ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-26T04:58:41+05:30 IST

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి
కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ నిఖిల

  • వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కె.నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేసినందున ఈ పరిస్థితుల్లో వరి పండించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. క్లస్టర్‌ వారీగా రైతుల జాబితా సిద్ధం చేసి రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అవసరమైన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా విత్తన డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె అదనపు కలెక్టర్లను ఆదేశించారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు రైతు వేదికల్లో రైతులకు పంటమార్పిళ్లపై ఏఈవోలు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో మినుము పంట ఎంత పండించినా కొనుగోలు చేసేందుకు నాఫెల్‌ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. రైతులు వరి పంట పండించి ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో దండోరా వేయించి వారిని చైతన్యపరచాలని ఆమె సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఏవో గోపాల్‌, డీహెచ్‌ఎస్‌వో  డాక్టర్‌ చక్రపాణి, తాండూరు ఏఆర్‌ఎస్‌ అధిపతి డాక్టర్‌ సుధాకర్‌, శాస్త్రవేత్తలు ప్రవీణ్‌కుమార్‌, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.  

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

 పోడు భూముల్లో సాగు చేస్తున్న గిరిజనులను గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అటవీ, రెవెన్యూ అఽధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో పోడు భూముల్లో గిరిజనుల సాగుపై రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అటవీ భూముల్లో 2005 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్న ఎస్టీ, ఎస్సీలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఎఫ్‌వో వేణుమాధవరావు, వికారాబాద్‌, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, డీటీడబ్ల్యువో కోటాజీ పాల్గొన్నారు. 

గంజాయి సాగు చేస్తే.. రైతుబంధు, బీమా, ఫించన్లు కట్‌.. 

 జిల్లాలో రైతులు ఎవరైనా తమ పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఫించన్లను నిలిపివేయాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి ఆమె తన ఛాంబర్‌లో గుడంబా తయారీ, గంజాయి సాగు, నిర్మూలనపై ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 166 మంది గుడంబా తయారీ, విక్రయదారులకు పునరావాసం కల్పించారని, అయితే వారు మళ్లీ ఇదే వృత్తిలో కొనసాగితే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

శ్మశానవాటిక పేరుతో పొలం కబ్జాపై ఫిర్యాదు

 శ్మశానవాటిక పేరుతో తమ పొలాన్ని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నవాబుపేట మండలం, గంగ్యాడ గ్రామానికి చెందిన జంగారెడ్డి, పర్మారెడ్డిలు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సర్వే నెంబర్‌ 267లో తమ పొలం చివరన కొంతభాగాన్ని శ్మశానవాటికగా ఉపయోగిస్తూ వచ్చారని, దీనికి తాము ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదని తెలిపారు. కాగా గ్రామంలో వైకుంఠధామం నిర్మించిన తరువాత గ్రామానికి చెందిన కొందరు తమపొలాన్ని పూర్తిగా ఆక్రమించి కడీలతో తీగ చుట్టారని, అడ్డుకున్న తమపైన వారు రాళ్లతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో శ్మశానవాటిక నిర్మించిన తరువాత కూడా తమపొలాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో గ్రామానికి చెందిన వారు కొందరు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని వాపోయారు. తమపొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించిన వారితో ప్రాణభయం ఉందని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు కోరారు.

Updated Date - 2021-10-26T04:58:41+05:30 IST