కేసీఆర్‌ సర్కార్‌ను పారద్రోలే వరకు బీజేపీ ధర్మయుద్ధం

ABN , First Publish Date - 2021-11-01T04:52:33+05:30 IST

BJP is a crusade until the overthrow of the KCR government

కేసీఆర్‌ సర్కార్‌ను పారద్రోలే వరకు బీజేపీ ధర్మయుద్ధం
మైసిగండి ఆలయంలో పూజలు చేస్తున్న బండి సంజయ్‌

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


ఆమనగల్లు : ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ను పారద్రోలే వరకు బీజేపీ ధర్మయుద్ధం కొనసాగించి అంతిమ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైందని, ఇక ఎంతోకాలం టీఆర్‌ఎస్‌ మనలేదని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో ఆదివారం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డిలతో కలిసి బండి సంజయ్‌ పర్యటించారు. కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. తన సతీమణితో కలిసి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన బండి సంజయ్‌కి ఆలయ అర్చకులు, బీజేపీ నాయకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో బండి సంజయ్‌ దంపతులను సత్కరించారు. తొలివిడత బీజేపీ ప్రజాసంగ్రామ పాదయాత్ర విజయవంతమైనందుకు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగి బీజేపీని ప్రజలు ఆదరించినందుకు మైసమ్మ దేవతను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. మైసిగండి, ఆమనగల్లులో బండి సంజయ్‌ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ ధన రాజకీయాలు చూసి దేశం సిగ్గుపడుతుందని, ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ బరితెగించిన పాలనకు ప్రజలు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఫామ్‌హౌజ్‌లో తాగి పడుకునే, ప్రగతిభవన్‌ను వీడి బయటకు రాని సీఎం కేసీఆర్‌కు ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని బండి సంజయ్‌ ప్రశ్నించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అఽభ్యర్థి ఈటెల రాజేందర్‌ భారీ మెజార్టీ తో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిఫల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కాసుల వెంకటేశ్‌, బీజేపీ అధ్యక్షులు మన్యానాయక్‌, చెక్కాల లక్ష్మణ్‌, లక్ష్మణ్‌రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు రాంరెడ్డి,గోరటి నర్సింహ్మ, బీజేపీ జిల్లా మండల నాయకులు  సుండూరు శేఖర్‌, విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, విక్రమ్‌రెడ్డి, కృష్ణయాదవ్‌, ప్రభాకర్‌, శ్రీకాంత్‌ సింగ్‌, కండె సాయి, శ్రీధర్‌, పాష, తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-11-01T04:52:33+05:30 IST