నంబర్ 1
ABN , First Publish Date - 2021-11-06T05:10:15+05:30 IST
నంబర్ 1

- చిన్న ఆసుపత్రుల విభాగంలో దేశంలోనే టాప్
- నీతిఆయోగ్ అధ్యయనంలో వెల్లడి
- పేద ప్రజలు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం జిల్లాలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసింది. అయితే డయాగ్నస్టిక్ సేవల్లో వికారాబాద్ డయాగ్నస్టిక్ సెంటర్ చిన్న ఆసుపత్రుల విభాగంలో దేశంలోనే అత్యుత్తమ గుర్తింపు పొందింది. రోగ నిర్ధారణ పరీక్షలు, ఉత్తమ ఆరోగ్య సేవల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి) డయాగ్నస్టిక్ సేవల్లో చిన్న ఆసుపత్రుల విభాగంలో వికారాబాద్ జిల్లా ఆసుపత్రి తొలిస్థానంలో నిలిచింది. దేశంలోని జిల్లా ఆసుపత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థల భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన ఫలితాల్లో జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్ చిన్న ఆసుపత్రుల విభాగంలో దేశంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. వికారాబాద్ జిల్లా ఆసుపత్రి తాండూరులో కొనసాగుతుండగా, డయాగ్నస్టిక్ కేంద్రం వికారాబాద్‌లో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా ఆసుపత్రిలో అవసరమైన సేవలు అందించడంలో టీ హబ్ కీలకపాత్ర పోషిస్తోందని, తద్వారా రోగుల ఖర్చులు తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. నేషనల్ హెల్త్ మిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో టీ-డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేశారు. పేద ప్రజలు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసింది. జిల్లాకు మంజూరైన డయాగ్నస్టిక్ హబ్‌ను వికారాబాద్‌లోని ఏరియాఆసుపత్రిలో ఏర్పాటు చేయగా, గత జూన్‌లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ హబ్‌కు జిల్లాలోని 24 డీహెచ్, ఏహెచ్, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన 8 పీహెచ్‌సీలు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పీహెచ్‌సీలను అనుసంధానించారు. డ్రైరన్ ప్రారంభించిన గత జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు మొత్తం 20 కేంద్రాల నుంచి నమూనాలు సేకరించగా, గతనెల 11 నుంచి 30 కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి విశ్లేషణల కోసం పంపిస్తున్నారు. ఇంత వరకు నమూనాలు సేకరించేందుకు అందుబాటులో ఉన్న వాహనాలు ఉపయోగించగా, ఇప్పుడు కొత్తగా ఆరు వాహనాలను ఏర్పాటు చేశారు. డీ-హబ్‌కు కేటాయించిన ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను ఆరు రూట్లుగా విభజించి నమూనాలు సేకరిస్తున్నారు.
రికార్డు స్థాయిలో విశ్లేషణా పరీక్షలు
24 గంటల పాటు పనిచేసే ఈ డయాగ్నస్టిక్ హబ్‌లో 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం 44 రకాల పరీక్షలు చేస్తున్నారు. రోజూ 30 కేంద్రాల నుంచి వచ్చే నమూనాలను ఈ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షించి 24 గంటల్లోగా ఆ పరీక్షల ఫలితాలు సంబంధిత వ్యక్తులకు మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. జిల్లాలో బంట్వారం, బషీరాబాద్, బొంరా్‌సపేట్, చెన్‌గోముల్, చిట్యాల, ధారూరు, దోమ, కొడంగల్, కోట్‌పల్లి, కులకచర్ల, మర్పల్లి, మోమిన్‌పేట్, నాగసమందర్, నవాల్గ, నవాబ్‌పేట్, పరిగి, పెద్దేముల్, పూడూరు, రామయ్యగూడ, సిద్దులూరు, యాలాల, తాండూరు పీపీ యూనిట్, తాండూరు డీహెచ్, యాలాల్, వికారాబాద్, జిన్‌గుర్తి, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, శంకర్‌పల్లి. చందన్‌వల్లి, కొందుర్గు, మొయినాబాద్, షాబాద్, టంగటూర్ పీహెచ్‌సీల నుంచి రోగుల రక్త, మూత్ర నమూనాలు సేకరిస్తుండగా, సంగారెడ్డి జిల్లాలోని మల్‌చెల్మా పీహెచ్‌సీ నుంచి నమూనాల సేకరణ ఇంకా ప్రారంభించలేదు. కాగా, జిల్లాలోని దౌల్తాబాద్, అంగడి రాయచూర్ పీహెచ్‌సీల నుంచి సేకరించే నమూనాలను నారాయణపేట్‌లోని డయాగ్నస్టిక్ హబ్‌కు పంపిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఒక్కో రూట్‌లో ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ద్వారా డీ- హబ్‌కు చేరుస్తున్నారు. వచ్చిన నమూనాలను ఏరోజుకారోజు విశ్లేషించి పరీక్షల ఫలితాలను సంబంధిత రోగుల మొబైల్ ఫోన్లకు, పీహెచ్‌సీలకు పంపిస్తున్నారు.
పేదలకు ఎంతో ప్రయోజనం
డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటుతో పేదలకు ఆర్థిక భారం తప్పింది. సాధారణ రక్త, మూత్ర పరీక్షల నుంచి వివిధ రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇంత వరకు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించేవారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం పేదలకు ఆర్థికంగా భారంగా మారేది. రోగ నిర్ధారణ పరీక్షల కోసం వందల నుంచి వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈ హబ్‌లో డయాబెటిక్, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్స్, లివర్, రెనల్ ఫంక్షన్ టెస్టులు, సీబీపీ, పథాలజీ, మైక్రోబయాలజీ టెస్టులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. పేదలకు ఉత్తమ సేవలందిస్తున్న జిల్లా డయాగ్నస్టిక్ హబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
టీ డయాగ్నస్టిక్ హబ్‌లో చేసిన పరీక్షలు
జూన్ 1 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు
రోగుల సంఖ్య 7,149
సేకరించిన నమూనాలు 12,396
చేసిన పరీక్షలు 17,878
తిరస్కరించినవి 605
పారామీటర్ల సంఖ్య 1,30,753
మరింత పెరిగిన బాధ్యత
టీ-డయాగ్నస్టిక్ హబ్‌కు పరీక్షల కోసం వచ్చే నమూనాలను అత్యాధునిక యంత్రాల సహాయంతో పరీక్షలు చేస్తున్నాం. అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ ఖచ్చితమైన విశ్లేషణా ఫలితాలు అందజేస్తున్నాం. వికారాబాద్ డీ-హబ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇస్తున్న ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. మా బాధ్యతను మరింతగా పెంచినట్లుగా భావిస్తున్నాం
- డాక్టర్ బ్రెజిలిన్, టీ డయాగ్నస్టిక్ హబ్ ఇన్‌చార్జి, వికారాబాద్