మళ్లీ తప్పులు!

ABN , First Publish Date - 2021-12-27T04:55:25+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది.

మళ్లీ తప్పులు!

  • ఎస్‌ఏ ఇంగ్లిష్‌, ఫిజికల్‌సైన్స్‌ లిస్టులో అధికంగా తప్పులు 
  • సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లనుసరిచేశాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలి
  • నేడు బహుదూర్‌గూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆప్షన్‌ ఫారాల అందజేత
  • జీవో 317తో నష్టపోయిన టీచర్లు 28న సచివాలయం ముట్టడికి పిలుపు


ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. సీనియారిటీ జాబితాల్లో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. ఒక తప్పును సరిచేస్తే మరో తప్పు వచ్చి చేరుతోంది. వారం పది రోజులుగా ఇదే తంతు సాగుతోంది. సీనియారిటీ జాబితాపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ మళ్లీ పొరపాట్లు పునరావృతం కావడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. వీటిని పూర్తిగా సవరించిన తర్వాతే కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 16 వేలకు మంది ఉద్యోగులకు పైగా జిల్లా కేడర్‌ పోస్టులు కేటాయించారు. ఇందులో విద్యా శాఖకు సంబంధించి 10,622 మంది ఉపాధ్యాయుల కేటాయింపు జరిగింది. ఇందులో మహబూబ్‌నగర్‌కు 374, రంగారెడ్డిజిల్లాకు 4,051, మేడ్చల్‌ 2,754, వికారా బాద్‌ 3,443 ఉపాధ్యాయులను కేటాయించారు. అన్ని శాఖల్లో కేటాయింపు ప్రక్రియ ఒకటి రెండురోజుల్లో పూర్తికాగా.. విద్యాశాఖలో ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉండటంతో తప్పులు సవరించడంలో ఎక్కువ సమయం పడుతోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ ప్రకారం బదిలీలు జరగాల్సి ఉండగా.. తక్కువ సీనియారిటీ ఉన్నవాళ్లు ముందుకు, ఎక్కువ సీనియారిటీ ఉన్న టీచర్లు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సీనియారిటీ జాబితా మొదలుకుని ఆప్షన్ల విషయంలో నెలకొన్న తప్పులకు సంబంధించి సుమారు 4వేల వరకు అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. మంత్రులకు వినతులు చేస్తున్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా తప్పులు మాత్రం సవరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. జీవో 317 వల్ల నష్టపోయిన టీచర్లు ఈనెల 28న సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 


నేడు ఆప్షన్‌ ఫారాలు అందజేత

జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులందరూ నేటి నుంచి ఎల్బీనగర్‌లోని బహుదూర్‌గూడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఉదయం 10గంటల నుంచి ఆప్షన్‌ ఫారాలను సమర్పించనున్నారు. జిల్లాల విభజనలో భాగంగా కొత్త జిల్లాలకు కేటాయించిన టీచర్లకు సంబంధించిన సీనియారిటీ, ఖాళీల జాబితాను వెబ్‌సైట్‌లో ఉం చారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్‌ ఫారాలను నింపి నేడు అందజేయాలని డీఈవో ఉపాధ్యాయులకు సూచించారు.  


ఎస్‌ఏ ఇంగ్లిష్‌, ఫిజికల్‌సైన్స్‌ లిస్టులో తప్పులు

స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌, ఫిజికల్‌ సైన్స్‌ సీనియారిటీ లిస్టులో చాలావరకు తప్పులు దొర్లినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 10 మండలాలు రంగారెడ్డి జిల్లాలో విలీనమయ్యాయి. దీనికి సంబంధించి అన్ని కేటగిరీల సీనియారిటీ లిస్టు ముందుగా ప్రకటించడంతో ఉపాధ్యాయులకు సమస్యలు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు వెబ్‌సైట్‌లో ప్రకటించాలని కోరుతున్నారు. వారికి సంబంధించిన వివరాలు లేకుండానే వారందరినీ అన్ని కేటగిరీల సీనియారిటీ లిస్టులో ముందుగా పెట్టారని ఆందోళన చెందుతున్నారు. వారితోపాటు జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టి సరైన సీనియారిటీ లిస్టు తయారు చేసిన తర్వాతనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 


