స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్న భూమికి రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-05-19T04:52:05+05:30 IST

కోర్టు పరిధిలో వివాదంగా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తారేమో

స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్న భూమికి రిజిస్ట్రేషన్‌

  • కేశంపేట జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ నిర్వాకం

కేశంపేట: కోర్టు పరిధిలో వివాదంగా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తారేమో అన్న భయంతో పిటి షనర్‌ స్టేటస్‌ కోఆర్డర్‌ (యథావిధి స్థితి) తెచ్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. స్టేటస్‌ కోఆర్డర్‌ను బేఖా తరు చేస్తూ... కేశంపేట జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ సదరు భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కేశంపేట మండ లం ఇప్పలపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 140పై షాద్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టులో ఒరిజినల్‌ సూట్‌ నెంబర్‌ 120 ఆఫ్‌ 2019గా కేసు నడుస్తుంది. కోనేరు కృష్ణవేణి ఆస్తిలో సమాన వాటా కోసం కోర్టులో దావా వేసింది. తనకు గాని కోర్టుకు గాని సమాచారం ఇవ్వకుండ ఇతరులకు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయొద్దని జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారు. అయితే కేశంపేట తహసిల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్టార్‌ మురళీకృష్ణ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈనెల 7న 140 సర్వే నెంబర్‌లో చౌలపల్లి నరేష్‌, ఎకరాలు-1-20, పిప్పళ్ల రమ్యకృష్ణ ఎకరాలు 0-20 మొత్తం 2 ఎకరాలను సాహితి కన్‌స్ట్రక్షన్స్‌ కు డాక్యూమెంట్‌ నెంబర్లు 1326ఆఫ్‌2021, 1327ఆఫ్‌ 2021లతో రిజిస్ట్రేషన్‌  చేశారు. ఈ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను సదరు కొనుగోలు దారులకు ఇవ్వకుండా జాయింట్‌ సబ్‌రిజిస్ర్టార్‌ వద్దనే ఉంచుకున్నట్లు వినికిడి. అయితే ఇందులో పిప్పళ్ల రమ్యకృష్ణ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకంలో అసైన్డ్‌పట్టా అని ఉన్నా జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ పూర్వాపరాలు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్‌ విషయంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు గుస గుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ మురళీకృష్ణను సంప్రదించగా... పిటిషనర్‌ స్టేటస్‌ కో ఆర్డర్‌ కాపీ తీసుకురాకముందే సదరు భూమిని కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన్‌ చేశాను. కోర్టు ఆర్డర్‌ ఉంటే మీసేవ ద్వార కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోవాలి. వారు అలా చేయలేదు, రమ్యకృష్ణకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకంలో అసైన్డ్‌ పట్టా అని తప్పుగా నమోదైంది. స్టాట్‌ బుక్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ చేశాను. అసైన్డ్‌ పట్టా భూముల వివరాలు నిషేధిత జాబితాలో ఉంటాయి.

Updated Date - 2021-05-19T04:52:05+05:30 IST