సద్దుల బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2021-10-15T05:14:50+05:30 IST

సద్దుల బతుకమ్మ సంబురాలు

సద్దుల బతుకమ్మ సంబురాలు
కడ్తాలలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

  • ఆడిపాడిన మహిళలు, యువతులు 
  • చెరువుల్లో బతుకమ్మల నిమజ్జనం


ఆమనగల్లు/కడ్తాల్‌/ఇబ్రహీంపట్నం/యాచారం/కందుకూరు/షాద్‌నగర్‌అర్బన్‌/చేవెళ్ల/షాబాద్‌: ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని వివిద గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు వివిధ పూలతో బతుకమ్మలను పేర్చి హనుమాన్‌ దేవాలయం వద్దకు చేరుకున్నారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఆలయం వద్ద మున్సిపల్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బ్యాండ్‌ వాయిద్యాల నడుమ ర్యాలీగా వెళ్లి సురసముద్రం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అదేవిదంగా కడ్తాల మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం టౌన్‌ సహా మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడి అనంతరం అయ్యప్ప దేవాలయం వద్ద  ఏర్పాటు చేసిన నీటి తొట్లలో నిమజ్జనం చేశారు. శేరిగూడ, ఉప్పరిగూడలలో బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.  యాచారం, కందుకూరు మండలాల్లో  సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామ్రగామానా మహిళలు బతుకమ్మలను అలంకరించి ఆడిపాడి సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. సద్దుల బతుకమ్మ ఉత్సవాలు సంబురంగా జరిగాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని వార్డుల్లో పోటాపోటీగా బతుకమ్మలను అలంకరించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీర్లపల్లి శంకర్‌, కడెంపల్లి శ్రీనివా్‌సగౌడ్‌ నాయకులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ దుర్గామత మండపం వద్ద మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామివారి పుష్కరిణిలో బతుకమ్మలు నిమజ్జనం చేశారు. అదేవిధంగా మల్కాపూర్‌, పామెన, ఆలూర్‌, ఈర్లపల్లి, బస్తేపూర్‌, మీర్జగూడ, ఆలూర్‌, రావులపల్లి, కౌకుంట్ల, అంతారం, దామరిగిద్ద, తదితర గ్రామాల్లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం గ్రామాల్లోని కుంటలు, చెరువులు, చెక్‌డ్యాంలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలంలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. అనంతరం షాబాద్‌లో గల పహిల్వాన్‌ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T05:14:50+05:30 IST