ఉపాధ్యాయ ఖాళీలు చూపించాలి

జిల్లా విభజనలో భాగంగా వేరే జిల్లాకు కేటాయించబడిన ఖాళీలను మాత్రమే చూపిస్తున్నారని, ఇప్పటివరకు ఉన్న ఖాళీలను చూపించడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులతోపాటు ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ ఖాళీల జాబితాల్లో చూపించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఖాళీలు చూయించకుంటే బదిలీల్లో చాలాదూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తప్పులు సరిచేశాకే కౌన్సెలింగ్‌ నిర్వహించాలి : ఉపాధ్యాయ సంఘాల నేతలు

సీనియారిటీ జాబితాల్లో తప్పులను సరిచేశాకే కౌన్సిల్సింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని టీయుటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రఘునందర్‌రెడ్డి, తపస్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు రవి, ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఖాళీల జాబితాలో మొన్న ఏర్పడిన ఖాళీలే కాకుండా జిల్లాలో ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీలు అన్నింటినీ ప్రకటించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. 


నష్టపోయిన టీచర్లు 28న సచివాలయం ముట్టడి : టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య

జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యత ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యుటీఎఫ్‌) రంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని గున్‌గల్‌ ఎక్స్‌రోడ్డులో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. భార్యా భర్తలు, సీనియా రిటీపై అప్పీల్స్‌ సత్వరమే పరిష్కరించాలన్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను విస్మ రించి వేలాది మంది ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాల నుంచి బలవంతంగా వేరే జిల్లాలకు కేటాయించటాన్ని నిరసిస్తూ, బలవంతపు బదిలీలకు బలైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత ఉపాధ్యాయులు మంగళవారం (డిసెంబర్‌ 28)న సచివాలయం ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి గాలయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన జీవో వల్ల ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని, జీవో 317ను రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశ ప్రారంభానికి ముందు సంఘం సీనియర్‌ నాయకులు ఎస్‌ఆర్‌ ఆంజనేయులు టీఎస్‌యూటీఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్‌ నాయక్‌, నాయకులు కల్ప, నాగేంద్ర, కిషన్‌, శివారెడ్డి, భవంత్‌రాజ్‌, నర్సింహులుగౌడ్‌, రామకృష్ణ, సుగంధ, వెంకటేష్‌, చంద్రయ్య, మహిపాల్‌, మల్లేష్‌, రాములయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.


సీనియారిటీ జాబితాల్లో తప్పులు 

ఆమె పేరు పి. శృతి, సీరియల్‌ నెంబర్‌ 19, ఆమె 2002 డీఎస్సీ ఎస్‌జీటీలో ఎంపిక కాగా 2009లో పదోన్నతి పొందారు. ఆమె పేరుకు ముందు సీనియారిటీ జాబితాలో 16 మంది జూనియర్ల పేరు వచ్చాయి. దీంతో ఆమె సీనియారిటీని కోల్పోతున్నారు. సీనియారిటీ జాబితాల్లో దొర్లిన తప్పులను సరిచేసి తనకు న్యాయం చేయాలని ఆమె డీఈవోకు విన్నవించారు.


కొత్త జాబితా ప్రకటనతో అన్యాయం 

అతని పేరు కె. తిరుపతిరెడ్డి. స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజిక్స్‌ టీచర్‌. విభజనలో భాగంగా ఉపాధ్యాయుల కేటాయింపు లిస్టులో అతని నెంబర్‌ 371గా నమో దైంది. ప్రస్తుతం కొత్తగా ప్రకటించిన జాబితాలో 83గా వెలువడింది. అతని తర్వాత ఉన్నవారు ప్రస్తుతం సీనియారిటీ జాబితాల్లో ముందుకువచ్చారు. న్యాయం చేయాలని కోరుతూ డీఈవోకు వినతి చేసుకున్నారు.

Updated Date - 2021-12-27T04:55:25+05:30 IST