ఏడోరోజు..

ABN , First Publish Date - 2021-05-19T05:00:29+05:30 IST

ఏడోరోజు..

ఏడోరోజు..
వికారాబాద్‌లో డ్రోన్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ నారాయణ

  • వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు
  • నిర్మానుష్యంగా రహదారులు
  • పరిశీలించిన ఎస్పీ నారాయణ

పరిగి/కులకచర్ల: లాక్‌డౌన్‌ ఏడో రోజు మంగళవారం సంపూర్ణంగా కొనసాగింది.పరిగి పట్టణం, గ్రామాల్లో  సంపూర్ణంగా బంద్‌ పాటించడంతో నిర్మానుష్యాన్ని అవరించింది. ఏ ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు.  ఉదయం 10 గంటల నుంచి రాత్రి ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు.  పరిగి పట్టణంలో లాక్‌డౌన్‌ను ఎమ్మెల్యే మహేరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రశీదులు పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ గురించి పరిగి సీఐ లక్ష్మీరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కులకచర్లలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీ్‌సలు ఉదయం 10 గంటలకే దుకాణాలు మూయిస్తున్నారు.  అనవసరంగా రోడ్లపై తిరిగేవారికి జరిమానాలు విధిస్తున్నారు.

డ్రోన్‌ నిఘాలో వికారాబాద్‌ పట్టణం

వికారాబాద్‌ : లాక్‌ డౌన్‌లో భాగంగా వికారాబాద్‌ ఇక ముందు డ్రోన్‌ నిఘాలో ఉంటుందని ఎస్పీ నారాయణ తెలిపారు. మంగళవారం బీజేఆర్‌ చౌరస్తాలో డ్రోన్‌ను ఆయన ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. లాక్‌ డౌన్‌ నిబంధనల ప్రకారం ప్రజలు ఇండ్లలోనే ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, డీఎస్పీ సంజీవరావు, సీఐ రాజశేఖర్‌, మహిళా సీఐ ప్రమీల, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 అనవసరంగా బయటకు రావొద్దు

ధారూరు: లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్ల పైకి రాకూడదని ఎస్పీ నారాయణ సూచించారు. ధారూరు అంబేద్కర్‌ చౌరస్తాలో మంగళవారం ఆయన లాక్‌డౌన్‌ను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉల్లఘించిన వారి పై  దాదాపు 600 వరకు కేసులు నమోదు చేశామని, వాహనాలను సీజ్‌ చేస్తున్నామన్నారు. 68 దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వారాంతపు సంతల్లో కూరగాయల దుకాణాలను దూరదూరంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అదేశించారు. ఎస్పీవెంట డీఎస్పీ సంజీవరావు, సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ సురేష్‌  తదితరులు ఉన్నారు. 

నిబంధనలు ఉల్లంఘిస్తే  కేసులు

తాండూరు రూరల్‌ : తాండూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో అనవసరంగా ఎవరైనా బయట తిరిగితే డ్రోన్‌ కెమెరా ఆధారంగా వారి వివరాలను పరిశీలించి కేసులు నమోదు చేస్తామని తాండూరు రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామంలో లాక్‌డౌన్‌ను ఎస్‌ఐ ఏడుకొండలుతో కలిసి పరిశీలించారు.  మల్కాపూర్‌, కొత్లాపూర్‌, కరన్‌కోట్‌, చంద్రవంచ, బెల్కటూర్‌, జినుగుర్తి, గోనూరు, నారాయణపూర్‌, సంగెంకలాన్‌ తదితర గ్రామాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు డ్రోన్‌ కెమెరాల సహాయంతో పరిశీలిస్తున్నామన్నారు.

 మేడ్చల్‌ జిల్లాలో...

మేడ్చల్‌/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌ : లాక్‌డౌన్‌ ఏడో రోజు మేడ్చల్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం దుకాణాల వద్ద పెద్దఎత్తున రద్దీ ఏర్పడింది. ఈ సందర్భంగా మార్కెట్‌ రోడ్డు కిక్కిరిసి పోయింది. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మేడ్చల్‌ జాతీయ రహదారి బోసిపోయి కన్పించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ ఘట్‌కేసర్‌లో సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 6గంటల నుంచి 10 వరకు సడలింపు ఉండటంతో నిత్యావసర వస్తువుల కొనుగొళ్ల కోసం జనాలు పెద్ద ఎత్తున రోడ్లమీదికి వచ్చారు.  కాగా పాత జాతీయ రహదారితోపాటు ఏదులాబాద్‌ రోడ్డు, రైల్వేస్టేషన్‌ రోడ్డు జన సంచారం లేక బోసిపోయాయి.

Updated Date - 2021-05-19T05:00:29+05:30 IST