మంది వరకు కరోనాకాటుకు బలయ్యారు. తుక్కుగూడలో కేసులు పెరుగుతుండటంతో మంఖాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు మంత్రి సబితారెడ్డి చర్యలు తీసుకున్నారు. పాఠశాలను తుక్కుగూడ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, వైద్య సిబ్బంది పరిశీలించి ఐసోలేషన్‌కు తగిన ఏర్పాట్లను చేశారు.  

జిల్లాలో మరో 385మందికి పాజిటివ్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జిల్లాలో సోమవారం 385 కరోనా కేసులు నమోదయ్యాయి. 1325 మందికి టెస్టులు చేయగా 385 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో అత్యధికంగా అత్యధికంగా కులకచర్లలో 42 కరోనా కేసులు నమోదవగా, పరిగిలో 28, పూడూరులో 28, దౌల్తాబాద్‌లో 28, కొడంగల్‌లో 27, మర్పల్లిలో 24, ధారూరులో 21, సిద్దులూరులో 21, బంట్వారంలో 20, మోమిన్‌పేటలో 17, తాండూరులో 17, దోమలో 16, బొంరాస్‌పేట్‌లో 15, పెద్దేముల్‌లో 13, బషీరాబాద్‌లో 12, జిన్‌గుర్తిలో 11, అంగడి రాయిచూర్‌లో 11, యాలాల్‌లో 10, నవాబ్‌పేట్‌లో 9, రామయ్యగూడలో 8, కోట్‌పల్లిలో 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నవాల్గలో 16 మందికి పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్‌ వచ్చింది. నాగసమందర్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించలేదు. 

మోమిన్‌పేటలో 17మందికి.. 

మోమిన్‌పేట: మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 60మంది మండల ప్రజలకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించగా అందులో 17 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

పరిగిలో 114మందికి పాజిటివ్‌ 

పరిగి: పరిగి సబ్‌ డివిజన్‌లో 114మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 329మందికి పరీక్షలు చేయగా, 114మందికి పాజిటివ్‌ వచ్చింది. పరిగిలో 115మందిలో 28 మందికి, కులకచర్లలో 74 మందిలో 42 మందికి, దోమలో 40లో 16 మందికి, పూడూరులో 100 మందిలో 28 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

ధారూరులో 21మందికి.. 

ధారూరు: ధారూరు పీహెచ్‌సీ పరిధిలో 75 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 21మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. డికే తండా, దోర్నాల్‌, తరిగోపు, కుక్కింద, అవుసుపల్లిలో ఒక్కొక్కరి చొప్పున కుమ్మర్‌పల్లి, నాగారం, మోమిన్‌కుర్దు, ధారూరు స్టేషన్‌లో ఇద్దరి చొప్పున, తిమ్మనగర్‌లో నలుగురికి, గండీడ్‌ మండలం, వెన్నచెడ్‌ గ్రామానికి చెందిన నలుగురికి కరోనా సోకినట్లు ఆయన చెప్పారు. 

మోమిన్‌పేటలో 17మందికి..

మోమిన్‌పేట: మోమిన్‌పేట పీహెచ్‌సీలో 60మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా 17మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 

నవాబుపేటలో తొమ్మిది మందికి.. 

నవాబుపేట: నవాబుపేట పీహెచ్‌సీలో సోమవారం 34మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

 కొడంగల్‌ నియోజకవర్గంలో.. 

కొడంగల్‌/బొంరాస్‌పేట్‌/దౌల్తాబాద్‌: కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో మండలంలో తొమ్మిది, మున్సిపాలిటీలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. బొంరాస్‌పేట్‌ ప్రభుత్వాసుపత్రిలో 15, దౌల్తాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో 28 పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2021-05-18T06:03:13+05:30 IST