రాజకీయ పార్టీల్లో నయాజోష్‌!

ABN , First Publish Date - 2021-12-31T04:49:51+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి.

రాజకీయ పార్టీల్లో నయాజోష్‌!

  • రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు  
  • అధికార పార్టీది అభివృద్ధి, సంక్షేమ బాట 
  • ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల పోరుబాట 
  • చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర 
  • ప్రభుత్వాల విధానాలపై వామపక్షాల ఆందోళన


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ ఏడాది అధికార టీఆర్‌ఎ్‌సతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలో నయా జోష్‌ కనిపించింది. ప్రధానంగా ద్వితీయార్థంలో ప్రధాన పార్టీలు వివిధ సమస్యలపై ప్రజల్లోకి  వెళ్లడానికి ప్రయత్నం చేశాయి. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టగా, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఆందోళనలు నిర్వహించింది. గత ఏడేనిమిదేళ్లతో పోలిస్తే ప్రతిపక్ష పార్టీలు ఈ ఏడాది గొంతు పెగిల్చి ప్రభుత్వంపై పోరుబాట పట్టాయి.  అధికార పార్టీ బలహీన పడడంతో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. పోలీసుల అరెస్టులకు సైతం భయపడకుండా ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి.  

- ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి


సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌...

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రజల్లో నిలిచే ప్రయత్నం చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నించారు. మంత్రి సబితారెడ్డి వివిధ కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూవచ్చారు. ఉమ్మడిజిల్లాలో రోజూ ఎక్కడోచోట ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వచ్చారు. అభివృద్ధి పనులు, ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీచేస్తూ వచ్చారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహే్‌షరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రోజూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో శుభోదయం పేరిట ఎమ్మెల్యే కాలె యాదయ్య గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మొదటివిడత శుభోదయం విజయవంతం కావడంతో రెండోవిడత కార్యక్రమాన్ని నవంబర్‌ 8న రావులపల్లిలో మొదలుపెట్టారు. ప్రజాసమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, నగరశివారు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ, ప్రజాకార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పాలుపంచుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లు నవంబర్‌ 11న, డిసెంబర్‌ 20న నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు. 


ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ పరం

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సురభి వాణీదేవి విజయం సాధించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు శుభప్రద్‌ పటేల్‌ను బీసీ కమిషన్‌ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  


గులాబీ గూటిలో వర్గ విభేదాలు

తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య విబేధాలు మరింత రచ్చకెక్కాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోక్యం చేసుకుని కలిసి పోవాలని ఇద్దరికీ సూచించినా ఇంకా వర్గవిబేధాలు కొనసాగుతూనే ఉం డడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. అధికార పార్టీలో నెలకొన్న విబేధాలు కొన్ని సందర్భాల్లో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.


ప్రజాసంగ్రామ పాదయాత్రతో కమలం వికాసం

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 29 ప్రారంభమైన పాదయాత్ర ఆ జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగింది. సెప్టెంబర్‌ 2న యాత్ర వికారాబాద్‌ జిల్లాకు చేరుకుంది. యాత్రకు వికారాబాద్‌ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. సెప్టెంబర్‌ 2న జిల్లాలో అడుగు పెట్టిన సంజయ్‌ 6వ తేదీ మధ్యాహ్నం వరకు 5 రోజుల పాటు 44 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు ప్రచారం నిర్వహించి బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. కాగా, మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. జనవరి 18న వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. మేడ్చల్‌ జిల్లాలో పట్టు సాధించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బలోపేతం చేసే దిశగా దృష్టి సారించిన పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఘట్‌కేసర్‌ మండలంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు. 

జీహెచ్‌ఎంసీలో బలపడిన బీజేపీ

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా బలపడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా పట్టు బిగించింది. నగర శివారులో గతంలో కంటే బీజేపీ ఎక్కువ పట్టు బిగించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సర్వశక్తులొడ్డినా బీజేపీ అధికార పార్టీని ఢీకొని తన సత్తా చాటుకుంది. కొన్ని డివిజన్ల పరిధిలో అధికార పార్టీ నేతలకు బీజేపీ నాయకులు ముచ్చెమటలు పట్టించారు. 


రేవంత్‌ రాకతో కాంగ్రె్‌సకు ఊపిరి

టీపీసీసీ అధ్యక్షుడిగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించడం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రె్‌సలో నయా జోష్‌ నింపింది. ఇంతకు ముందు పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు అంతంత మాత్రంగానే పార్టీ కార్యకర్తలు హాజరు కాగా, ఇటీవల కాలంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్న వారిసంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ పోరుబాట పట్టింది. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరలను అరికట్టాలని డిసెంబర్‌ 19న రేవంత్‌రెడ్డి మొయినాబాద్‌ మండలం ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రావిర్యాల వద్ద జోరువానలోనూ సభను సక్సెస్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లాలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌ మహరాజ్‌, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా ఇటీవల కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించి పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో రెండు రోజుల పాటు రేవంత్‌రెడ్డి దళితదీక్ష చేపట్టి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొనేలా చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేశారు. 


 చేవెళ్ల సెంటిమెంట్‌తో షర్మిల పాదయాత్ర

చేవెళ్ల సెంటిమెంట్‌తో అక్టోబరు 20నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక రాష్ట్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వైఎస్‌ షర్మిల వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించి రాజ్యాధికారం కోసం తొలిఅడుగు చేవెళ్ల నుంచి ప్రారంభించారు. తన తండ్రి వైస్‌కు ఎంతో అచ్చివచ్చిన చేవెళ్ల నుంచే ఆమె పాదయాత్ర నిర్వహించారు. చేవెళ్లలో మొదటి రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జిల్ల్లాలో ఏడు రోజుల పాటు ఆమె పాదయాత్ర కొనసాగించారు. గత యాసంగిలో వికారాబాద్‌ జిల్లాలో దోమ, పరిగి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. దోమ మండలంలో పాలేపల్లి, పరిగిలోని ఐకేపీ కేంద్రాలను ఆమె సందర్శించారు. 


కార్యాలయం ప్రారంభించిన ప్రవీణ్‌కుమార్‌

జిల్లాలో ఇటీవల పరిగిలో బీఎస్పీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.


ప్రజాసమస్యలపై గళమెత్తిన వామపక్షాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వామపక్ష పార్టీలు ఎప్పకప్పుడు ఎండగడుతూ వచ్చాయి. సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు ఽపెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు, భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రేషన్‌కార్డులు, ఆసరా ఫించన్లు తదితర సమస్యలపై వివిధ రూపాల్లో ఆ పార్టీల కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రెండు రోజుల కిందట వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా కీసరలో బుధ, గురువారాల్లో సీపీఐకి చెందిన వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహించింది. ఈ సభల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - 2021-12-31T04:49:51+05:30 IST