శభాష్‌..రాజేష్‌!

ABN , First Publish Date - 2021-05-21T04:29:39+05:30 IST

వైద్యో నారాయణో హరి అనేది ఆర్యోక్తి. వైద్యుడు భగవంతునితో సమానం

శభాష్‌..రాజేష్‌!
టిమ్స్‌లో వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌ రాజేష్‌

  • డాక్టర్‌ నవదంపతులకు  కలెక్టర్‌ ప్రశంసలు
  • టిమ్స్‌లో కరోనా పేషంట్లకు  నిరంతర సేవలు
  • ఆసుపత్రిలోనే నివాసం 
  • వైద్య వృత్తిపై అంకితభావం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : వైద్యో నారాయణో హరి.. అనేది ఆర్యోక్తి. వైద్యుడు భగవంతునితో సమానం అనేది దీనర్ధం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో వైద్య సేవలందించడం ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది. ఈ సమయంలో మహమ్మారి కాటుకు గురైన వారికి చికిత్స అందించే వైద్యసిబ్బంది సేవలు అసమానం. వైద్యులే ముందుండి కరోనా వైరస్‌పై పోరాడుతున్నారు.  ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ కష్టకాలంలో  తమ జీవితాలను పణంగా పెట్టి వైద్యసేవలందిస్తున్నారు. రోగులను కాపాడేందుకు కొందరు వైద్యులు రాత్రి అనక పగలనక శ్రమిస్తున్నారు. ఇలాగే ఓ నవ వైద్య దంపతులు సర్కార్‌ ఆసుపత్రిలోనే నివసిస్తూ కరోనా రోగులకు అహర్నిశలు సేవలందిస్తూ జిల్లా కలెక్టర్‌తో ప్రశంసలు పొందారు.  తమ వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో నిరంతరం కరోనా పేషంట్లకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్‌ దంపతులు అందరిచేత మన్ననలను పొందుతున్నారు.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల కోసం గచ్చిబౌలిలో ప్రత్యేక ఆసుపత్రి ‘టిమ్స్‌’ (తెలంగాణ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే కరోనా పేషెంట్లకు ఇక్కడ ఉచితంగానే ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇక్కడకు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే అధికంగా చికిత్సకోసం వస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో గాంధీ ఇతర ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని ఇక్కడకు బదిలీ చేశారు. ఇలాగే గాంధీలో కాంట్రాక్టు పోస్టులో పనిచేస్తున్న డాక్టర్‌ పి.రాజేష్‌ను గత ఏడాది టిమ్స్‌కు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయన పనితీరుకు మెచ్చి ఆర్‌ఎంఓగా నియమించారు. ఆయనకు ఇటీవలే డిసెంబర్‌లో అపర్ణ అనే డాక్టర్‌ను వివాహమాడారు. ఆమె కూడా ఇక్కడే పీజీ డాక్టర్‌గా గౌరవ వేతనంపై పనిచేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఈ దంపతులు ఆసుపత్రి 13వ అంతస్థులో ఉంటూ టిమ్స్‌లో వైద్య సేవలందిస్తున్నారు. రోజంతా ఇక్కడకు వచ్చే రోగులకు వైద్యసేవలందిస్తూ  తమ వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు  వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్నారు. వరంగల్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన రాజేష్‌ వాస్తవానికి మెడిసిన్‌ పూర్తిచేసినప్పటికీ సివిల్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన రెండో సారి సివిల్స్‌ రాసేందుకు ప్రయత్నాల్లో ఉండగా కరోనా ఉధృతి పెరగడంతో సివిల్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఖాళీగా ఉండే బదులు సర్వీస్‌ చేద్దామనే ఉద్దేశంతో కాంట్రాక్టు పద్ధతిపై గాంధీలో డాక్టర్‌గా జాయిన్‌ అయినట్లు తెలిపారు. అక్కడ నుంచి ప్రభుత్వం టిమ్స్‌కు బదిలీ చేయడంతో ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. 


కలెక్టర్‌ ప్రశంసలు

జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు రాత్రి 11గంటలకు టిమ్స్‌లో బెడ్‌ కావాలంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. వెంటనే ఆయన టిమ్స్‌లో పనిచేసే డాక్టర్‌ రాజేష్‌కు ఫోన్‌ చేశారు. ఆయన వెంటనే బెడ్‌ ఏర్పాటు చేయించారు. అదే రాత్రి 2గంటల సమయంలో మరో ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆక్సిజన్‌ అందడం లేదని సహాయం చేయాలని మరో రోగి ఫోన్‌ చేశారు. వెంటనే కలెక్టర్‌ టిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్న రాజేష్‌కు ఫోన్‌ చేయగా అప్పటికప్పుడే బెడ్‌ సిద్ధం చేసి అతనికి  వైద్యసేవలందించారు. రాజేష్‌ పనితీరు స్వయంగా చూసిన కలెక్టర్‌ రాజేష్‌ గురించి ఆరా తీశారు. ఆయన భార్య అపర్ణ కూడా ఇక్కడే డాక్టర్‌గా సేవలందిస్తున్నారని, ఆసుపత్రిలోనే 13వ అంతస్థులో  నివాసం ఉంటున్నారని తెలుసుకుని వారిద్దరినీ అభినందించారు. అంతేకాదు ఈనెల 18వ తేదీన డాక్టర్‌ రాజేష్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని కలెక్టర్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.



Updated Date - 2021-05-21T04:29:39+05:30 IST