రాజన్న బిడ్డకు ప్రజా ఆశీర్వాదం

ABN , First Publish Date - 2021-10-21T04:51:41+05:30 IST

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల బుధవారం చేవెళ్లలో

రాజన్న బిడ్డకు ప్రజా ఆశీర్వాదం
సభకు హాజరైన జనం...అభివాదం చేస్తున్న షర్మిల

  • ప్రజాప్రస్థానం పాదయాత్రకు భారీఎత్తున తరలివచ్చిన జనం
  • నాడు తండ్రి చేపట్టిన చేవెళ్ల నుంచి బిడ్డ యాత్ర
  • దారి పొడువునా వైఎస్‌ఆర్‌ అభిమానుల నిరాజనం 
  • పార్టీ జెండాలతో నిండిపోయిన చేవెళ్ల పట్టణం
  • రాజన్న సంక్షేమ అభివృద్ధిని గుర్తుచేసిన విజయమ్మ 


చేవెళ్ల/మొయినాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌/ షాబాద్‌/ వికారాబాద్‌ : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల బుధవారం చేవెళ్లలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి రాజన్న బిడ్డను ఆశీర్వదించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజల జయజయధ్వానాల మధ్య నాడు తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ చేపట్టిన విధంగానే చేవెళ్ల గడ్డపై షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారు. అనంతరం ప్రారంభించిన పాదయాత్రలో రాజన్నబిడ్డ షర్మిల అడుగులో అడుగులు వేస్తూ అభిమానులు, పార్టీ శ్రేణులు మద్దుతు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర కొంత ఆలస్యమైంది. మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో తల్లి విజయమ్మతో కలిసి వైఎస్‌ షర్మిల సభాస్థలికి చేరుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో సభాస్థలిపై ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహం, అమరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి పాదయాత్ర విజయవంతం కావాలని దేవున్ని ప్రార్థించి మత పెద్దల దీవెనలు తీసుకున్నారు. అంతకుముందు కళాజాత బృందం ఏపురి సోమన్న ఆటపాట, ధూంధాం కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, రాజన్న సంక్షేమం, షర్మిల ఆలోచనలను పాటల రూపంలో పాడి అభిమానులు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. 

కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిమ్మలి బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో సభాస్థలికి చేరు కోవడం పలువురిని ఆకట్టుకుంది. బహిరంగసభ హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి పక్కనే నిర్వహించడంతో పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు తల్తెతకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు పార్టీ నాయకులు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. సభ స్థలిపై ప్రధానంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏపురు సోమన్న, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డేవిడ్‌ మినహా ఎవరూ మాట్లాడలేదు. 

సభ ప్రారంభంలో వైఎస్‌ విజయమ్మ ప్రజలనుద్దేశించి 15 నిమిషాలపాటు ప్రసంగించారు. అనంతరం షర్మిల 40నిమిషాలపాటు మాట్లాడారు. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష నాయకుల తీరును ఎండగడుతూ షర్మిల ప్రసంగం సాగడంతో నాయకులు, అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాజన్న మాట్లాడిన మాదిరిగానే రాజన్నబిడ్డ మాట్లాడుతుందని సభకు వచ్చినవారు చర్చించుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్‌, చేవెళ్ల మండల కన్వీనర్‌ శివారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ కో కన్వీనర్లు కోళ్ల యాదయ్య, మామిడి సంగమేశ్వర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధులు మతిన్‌, భాస్కర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రమేష్‌, భూమిరెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకులు ముస్తఫా, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ రమేష్‌, బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ఆలంపల్లి రాంకోటి, అమృతసాగర్‌, లక్ష్మారెడ్డి, రవి, శ్రీధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సురేష్‌ రెడ్డి, జశ్వంత్‌రెడ్డి, శాంతకుమార్‌, సింగిరెడ్డి, విష్ణుమోహన్‌, సత్య నారాయణ, గణేష్‌ నాయక్‌, బల్వంత్‌రెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శశికళ, మహిళా రాష్ట్ర నాయకురాలు అమృత సాగర్‌, యువజన విభాగం నాయకులు ఇందుజరెడ్డి, కోట్ల వాసుదేవ్‌, ఏనుగుల సందీప్‌రెడ్డి, శీలం శ్రీను, టోని, రాజు, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


యాత్ర సాగింది ఇలా..

చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజా ప్రస్థానం యాత్ర ప్రారంభమైంది. మొదటిరోజు బుధవారం మధ్యా హ్నం 2.20 నిమిషాలకు వైఎస్‌ షర్మిల శంఖం ఊది తన పాద యాత్రను ప్రారంభించారు. వేదిక నుంచి రెండు కిలోమీటర్లు నడిచిన తరువాత చేవెళ్ల పట్టణంలోని షాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కందవాడ గ్రామ రెవెన్యూపరిధిలో మధ్యాహ్న భోజనం కోసం పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. అనంతరం సాయం త్రం 5 గంటల మళ్లీ పాదయాత్ర కొనసాగించి కందవాడలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.. అక్కడ నుంచి మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి శివారు వరకు యాత్ర కొనసాగింది. అక్కడే రాత్రి బస నిర్వహించారు. గురువారం నక్కలపల్లి నుంచి మొయినాబాద్‌ మండలం వెంకటాపూర్‌ వరకు యాత్ర కొనసాగనుంది. మొత్తంగా మొదటిరోజు యాత్ర 9కిలోమీటర్లు సాగింది.


కేసీఆర్‌ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది  

- వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి

సీఎం కేసీఆర్‌ మొద్దునిద్రలో ఉన్నారని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫాం హౌస్‌ వదిలి బయటకు రావడం లేదని, ఆయనను నిద్ర లేపడం కోసం షర్మిల పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలోనే పేదలకు సంక్షేమపథకాలు అందాయన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టారన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన చేవెళ్ల నుంచి ప్రారంభించారని, ఈరోజు వైఎస్‌ షర్మిల కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేపట్టారన్నారు. 


షర్మిలమ్మతోనే సామాజిక తెలంగాణ :  ఏపూరి సోమన్న, రాష్ట్ర నాయకులు 

షర్మిలతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని పార్టీ రాష్ట్రనాయకులు ఏపూరి సోమన్న తెలిపారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు కష్టాలపాలయ్యారని, వాటిని తీర్చేందుకే షర్మిలమ్మ పాదయాత్ర చేపట్టారన్నారు. నిరుద్యోగులు లేని తెలంగాణ సాధించడమే పార్టీ లక్ష్యమన్నారు. 


ప్రజలకు టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు : దయానంద్‌(డేవిడ్‌), చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి 

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి దయానంద్‌ (డేవిడ్‌) అన్నారు. రాజన్న రాజ్యం కోసం ఈ పోరాటం సాగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం నింపడం కోసం గ్రామగ్రామానికి ఈ పాదయాత్ర వస్తుందని తెలిపారు. 



Updated Date - 2021-10-21T04:51:41+05:30 IST