బడులు షురూ!
ABN , First Publish Date - 2021-02-02T05:25:23+05:30 IST
సుధీర్ఘ విరామం తర్వాత బడులు తెరుచుకున్నాయి. మొదటిరోజు పాఠశాలలు

- 11 నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు
- 9,10 తరగతులకు మొదలైన ప్రత్యక్ష బోధన
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ
- బెంచ్‌కు ఒకరిద్దరు విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : సుధీర్ఘ విరామం తర్వాత బడులు తెరుచుకున్నాయి. మొదటిరోజు పాఠశాలలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో సందడిగా మారాయి. రంగారెడ్డి జిల్లాలో కొవిడ్ నిబంధలనకు అనుగుణంగా తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు చేరుకున్నారు. బడులకు హాజరైన విద్యార్థులను థర్మల్‌స్ర్కీనింగ్ చేశాకే లోపలికి అనుమతించారు. మాస్కులు లేని విద్యార్థులకు మాస్కులను అందించారు. విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. 9, 10వ తరగతి విద్యార్థులను ఒక్కో బెంచ్‌కు ఒకరిద్దరు కూర్చునెలా రోల్‌నెంబర్ వేశారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, లోకల్‌బాడీ, మోడల్, కేజీబీవీ, టీఆర్‌ఈఐఎస్, ప్రైవేట్ పాఠశాలలు కలుపుకుని 1058 ఉన్నాయి. 101009 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 61,710 మంది విద్యార్థులు హాజరయ్యారు. 61.094 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ కలిపి మొత్తం 269 కళాశాలలు ఉన్నాయి. అందులో మొదటి సంవత్సరంలో 52,831 మంది విద్యార్థులు ఉండగా మొదటి రోజు 39.4 శాతం కళాశాలకు హాజరయ్యారు.
విద్యార్థులను బయటకు పంపించి శానిటైజ్..
రంగారెడ్డి జిల్లా మొయుయినాబాద్ మండలం అజీజ్‌నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చున్నారు. పాఠాలు బోధించేందుకు టీచర్లు సిద్ధమయ్యారు. తీరిగ్గా కార్మికులు వచ్చారు. పిల్లలను బయటకు పంపించి గదులను శానిటైజ్ చేశారు.
మధ్యాహ్న భోజనం బంద్..!
చేవెళ్లలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని వండలేదు. భోజన కార్మికులు తమకు గిట్టుబాటు కావడం లేదని... ఉద్యోగానికి రాజీనామా చేయడంతో వంటచేసే వారు కరువయ్యారు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకుని భోజనం చేశారు.
ఒక్క విద్యార్థి కూడా రాలేదు..
కందుకూరు: కందుకూరులోని కేజీబీవీ పాఠశా లకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. 9,10 తరగ తుల్లో 90మంది.. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో 143 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా రాలేదు. పాఠశాలఇన్‌చార్జి భార్గవి విద్యార్థుల తల్లిదం డ్రులకు ఫోన్‌చేసి విద్యార్థులను పంపించాలని కోరారు.
6కిలోమీటర్లు నడిచి..
కడ్తాల్ : కడ్తాల మండలం పల్లె చెలుక తండాకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు బస్సులు లేక ఇబ్బందులుపడ్డారు. పల్లెచెలుక తండా నుంచి చరికొండ ఉన్నత పాఠశాలకు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ఇప్పటికైనా బస్సులు నడిపి ఇబ్బందులు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
ఆంధ్రజ్యోతి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 179 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్ పాఠశాలలు, 18 కేజీబీవీ, 9 మోడల్, 2 టీఆర్‌ఈఐఎస్ గురుకుల పాఠశాలలు, 69 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలల్లో 27,248 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో తొలిరోజు 9,272 మంది విద్యార్థులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 16,143 మంది విద్యార్థులకు 6,023 మంది విద్యార్థులు హాజరయ్యారు. మోడల్ స్కూళ్లలో 2938 మందికి 786 మంది విద్యార్థులు హాజరు కాగా, కేజీబీవీల్లో 2550 మంది విద్యార్థినులకు కేవలం 82 మంది మాత్రమే వచ్చారు. టీఆర్‌ఈఐఎస్ విద్యాలయాల్లో 627 మంది విద్యార్థులకు 19 మంది హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలల్లో 4,990 మంది విద్యార్థులకు 2,362 మంది వచ్చారు.
జిల్లా కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ పౌసుమిబసు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధారూరు, పెద్దేముల్ ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. అయితే స్కావెంజర్లు లేక మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలిసి శుభ్రం చే శారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో..
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మేడ్చల్‌మల్కాజ్‌గిరిజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొదటిరోజు 52.82శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం జిల్లాలో 36215మంది విద్యార్థులకు గానూ 19131 మంది వరకు పాఠశాలలకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు 104 ఉన్నాయి. మొత్తం 9వ తరగతి విద్యార్థులు 8137 మందికి గానూ 3188 మంది హాజరయ్యారు.7854మందికి గానూ 4221 మంది హాజరయ్యారు. మొత్తం 796 ప్రైవేట్ పాఠశాలలుఉన్నాయి. వీరిలో 9వ తరగతిలో 10106 మంది విద్యార్థులు గానూ 4925మంది, పదో తరగతి 9953 మందికి 6732మంది హాజరయ్యారు. గురుకులాల్లో 165మందికి గానూ 65 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంటర్మీడియేట్ ప్రభుత్వ కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 55శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 1646మంది విద్యార్థులకుగానూ 920మంది హాజరయ్యారు. ప్రైవేట్ కళాశాలల్లోనూ 55శాతం వరకు హాజరయ్యారు. 8పాఠశాలలను డీఈవో విజయకుమారి పర్యవేక్షించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా 17వేల మంది విద్యార్థులకు ఉచితంగా మాస్కులు, సబ్బులను డీఈవో పంపిణీ చేయించారు. అదేవిధంగా ప్రతీ పాఠశాలలో థర్మల్ స్కానర్లు, శానిటైజర్, స్టాండ్లను ఏర్పాటు చేశారు.