ప్రభుత్వాసుపత్రిలో నిండు గర్భిణీ మృతి

ABN , First Publish Date - 2021-08-26T05:26:25+05:30 IST

ప్రభుత్వాసుపత్రిలో నిండు గర్భిణీ మృతి

ప్రభుత్వాసుపత్రిలో నిండు గర్భిణీ మృతి
మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబసభ్యులు

తాండూరు: ప్రసూతి కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నిండు గర్భిణీ, కడుపులో బిడ్డ మృతిచెందారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన శ్రీలత రెండో కాన్పు నిమిత్తం తన పుట్టినూరు యాలాల మండలం ముకుందాపూర్‌కు వచ్చింది. ఈనెల 22న తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి కోసం రాగా, ప్రసూతికి ఇంకా సమయం ఉందని ఆసుపత్రి సిబ్బంది చెప్పి పంపించారు. మంగళవారం రాత్రి శ్రీలతకు పురుటి నొప్పులు రావడంతో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో ఉన్న నర్సులు శ్రీలతను పరీక్షించారు. పురుటినొప్పులతో బాధపడుతున్న శ్రీలత ప్రసవం కాకుండానే మృతిచెందింది. మృతురాలి కడుపులో ఉన్న పసికందును ఆపరేషన్‌ చేసి తీయగా, పసికందు కూడా మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది కుటుంబీకులకు తెలిపారు. మృతురాలికి ఫిట్స్‌ రావడంతోనే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శ్రీలతకు గతంలో ఎప్పుడూ ఫిట్స్‌ రాలేదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని కుటుంబీకులు తెలిపారు.  వెంటనే సిజేరియన్‌ చేసి ఉంటే శ్రీలత బతికేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతురాలికి భర్త, ఏడాదిన్నర కూతురు వైష్ణవి ఉన్నారు. దౌల్తాబాద్‌లో అంత్యక్రియలు చేశారు. 

Updated Date - 2021-08-26T05:26:25+05:30 IST