కొడంగల్ నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు
ABN , First Publish Date - 2021-07-24T05:35:05+05:30 IST
కొడంగల్ నియోజకవర్గంలో మరికొన్ని కొత్త మండలాలు

- 8 గ్రామాలతో గుండుమాల్, 13 గ్రామాలతో కొత్తపల్లి, 12 గ్రామాలతో దుద్యాల్ మండలాల ఏర్పాటు
- డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసిన ప్రభుత్వం
- ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చొరవతో మండలాల విభజన
కొడంగల్: కొడంగల్ నియోజకవర్గంలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చొరవతో కొడంగల్ నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా మరో 3 కొత్త మండలాల ఏర్పాటు చేస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడింది. నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్ మండలంలోని దుద్యాల్, నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలోని గుండుమాల్, మద్దూర్ మండలంలోని కొత్తపల్లి నూతన మండలాలుగా ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి కొత్త మండలాల ఏర్పాటు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మండలాల ఏర్పాటుతో నియోజకవర్గంలో మండలాల సంఖ్య 5 నుంచి 8కు చేరుకుంది. ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో నూతన జిల్లాలు, నూతన మండలాలను ఏర్పాటు చేయగా.. అప్పుడే నియోజకవర్గంలోని కొత్తపల్లి, గుండుమాల్, దుద్యాల్, రుద్రారంను మండలాలుగా చేయాలని ప్రజలు కోరారు. ఇందుకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి హామీ మేరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మండలాల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. జిల్లాల పునర్విభజన సమయంలో కోస్గి మండల పరిధిలోకి వెళ్లిన హకీంపేట్, పోలెపల్లి గ్రామాలు తిరిగి వికారాబాద్ జిల్లాలో విలీనం కానున్నాయి.
ఎనిమిది గ్రామాలతో గుండుమాల్ మండలం
కోస్గి మండలంలోని 8 గ్రామాలతో కలిపి గుండుమాల్ మండలంగా మారనుంది. అందులో గుండుమాల్, భక్తిమళ్ల, అప్పాయిపల్లి, మల్రెడ్డిపల్లి, బోగారం, సారంగరావుపల్లి, అమ్లికుంట, బలభద్రయపల్లి గ్రామాలు ఉన్నాయి.
బొంరాస్‌పేట్ మండలంలోని దుద్యాల్ 12 గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు కానుంది. అందులో మండల పరిధిలోని లగచర్ల, గౌరారం, మంచన్‌పల్లి, ఈర్లపల్లి, చిలుముల్‌మైలారం, హంసన్‌పల్లి, నాజ్ఖాన్పల్లితోపాటు దౌల్తాబాద్ మండలంలోని కుదురుమళ్ల, కొడంగల్ మండలంలోని ఆలేడ్, నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలోని హకీంపేట్, పోలెపల్లి గ్రామాలతో కలిపి నూతన మండలంగా ఏర్పాటు కానుంది. నూతన మండలాలు నారాయణపేట్ డివిజన్లో విలీనం చేస్తారని వాదనలు రావడంతో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తాండూర్ డివిజన్‌లోనే కొనసాగుతాయని హామీ ఇవ్వడంతో ఊరటనిచ్చింది.