నాలాలు కబ్జా

ABN , First Publish Date - 2021-10-30T04:21:27+05:30 IST

నాలాలు కబ్జా

నాలాలు కబ్జా
సిరిగిరిపురం, గంగారం మీదుగా మంఖాల్‌ చెరువులోకి వెళ్లే వాగును కబ్జాచేస్తున్న రియల్టర్లు

  • పట్టించుకోని అధికారులు

మహేశ్వరం : మండలంలోని ఐదు ఇరిగేషన్‌ చెరువుల్లో ఒకటైన భాగ్‌ మంఖాల్‌ ప్రధాన చెరువులోకి నీరువచ్చే ప్రధాన కాల్వపై సార్క్‌ గ్రీన్‌స్పే్‌స అనే రియల్‌ఎస్టేట్‌ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటుచేసి నాలాను కబ్జా చేసిందని సిరిగిరిపురం రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆ గ్రామ సర్పంచ్‌కు, మహేశ్వరం తహసీల్దార్‌కు ఫిర్యాదు కూడా చేశారు. నాలాపై అక్రమ వెంచర్‌తో భవిష్యత్తులో భాగ్‌ మంఖాల్‌ చెరువు నీరులేక అంతరించిపోయే ప్రమాదం ఉందని తద్వారా సిరిగిరిపురం, మంఖాల్‌, గంగారం, మైలార్‌బాయితండా, గంగారం తండాలోని వ్యవసాయ పొలాలు వట్టిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, కొత్వాల్‌ చెరువు నిండిన తర్వాత వచ్చే అలుగు, చౌటకుంట నుంచి వచ్చే అలుగు రెండూ కలిసి సిరిగిరిపురం సర్వేనెంబర్‌ 170, 171, 172, 173, 174, 175 లోని వ్యవసాయ భూముల్లో ఉన్న నాలా ద్వారా భాగ్‌ మంఖాల్‌ ఇరిగేషన్‌ చెరువులోకి చేరుతాయి. ఆతర్వాత మంఖాల్‌ చెరువు అలుగుపారితే మహేశ్వరం నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన రావిరాల పెద్ద చెరువులోకి  నీరు వెళుతుంది. కానీ, ఇరిగేషన్‌ చెరువులకు నీరు చేరకుండా నాలాలు కబ్జా చేస్తున్న వెంచర్ల యజమానులు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు సిరిగిరిపురం సర్పంచ్‌ సురే్‌షతోపాటు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నిజాం కాలంనాటి గొలుసు చెరువులు, కుంటల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి పూడికలు తీస్తుంటే, ఇరిగేషన్‌ అధికారులు వెంచర్‌ యజమానులకు అమ్ముడుపోయారని, చెరువుల్లోకి నీరుచేరే ప్రధాన నాలాలు, ఫీడర్‌ చానళ్లు కబ్జాకు గురవుతున్నా ఎందుకు స్పందించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేనిదే ఇరిగేషన్‌ చెరువులు కబ్జాలకు గురవుతున్నాయా అని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిరిగిరిపురం, గంగారం గ్రామాలమీదుగా వెళ్లే వాగు కబ్జాను కాపాడాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-30T04:21:27+05:30 IST